Bharat Taxi App: భారత్ టాక్సీ వచ్చేస్తోంది
కొత్త ఏడాది కానుకగా జనవరి 1 నుంచి 'భారత్ టాక్సీ' సేవలు ప్రారంభం కానున్నాయి. సహకార నమూనాలో నడిచే ఈ యాప్ ద్వారా ఓలా, ఊబర్‌లకు పోటీగా చౌక ప్రయాణం అందుబాటులోకి రానుంది.
సహకార సమాఖ్య స్ఫూర్తితో దేశంలో భారత్ టాక్సీని ప్రారంభిస్తున్నారు. ఊబర్, ఓలా, రాపిడో వంటి కార్పొరేట్ సంస్థలకు ధీటుగా భారత్ టాక్సీని భారత దేశ రోడ్లపై నడపనున్నారు. దేశంలో సహకార సమాఖ్య స్ఫూర్తితో మిల్క్ యూనియన్లు, బ్యాంకులు నడుస్తున్న విషయం తెలిసిందే. కొన్ని లక్షల మంది వీటి ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆర్థికంగా లబ్ధి పొందుతున్నారు. కార్పొరేట్ క్యాబ్ సంస్థల మాదిరి ఇక్కడ డ్రైవర్ల నుంచి కమిషన్లు వసూలు చేయరు. కేవలం ఫ్లాట్ ఫారం ఖర్చులు మాత్రమే తీసుకుంటారు. వినియోగదారుల నుంచి కూడా ఇష్టానుసారంగా, డిమాండ్ ను బట్టి డబ్బులు ముక్కు పిండి వసూలు చేయరు. నూతన సంవత్సరం ప్రారంభం రోజు అనగా జనవరి ఒకటి నుంచి కారు, ఆటో, టూ వీలర్ ను భారత్ టాక్సీ యాప్ లో బుక్ చేసుకోవచ్చు. తొలుత భారత్ టాక్సీ సేవలు న్యూఢిల్లీ లో ప్రారంభించి ఆ తరువాత దేశంలోని మెట్రో నగరాలకు విస్తరించనున్నారు.
ప్రస్తుతం దేశంలో ఓలా, ఊబర్ తో పాటు రాపిడో వంటి కార్పొరేట్ సంస్థలు క్యాబ్ సర్వీసు సేవలు అందిస్తున్నాయి. ఈ సంస్థల్లో చేరేందుకు ప్రతి డ్రైవర్ లేదా వాహన యజమాని ముందుగా తన పేరు, వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి నమోదు అయిన తరువాత వాహనాలను రోడ్లపై సంబంధిత సంస్థలు అనుమతిస్తాయి. ప్రతి బుకింగ్ మొత్తం నుంచి కనీసం 20 నుంచి 30 శాతం కమీషన్లు ఈ సంస్థలు తీసుకుంటున్నాయి. ఇందులో నుంచి కొద్ది మొత్తం మాత్రమే డ్రైవర్లకు ముట్టచెప్పుతున్నాయి. చేసిన పనికి సమానంగా డబ్బులు రానప్పటికీ, గత్యంతరం లేక వాహన యజమానులు నడపక తప్పడం లేదు. కోవిడ్ తరువాత వీరి కష్టాలు మరింతగా పెరిగాయి. అంతకు ముందు డబ్బులను ఫ్లాట్ ఫారం సంస్థలకు బుకింగ్ చేసుకున్న వినియోగదారుడు చెల్లించేవాడు. ఆ తరువాత వాహనాల సంఖ్య తగ్గడం, ఎప్పటికప్పుడు సంస్థలు డబ్బులు చెల్లించకపోవడంతో వాహన యజమానులు, డ్రైవర్లు రూట్ మార్చారు. బుకింగ్ మొత్తాన్ని తమకే చెల్లించాలని, గమ్యం చేరిన తరువాత ఆన్ లైన్ లో తీసుకుంటామని షరతు విధించడంతో కార్పొరేట్ సంస్థలు దిగిరాక తప్ప లేదు. ప్రస్తుతం ప్రతి వాహన యజమాని లేదా డ్రైవర్ నేరుగా తన ఖాతాలో డబ్బులు వేయించుకుంటున్నారు. అయినా కమీషన్ల బాధ తప్పడం లేదని డ్రైవర్లు వాపోతున్నారు. ఉదయం, సాయంత్రం సమయాలలో అధిక ఛార్జీలు వేస్తున్నాయి. మార్గ మధ్యలో ట్రాఫిక్ సమస్య ఉన్నట్లయితే అదనంగా బాదుతున్నారు. దీంతో తక్కువ రేటుకు బుక్ చేసుకున్న వినియోగదారుడు, గమ్యస్థానం వద్ద దిగిన తరువాత రెట్టింపు మొత్తాన్ని చెల్లిస్తున్నారు. రద్దీ సమయాలను కార్పొరేట్ సంస్థలు సొమ్ము చేసుకుంటున్నాయనే ఆరోపణలు ఉన్నా ఏమి చేయలేని స్థితిలో వినియోగదారులు ఉన్నారు. ఈ సమస్యల నుంచి వినియోగదారులకు రక్షణ కల్పించడం, అధిక ఛార్జీల భారం తగ్గించడం, కమీషన్ల నుంచి వాహన యజమానులకు విముక్తి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం సహకార సమాఖ్య స్ఫూర్తితో భారత్ టాక్సీ ని తీసుకువస్తున్నది. దీని కోసం భారత్ టాక్సీ యాప్ ను కూడా రూపొందించారు. బేటా వర్షన్ ప్రస్తుతం ప్రయోగ దశలో ఉన్నది. ప్రారంభోత్సవం నాటికి పూర్తి స్థాయిలో తీసుకురానున్నారు. ఊబర్, ఓలా, రాపిడోలకు పోటీగా ఈ యాప్ ను తీర్చిదిద్దుతున్నారు. యాప్ మార్కెట్ లోకి వచ్చిన తరువాత కూడా మార్పులు, చేర్పులు చేయనున్నారు. ప్రయాణీకులను నుంచి సూచనలు, సలహాలు స్వీకరించనున్నారు. పది రోజుల వ్యవధిలో సుమారు 51వేల మంది వాహన యజమానుల లేదా డ్రైవర్లు తమ పేర్లు నమోదు చేసుకున్నారు.
అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఉబర్, లిప్ట్ యాప్ లకు పోటీగా 2021 నుంచి సహకార సమాఖ్య విధానంలో క్యాబ్ లు విజయవంతంగా నడుపుతున్నారు. మన దేశంలోని గోవా లో కూడా ఇదే రకంగా నడుపుతున్నారు. సహకారం విధానం కానప్పటికీ, అందరూ కలిసి టాక్సీ యూనియన్ గా టాక్సీలను నడుపుతూ, ఆర్థికంగా బలపడుతున్నారు. యూనియన్ టాక్సీలు ఇష్టానుసారంగా ఛార్జీలు వసూలు చేయకుండా ఉండేందుకు గోవా ప్రభుత్వం ఎప్పటికప్పుడు నియంత్రణ చర్యలు తీసుకుంటున్నది.
ఇవి కూడా చదవండి :
Rukmini Vasanth | అదిరిపోయే లుక్‌లో కాంతారా భామ.. రుక్మిణి బ్యూటిఫుల్ ఫొటోస్
Rukmini Vasanth | అదిరిపోయే లుక్‌లో కాంతారా భామ.. రుక్మిణి బ్యూటిఫుల్ ఫొటోస్
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram