Dowry Harassment | అదనపు కట్నం అడిగారని పెళ్లి క్యాన్సిల్‌ చేసుకున్న వధువు.. యూపీలో ఘటన (Viral Videos)

అదనపు కట్నం కావాలని డిమాండ్‌ చేయడమే కాకుండా.. నచ్చచెప్పేందుకు ప్రయత్నించిన పెళ్లికూతురు తండ్రిని దుర్భాషలాడాడు ఒకడు. దీంతో తిక్కరేగిన వధువు.. ఇలాంటి వాడితో జీవించలేనని చెబుతూ పెళ్లి రద్దు చేసుకుంది. ఈ ఘటన యూపీలోని బరేలీలో చోటు చేసుకున్నది.

Dowry Harassment | ఆధునిక కాలంలో కూడా కట్నం కోసం పీడించేవాళ్లు అక్కడక్కడా తారసపడుతూనే ఉంటారు. కట్నం ఇచ్చిన తర్వాత కూడా అదనపు కట్నం కావాలని డిమాండ్‌ చేస్తుంటారు. అదనపు కట్నం కోసం వేధించి, చంపినవాళ్లూ ఉన్నారు. యూపీలోని బరేలీలో ఒక పెళ్లికొడుకు ముందుగా అనుకున్న కట్నం కంటే అదనంగా 20 లక్షలు, ఒక బ్రెజ్జా కారు కావాలని పట్టుబట్టాడు. దీంతో తిక్కరేగిన వధువు.. వాడిని పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది.

వధువు పేర్కొన్న వివరాల ప్రకారం.. పెళ్లికొడుకు ఊరేగింపు.. పెళ్లి షెడ్యూల్‌ కంటే ముందుగానే తెల్లవారుజామున 2 గంటలకు పెళ్లికూతురు ఇంటికి చేరుకుంది. అయితే.. వచ్చీరావడంతోనే పెళ్లికొడుకు కుటుంబ సభ్యులు అదనపు కట్నం కోసం డిమాండ్‌ చేశారు. కట్నం, కారు ఇవ్వకపోతే పెళ్లి పీటలపై కూర్చొనేది లేదని భీష్మించాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఆమె ఒక వైరల్‌ వీడియోలో వివరించింది. ‘నేను బారాత్‌ కోసం ఎదురు చూస్తున్నా. తెల్లవారుజామన 2 గంటల వరకు ఎదురు చూస్తూనే ఉన్నా. అప్పుడు వాళ్లు వచ్చారు. తలుపు దగ్గరే నిలబడి.. ‘మాకు 20 లక్షల అదనపు కట్నం, ఒక బ్రెజ్జా కారు కావాలని డిమాండ్‌ చేశారు. మా నాన్న వాళ్లతో మాట్లాడేందుకు ప్రయత్నించాడు. వాళ్లను ఒప్పించేందుకు చూశాడు. కానీ వాళ్లు మా నాన్నను నానా మాటలన్నారు’ అని ఆమె తెలిపింది. బంధువులందరి ముందు తన సోదరుడు, తండ్రిని అవమానకరంగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేసింది.

‘కట్నం కోసం ఇలా వేధించేవాడిని నేను పెళ్లి చేసుకోను. నా తండ్రిని గౌరవించని వ్యక్తితో నేను జీవించలేను. ఇలాంటి అన్యాయం మరో అమ్మాయికి జరుగకుండా నాకు న్యాయం చేయాలి’ అని ఆమె ఆ వీడియోలో కోరింది. ఈ ఘటనపై బరేలీ పోలీసులు సూమోటో కేసు నమోదు చేశారు. ఈ కేసులో దర్యాప్తు చేస్తున్నామని ఎక్స్‌లో తెలిపారు.

ఈ ఏడాది ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్‌ నొయిడా సిర్సా గ్రామంలో చోటు చేసుకున్న 26 ఏళ్ల నిక్కీ భాటి హత్య యావత్ దేశాన్ని కలవరపరించింది. కట్నం వేధింపులతో ఒక యువతిని ఆమె భర్త, అత్తమామలు తీవ్రంగా కొట్టి, తగులబెట్టేశారు. ఈ ఘటనలో భాటి ప్రాణాలు కోల్పోయింది. ఆ సమయానికి ఆమెకు ఆరేళ్ల కుమారుడు ఉన్నాడు. తమ కూతురికి న్యాయం చేయాలని భాటి తల్లిదండ్రులు న్యాయపోరాటం చేస్తూనే ఉన్నారు. ఈ భయానక ఘటనలో ఆమె భర్త, అత్త సహా నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన అప్పటికప్పుడు ఉద్రేకాలతో చోటు చేసుకున్నది కూడా కాదు. దాదాపు తొమ్మిదేళ్లుగా ఆమెను అత్తమామలు, భర్త అదనపు కట్నం కోసం వేధిస్తున్నారు. ఈ కేసు దేశంలో కట్నం పేరుతో వేధింపులపై తాజా చర్చను లేవదీసింది.

ఇవి కూడా చదవండి..

Chennai Surat Highway | తెలంగాణను తాకుతూ వెళ్లే సూరత్‌–చెన్నై ఎక్స్‌ప్రెస్‌వే పొడవు కుదింపు..
Voyager Station | అంతరిక్షంలో బార్‌ అండ్‌ రెస్టారెంట్‌.. ఎప్పుడు? ఎలా వెళ్లాలి?
CIA Lost nuclear device | హిమాలయాల్లో పొంచి ఉన్న అణు ముప్పు!

Latest News