Site icon vidhaatha

Sannidhanam Sharma | భరణి చూపిన ప్రేమ, పురాణపండతో అనుబంధం మరువలేనివన్న సన్నిధానం శర్మ

Sannidhanam Sharma | స్పష్టమైన వాచికంతో , వినసొంపైన నుడికారంతో , కవుల పట్లా, కవిత్వం పట్లా విడదీయలేని ప్రేమను వర్షించే ప్రముఖ రచయిత , ఆధ్యాత్మిక భావజాల పరీవ్యాప్తికోసం తన జీవితాన్ని నికార్సుగా శ్రీ వేంకటేశ్వరుని చరణాలకు అర్పిస్తున్న పుస్తక మాంత్రికుడు పురాణపండ శ్రీనివాస్ ఒక డెబ్భైయేళ్ళవ్యక్తితో విఖ్యాత నటులు , ప్రముఖ రచయిత ఆటకదరా శివా ఫేమ్ తనికెళ్ళ భరణి ఇంట ప్రత్యక్షమయ్యారు. భరణి ఈ డెబ్భై ఏళ్ళ వ్యక్తి పట్ల చూపిన ఆత్మీయత అక్కడివారిని అబ్బుర పరిచింది. ఆ వ్యక్తి తీసుకొచ్చినందుకు పురాణపండ శ్రీనివాస్ ను భరణి అభినందించారు. తనికెళ్ళ భరణి పురాణపండ శ్రీనివాస్ కలిసి గత రెండు దశాబ్దాలుగా అనేక సభల్లో అతిధులుగా పాల్గొన్న విషయం పాఠకలోకానికి ఎరుకే. అంతే కాకుండా పుస్తకమాంత్రికుడైన పురాణపండ అమోఘ రచనాశైలి, పుస్తక ముద్రణలో ఆరితేరిన ఘనాపాఠీ గా పురాణపండ ను తన పుస్తకం ముందుమాటలో అభినందించారు తనికెళ్ళ భరణి.

శ్రీనివాస్ కి భరణి మాట శివ స్పర్శ . ఈ చనువుతో ఈ ఏడుపదులు దాటిన వ్యక్తిని భరణి ఇంటికి తీసుకొచ్చారు పురాణపండ. ఇంతకీ ఆయన ఎవరో కాదు … సాహితీ రంగపు మహాత్ములైన దిగ్గజాలు నేదునూరి గంగాధరం , మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి , మల్లంపల్లి శరభేశ్వర శర్మ , ఆరుద్ర , చలసాని ప్రసాద్ , ఆవంత్స సోమసుందర్ , డాక్టర్ సి . నారాయణరెడ్డి వంటి వారలకు ఎంతో ఇష్టుడైన , శిష్యుడైన , సన్నిహితడైన కవి ప్రముఖుడు, విఖ్యాత సాహితీవేత్త , ప్రాణహిత రచయిత సన్నిధానం నరసింహ శర్మ. చారిత్రాత్మక రాజమహేంద్రవరం సుమారు నాలుగు దశాబ్దాలపాటు శ్రీ గౌతమీ గ్రంధాలయంలో ఉన్నతాధికారిగా ఉద్యోగించి … వందలమంది అభిమానుల్ని సంపాదించుకున్న సన్నిధానం శర్మ దాదాపుగా ఉభయ రాష్ట్రాల్లోని అన్ని విశ్వవిద్యాలయాలలో పరిశోధక విద్యార్థులు సుమారు నలభై శాతం సన్నిధానం శర్మ నుండి తమ పరిశోధనలకు అంతో ఇంతో అనేక అంశాల్ని నేర్చుకున్న వారే !

అద్దేపల్లి రామోహన రావు, నగ్నముని , జ్వాలాముఖి, భైరవయ్య, క్రొత్తపల్లి శ్రీమన్నారాయణ , బొమ్మకంటి సుబ్రహ్మణ్య శాస్త్రి , వాడ్రేవు చిన వీరభద్రుడు , జయధీర్ తిరుమలరావు , సతీష్ చందర్ వంటి ఆధునిక ప్రాచీన అభ్యుదయ దిగంబర కవులకు సన్నిధానం శర్మ ఆప్తుడనేది నిర్వివాదాంశం. భరణితో సన్నిధానం శర్మ సుమారు ఒక గంట సేపు అనేకానేక సాహిత్య విశేషాలతో గడిపారు. ఈ వయస్సులో శర్మ కవిత్వ సాహిత్య సేవకు అనుభూతి చెందిన భరణి సన్నిధానం శర్మను దుస్సాలువతో తన ఇంట సత్కరించారు. గతంలో సన్నిధానం శర్మ , తనికెళ్ళ భరణి కలిసినా విస్తృతంగా మాట్లాడుకునే అవకాశం రాలేదని పురాణపండ శ్రీనివాస్ ఈ సమయంలో శర్మను తీసుకు రావడం చాలా సంతోషం కలిగించిందని తనికెళ్ళ భరణి చెప్పారు. ఈ సందర్భంలో సన్నిధానం నరసింహ శర్మ తన రచనల్ని భారానికి బహూకరించారు.

ఎన్ని తుఫానులెదురైనా నిర్భయ చైతన్యంతో పురాణపండ శ్రీనివాస్ ఒక్కడే సైన్యమై అత్యంత ప్రతిభా సామర్ధ్యాలతో చేస్తున్న సారస్వత సేవ చరిత్రాత్మకమని , ఒక పుస్తకం ప్రచురించడానికి నానా ఇబ్బందులు పడుతుంటే … అలవోకగా ఇన్ని గ్రంధాలు అందించడం … అదీ నిస్వార్ధంగా చెయ్యడం శ్రీనివాస్ కే చెల్లిందని భరణి సన్నిధానం శర్మతో చెప్పడం కొసమెరువుగా చెప్పక తప్పదు. అదీ శ్రీనివాస్ ప్రతిభతో పాటు కఠిన శ్రమ, పెద్దల ఆశీర్వచనంగా సన్నిధానం శర్మ శృతికలిపారు. తనికెళ్ళ భరణి చూపిన ప్రేమ , నీ ఆత్మబంధం నేను మరువలేనని నరసింహ శర్మ పురాణపండ తో అనడంతో సన్నిధానం శర్మ పాదాలకు శ్రీనివాస్ నమస్కరించడం అక్కడివారిని ఆకర్షించింది.

Exit mobile version