విధాత: చోళుల కాలంలో నిర్మించబడి శిథిలావస్థకు చేరుకున్న ఓ ప్రాచీన ఆలయం పునురద్ధణలో బంగారు నాణేలు బయటపడ్డాయి. తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లా జవ్వాదు కొండలపైన ఉన్న కోవిలూర్ గ్రామంలో చోళుల కాలం నాటి ప్రాచీన శివాలయం పునర్ నిర్మాణ పనుల్లో గుంతలు తవ్వుతున్న కూలీలకు ఓ మట్టి గురిగి కనిపించింది. దానిని తీసి చూడగా అందులో నుంచి 103 బంగారు నాణేలు బయటపడ్డాయి. వాటిని రెవెన్యూ శాఖ స్వాధీనం చేసుకుని ప్రభుత్వ ఖజానాలో భద్రపరిచింది.
ఈ ఘటనపై దేవాదాయ శాఖ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సిలంబరసన్ మాట్లాడుతూ చోళుల కాలం నాటి ఈ ఆలయాన్ని ప్రస్తుతం ‘ఆది అరుణాచలేశ్వర ఆలయం’ అని పిలుస్తున్నప్పటికీ, ఇక్కడి శాసనాల ప్రకారం, దీన్ని తిరుమూలనాథర్ ఆలయం అంటారని తెలిపారు. దేవాదాయ శాఖ తరపున ఆలయంలో ప్రస్తుతం పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయని, అక్కడ ఒక గుంత తవ్వుతుండగా, అందులో 103 చిన్న బంగారు నాణేలు లభించాయని వెల్లడించారు. ఆలయానికి సమీపంలో 10వ శతాబ్దం నాటి శాసనం కూడా ఉందని.. అలాగే, చోళుల కాలం నాటి శాసనాలు, ఆలయ గోడపై మరికొన్ని శాసనాలు ఉన్నాయి అని ఆయన తెలిపారు.
