Stampede | లక్నో : కోతులు చేసిన పనికి విద్యుత్ తెగిపడ్డాయి. దీంతో విద్యుత్ షాక్ జరిగే ప్రమాదం ఉందని భావించిన భక్తులు పరుగులు పెట్టారు. దీంతో తొక్కిసలాట జరిగి ఇద్దరు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకిలో సోమవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో చోటు చేసుకుంది.
బారాబంకి జిల్లాలోని అవశనేశ్వర్ మహదేవ్ ఆలయంలో ప్రతి సోమవారం శివుడికి జలాభిషేకం నిర్వహిస్తారు. అయితే శ్రావణ మాసంలో వచ్చే సోమవారాల్లో శివుడికి భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో జలాభిషేకం చేస్తారు. ఇలా చేయడం వల్ల దారిద్య్రం తొలగిపోయి, అష్టైశ్వర్యాలు లభిస్తాయని భక్తుల నమ్మకం. ఈ క్రమంలో భక్తులు శివుడికి జలాభిషేకం చేసేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
అయితే ఆలయ పరిసరాల్లో కోతుల బెడద ఎక్కువ. అక్కడున్న చెట్లపై కోతులు తిరుగుతుండగా, విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. దీంతో విద్యుత్ షాక్ సంభవించే అవకాశం ఉందని భక్తులు భావించి పరుగులు పెట్టారు. ఈ తొక్కిసలాటలో ఇద్దరు భక్తులు ప్రాణాలు కోల్పోగా, మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించినట్లు జిల్లా మెజిస్ట్రేట్ పేర్కొన్నారు.