- ఆదివాసీ సంస్కృతికి నేడు ఆధునికత మేళవింపు
- పర్యావరణాన్ని పరిరక్షించడం సమిష్టి కర్తవ్యం
విధాత, ప్రత్యేక ప్రతినిధి:
Medaram Jatara Rare Photos | మేడారం శ్రీ సమ్మక్క–సారలమ్మ మహాజాతర అనేది కేవలం విశ్వాసంతో కూడుకున్న విషయమే కాకుండా అది అడవితో, ఆదివాసీలతో వనదేవతలతో గాఢమైన అనుబంధం. ప్రకృతితో మేళవించిన ఆదివాసీ జీవన తత్వం. గుడి గోపురాల కంటే అడవులే పవిత్రమన్న భావనతో, శిల్పాలు, శిలల కంటే నిరాకార మూర్తభావన ప్రధానమైనదనే ఆలోచనలు రంగరించుకున్నందున్నే మేడారం జాతర శతాబ్దాలుగా అప్రతిహతంగా కొనసాగుతోంది. దినదిన ప్రవర్ధమానమవుతూ ఆదివాసీ సంప్రదాయాలకు, ఆధునిక వసతులు తోడై ఇప్పుడు కోట్లాది భక్తుల కొంగుబంగారంగా మారింది. ఇదిలా ఉండగా మేడారం అడవులు కోయ గిరిజన తెగకు చెందిన సంప్రదాయానికి, వారి సంస్కృతికి అమూల్యమైన భాండాగారంగా నిలిచింది. వివిధ రుగ్మతలకు చికిత్స చేయడానికి కోయ గిరిజనులు ఉపయోగించే 96కి పైగా ఔషధ వృక్ష జాతులకు ఈ అడవులు నిలయంగా ఉన్నాయని చెబుతున్నారు.
ఆదివాసీ విశ్వాసంలో “అడవి నాశనం అయితే దేవతలు కోపిస్తారు” అనే భావన ఉంది. ఈ నేపథ్యంలోనే సమ్మక్క–సారలమ్మ దేవతలు… అరణ్యాల్లో నివసించే వనదేవతలు! వారి గద్దెలు కూడా అడవి మధ్యనే ఉన్నాయి. జంపన్న వాగు, చిలుకల గుట్ట, వెదురు అడవులు, ఇప్ప చెట్లు, సహజ నేల…. ఇవే మేడారం ఆలయ నిర్మాణానికి హేతువైన శిల్పాలు. ఈ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రకృతిపండుగను, పర్యావరణ హితంగా ముఖ్యంటా అడవి రక్షణంగా నిర్వహించుకోవాలని భావిస్తున్నారు. వన దేవతల స్వరూపం–ప్రకృతి మధ్య ఉన్న అంతర్గత సంబంధమే ఈ మేడారం జాతరని, ఇటువంటి విలువైన మేడారం ప్రకృతిని కాపాడుకోవాల్సిన అవసరం సమిష్టి బాధ్యతగా భావించాలని పర్యావేరణ వేత్తలు భావిస్తున్నారు. దశాబ్దాల క్రితం సాదాసీదాగా జరిగిన మేడారం జాతర ఇప్పుడు ఆధునికతను మేళవించుకుని అన్ని హంగులు, రంగులతో సాగుతోంది. అయినా… అడవే ఆలవాలంగా… ఆకారం లేని ప్రకృతికి పర్యాయపదంగా… ఈ వనదేవతల జాతర శతాబ్దాలుగా సాగుతోంది.
50 ఏళ్ళ క్రితం మేడారం జాతర
యాభై ఏళ్ల క్రింద మేడారం జాతర ఎలా ఉండేదో ఊహించుకుంటే మనకు ఆశ్చర్యానికి లోనవుతారు. అప్పుడు జాతర విశేషాలు, భక్తుల పూనకాలు, మొక్కులు సమర్పించడం , జంపన్న వాగులో ఎడ్ల బండ్ల ప్రయాణాలు, సారలమ్మ గుడిలో భక్తుల మొక్కులు, ఇలా ఎన్నో అరుదైన దృశ్యాలు ఫోటోల రూపంలో ఇప్పటికీ భద్రంగా ఉండి.. చూడడానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంటున్నాయి. తెలుగు విశ్వవిద్యాలయం వరంగల్ జానపద గిరిజన విజ్ఞాన పీఠం ప్రచురించిన ‘మేడారం-సమ్మక్క, సారలమ్మ జాతర’ ప్రత్యేక సంచికలో ఈ ఫోటోలు మనకు దర్శనమిస్తాయి. 1970 నాటి జాతర ఫోటోలు బ్లాక్ అండ్ వైట్ లో ప్రచురించారు. ఈ ఫోటోలు దేవాదాయ శాఖ నుండి సేకరించామని ప్రొఫెసర్ గడ్డం వెంకన్న తెలిపారు. అప్పటి జాతర చైర్మన్ ఈ ఫోటోలను ప్రత్యేక శ్రద్ధతో తీయించి భద్రపరిచినట్లు చెబుతున్నారు. ఆనాటి ఫోటోలు, వీడియోలను ఒక్కసారి పరిశీలిస్తే జాతర అప్పటికీ, ఇప్పటికీ ఎంతగా మారిందో అర్ధం చేసుకోవచ్చు.
