Site icon vidhaatha

Bihar | బాబా సిద్ధేశ్వ‌ర్‌నాథ్ ఆల‌యంలో తొక్కిస‌లాట‌.. ఏడుగురు భ‌క్తులు మృతి

Bihar | పాట్నా : బీహార్( Bihar ) జెహానాబాద్ జిల్లాలో ఆదివారం అర్ధ‌రాత్రి ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. ముగ్ధుంపూర్‌లోని బాబా సిద్ధేశ్వ‌ర్ నాథ్ ఆల‌యం( Baba Sidheshwar Nath temple )లో తొక్కిస‌లాట జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో ఏడుగురు భ‌క్తులు( Devotees ) ప్రాణాలు కోల్పోయారు. మ‌రో 35 మందికి పైగా తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. మృతుల్లో ముగ్గురు మ‌హిళ‌లు ఉన్నారు.

స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని స‌హాయ‌క చర్య‌లు చేప‌ట్టారు. గాయ‌ప‌డ్డ వారిని అంబులెన్స్‌ల్లో స‌మీప ఆస్ప‌త్రుల‌కు త‌ర‌లించారు. మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవ‌కాశం ఉంద‌ని పేర్కొన్నారు. మృతుల కుటుంబ స‌భ్యులు, బంధువులు శోక‌సంద్రంలో మునిగిపోయారు.

శ్రావ‌ణ మాసం నేప‌థ్యంలో ఆల‌యంలో ఆదివారం రాత్రి నిర్వ‌హించిన ఓ వేడుక‌కు భ‌క్తులు భారీ సంఖ్య‌లో త‌ర‌లివ‌చ్చారు. ఈ క్ర‌మంలోనే తొక్కిస‌లాట జ‌రిగింద‌ని ప్ర‌త్య‌క్ష సాక్షి ఒక‌రు తెలిపారు. భారీగా త‌ర‌లివ‌చ్చిన భ‌క్తుల‌ను కంట్రోల్ చేసేందుకు నిర్వాహ‌కులు లాఠీల‌కు ప‌ని చెప్ప‌డంతో.. భ‌క్తులు ప‌రుగులు పెట్టారు. దీంతో తొక్కిస‌లాట జ‌రిగింద‌ని అత‌ను పేర్కొన్నారు. ఈ ప్ర‌మాద ఘ‌ట‌న‌కు కార‌ణం ఆలయ నిర్వాహ‌కులే అని తెలిపారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Exit mobile version