Site icon vidhaatha

వాయుకాలుష్యంతో 2021లో 81 లక్షల మంది మృతి … స్టేట్‌ ఆఫ్‌ గ్లోబల్‌ ఎయిర్‌ 2024 నివేదిక

అధిక రక్తపోటు తర్వాత వాయుకాలుష్యమే అతిపెద్ద మరణ హేతువు
ఆసియా, ఆఫ్రికా దేశాలే అతిపెద్ద బాధితులు

న్యూఢిల్లీ : రోడ్డుపై పోతుంటే వాహనాల నుంచి వచ్చే పొగ.. ఫ్యాక్టరీల నుంచి దట్టంగా వెలువడే పొగ.. అనేక రసాయనాలు కాలిపోతూ.. ఊపిరితిత్తులను కాల్చేస్తున్న పొగ! ఇది కేవలం పొగ కాదు.. ఊపిరి పీల్చుకోవడానికి కూడా వీల్లేకుండా చేస్తున్న మృత్యు కౌగిలి! ఆయువును హరించే వాయుకాలుష్యం! ప్రపంచవ్యాప్తంగా జనాల ప్రాణాలు తీస్తున్నవాటిలో అధిక రక్తపోటు మొదటి స్థానంలో ఉంటే.. దాని తర్వాతి స్థానం ఈ వాయుకాలుష్యానిదేనని జూన్‌ 19వ తేదీన విడుదలైన స్టేట్‌ ఆఫ్‌ గ్లోబల్‌ ఎయిర్‌ 2024 నివేదిక చెబుతున్నది. ఈ వాయుకాలుష్యం ఐదేళ్లలోపు చిన్నారుల జీవితాలను దుర్భర స్థితిలోకి నెట్టివేస్తున్నదని పేర్కొన్నది. ఈ నివేదికను యునిసెఫ్‌ భాగస్వామ్యంతో అమెరికాకు చెందిన రెండు ఆరోగ్య సంస్థలు వెలువరించాయి. 2021లో ఐదేళ్లలోపు పిల్లలు 1,69,400 మంది వాయుకాలుష్యం కారణంగా మృత్యువాత పడ్డారని నివేదిక పేర్కొన్నది.

2021లో రెండో అతిపెద్ద మరణ కారణం

సిగరెట్‌ తాగితే ఎంత ప్రమాదమో.. వాయుకాలుష్యం బారిన పడటం కూడా అంతే ప్రమాదం. మనిషి సగటు ఆయు ప్రమాణం తగ్గుదల ఈ రెండిటితోనూ సమానంగా ఉంటుంది. గుండె సంబంధిత రోగాలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులకు వాయుకాలుష్యం కారణమవుతున్నది. శిలాజ ఇంధనాలను కాల్చినప్పుడు వెలువడే వాయుకాలుష్యంతో ఫైన్‌ పర్టిక్యులేట్‌ మేటర్‌ లేదా పీఎం 2.5.. ధూళి మన ఊపిరితిత్తుల్లోకి యథేచ్ఛగా ప్రవేశిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 2019లో దాదాపు 66.70 లక్షల మంది ఈ వాయుకాలుష్యంతో మృత్యువాత పడ్డారని ఇటీవల లాన్సెట్‌ నివేదిక పేర్కొన్నది. ఓజోన్‌ కారణంగా 3.7 లక్షల మంది, ఇంటి నుంచి వెలువడే వాయుకాలుష్యంతో (వంట చెరుకు కాల్చడం, తగిన పొయ్యిలు వాడకపోవడం వంటివి) సుమారు 23 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. పీఎం 2.5తో 40 లక్షల మందికిపైగా చనిపోయారు.

మొత్తంగా 2021లో సంభవించిన మరణాల్లో దాదాపు 12 శాతం స్థూలంగా వాయుకాలుష్యం కారణంగానేనని స్టేట్‌ ఆఫ్‌ గ్లోబల్‌ ఎయిర్‌ 2024 నివేదిక పేర్కొంటున్నది. గతంలో ఏ సంవత్సరంలోనూ ఇన్ని మరణాలు వాయుకాలుష్యం కారణంగా సంభవించలేదని నివేదిక తెలిపింది. వాయుకాలుష్య భారం రానురాను పెరుగుతున్నదనేందుకు ఇదొక సంకేతమని పేర్కొన్నది. ప్రత్యేకించి స్వల్ప, మధ్యస్థాయి ఆదాయాలు పొందే ప్రజలున్న దేశాలు గరిష్ఠంగా నాలుగు రెట్లు అధికంగా ప్రభావితమవుతున్నాయని తెలిపింది. ఇందులో ఆఫ్రికా, దక్షిణాసియా దేశాలు కూడా ఉన్నాయని పేర్కొన్నది. ప్రత్యేకించి దక్షిణాసియా, తూర్పు ఆసియా, పశ్చిమ, మధ్య ఆసియా దేశాలు, ఆఫ్రికా దక్షిణ దేశాలు అత్యంత భారం మోస్తున్నాయని వెల్లడించింది. ఇందులో భారత్‌ (21 లక్షలు), చైనా (23 లక్షలు) రెండు దేశాలే మొత్తం సగానికిపైగా రోగాలను అనుభవిస్తున్నాయని వివరించింది. ప్రపంచ వ్యాప్తంగా వాయు నాణ్యతను పెంచేందుకు, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని పెంపొందించేందుకు వివిధ దేశాలు కృషి చేయాల్సిన ఆవశ్యకతను ఈ నివేదిక నొక్కి చెప్పింది.

 

Exit mobile version