ఛత్తీస్‌గఢ్‌లో పేలిన మందుపాతర … ఇద్దరు కోబ్రా జవాన్ల మృతి

ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలిన ఘటనలో సీఆర్పీఎఫ్‌కు చెందిన కమాండో బెటాలియన్‌ ఫర్‌ రిసొల్యూట్‌ యాక్షన్‌ (కోబ్రా) జవాన్లు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు

  • Publish Date - June 23, 2024 / 08:40 PM IST

రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలిన ఘటనలో సీఆర్పీఎఫ్‌కు చెందిన కమాండో బెటాలియన్‌ ఫర్‌ రిసొల్యూట్‌ యాక్షన్‌ (కోబ్రా) జవాన్లు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం ఈ పేలుడు చోటు చేసుకున్నది. సిల్గెర్‌, టేకులగూడెం గ్రామాల మధ్య తిమ్మాపురం ప్రాంతంలో మధ్యాహ్నం 3 గంటల సమయంలో కోబ్రా దళాలు ప్రయాణిస్తున్న ట్రక్‌పై నక్సలైట్లు దాడి చేశారని పోలీసులు తెలిపారు. ఈ ప్రాంతం రాజధాని రాయ్‌పూర్‌కు 400 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మోటర్‌ బైకులు, ట్రక్కులో 201 కోబ్రా బెటాలియన్‌ దళాలు వెళుతున్న సమయంలో ఈ పేలుడు చోటు చేసుకున్నదని చెప్పారు. ట్రక్కును నడుపుతున్న జవాన్‌తోపాటు.. ఆయనకు అసిస్టెంట్‌గా ఉన్న మరో జవాను ఈ పేలుడులో చనిపోయారని బస్తర్‌ పోలీసులు విడుదల చేసిన ప్రకటన పేర్కొంటున్నది. మృతులను కానిస్టేబుల్‌ శైలేంద్ర (29), వాహన డ్రైవర్‌ విష్ణు ఆర్‌ (35)గా గుర్తించారు. టేకులగూడెం వరకూ రోడ్‌ ఓపెనింగ్‌ పార్టీ విధుల్లో 201 కోబ్రా బెటాలియన్‌ వెళుతున్నదని సీనియర్‌ పోలీసు అధికారులు తెలిపారు. మావోయిస్టులు మందుపాతర పేల్చిన విషయం తెలియగానే అదనపు బలగాలు అక్కడికి చేరుకున్నాయి. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నాయి. మావోయిస్టుల కోసం కూంబింగ్‌ ఆపరేషన్‌ను భద్రతా బలగాలు కొనసాగిస్తున్నాయి.

Latest News