Prisoner swallow’s Mobile | బెంగళూరు : కర్ణాటక( Karnataka )లోని ఓ జైల్లో దారుణం జరిగింది. ఓ ఖైదీ మొబైల్ ఫోన్( Mobile Phone )ను మింగేశాడు. ఖైదీ( Prisoner )కి తీవ్రమైన కడుపునొప్పి రావడంతో విషయం వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. దౌలత్ అలియాస్ గుండా(30) అనే వ్యక్తి ఓ కేసులో జైలు పాలయ్యాడు. అతనికి న్యాయస్థానం పదేండ్ల జైలు శిక్ష విధించింది. ఇక అతను ఎవరికీ తెలియకుండా ఓ మొబైల్ ఫోన్‌ను సంపాదించగలిగాడు. దాంతో తరుచూ తనకు కావాల్సిన వారితో ఫోన్‌లో సంభాషించేవాడు. పోలీసులు కూడా అతని వద్ద ఫోన్ ఉన్నట్లు పసిగట్టలేకపోయారు.
అయితే ఒక రోజు జైల్లో ఉన్న ఖైదీలను క్షుణ్ణంగా తనిఖీ చేయడం ప్రారంభించారు. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన సదరు ఖైదీ.. తన వద్ద మొబైల్ ఫోన్‌ను మింగేశాడు. ఇక జూన్ 24వ తేదీన తనకు తీవ్రమైన కడుపు నొప్పి వస్తుందని ఆ ఖైదీ.. జైలు అధికారులకు తెలియపరిచాడు. దీంతో అతన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఎక్స్‌రే( X Ray ) నిర్వహించగా, కడుపులో ఏదో మెటల్ ఉన్నట్లు డాక్టర్లు నిర్దారించారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా.. బాధిత ఖైదీకి సర్జరీ నిర్వహించి, మొబైల్ ఫోన్‌ను బయటకు తీశారు. ఖైదీ కడుపులో ఉన్న మొబైల్ ఫోన్‌ను చూసి డాక్టర్లు, పోలీసులు షాకయ్యారు.
ఇక మళ్లీ ఖైదీపై పోలీసులు మరో క్రిమినల్ కేసు( Criminal Case ) నమోదు చేశారు. అయితే ఖైదీ వద్దకు ఫోన్ ఎలా వచ్చిందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఖైదీకి ఫోన్ ఇచ్చేందుకు జైలు అధికారులు ఎవరైనా ఇచ్చారా..? లేక ములాఖత్‌లో బయటి నుంచి వచ్చిన వారు ఎవరైనా ఇచ్చారా..? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.