Agni Missile man : అగ్ని మిస్సైల్ రూపకర్త రామ్‌నారాయణ్ అగర్వాల్ (Ram Narayan Agarwal) ఇకలేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన 84 ఏళ్ల వయసులో మరణించారు. గురువారం హైదరాబాద్ నగరంలో ఆయన కన్నుమూశారు. ప్రస్తుతం చైనాకు ముచ్చెమటలు పట్టిస్తున్న అగ్ని క్షిపణులను తయారు చేయడంలో అగర్వాల్ కీలకపాత్ర పోషించారు. ముఖ్యంగా సుదూర ప్రాంతాల్లోని లక్ష్యాలను ఛేదించే క్షిపణులను అభివృద్ధి చేయడంతో ఆయన ఎంతో పేరుగడించారు.
అగ్ని క్షిపణి ప్రాజెక్టుకు తొలి డైరెక్టర్‌గా రామ్‌నారాయణ్ అగర్వాల్ వ్యవహరించారు. దేశానికి ఆయన చేసిన సేవలకుగాను కేంద్ర ప్రభుత్వం 1990లో పద్మశ్రీ, 2000లో పద్మ భూషణ్ పురస్కారాలతో సత్కరించింది. 2004లో లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును అగర్వాల్ సొంతం చేసుకున్నారు. లాంగ్ రేజ్ క్షిపణులను అభివృద్ధి చేయడంలో అగర్వాల్ పేరుగడించారు. ప్రఖ్యాత ఏరోస్పేస్ శాస్త్రవేత్తగా గుర్తింపు పొందారు.
డీఆర్డీవో (DRDO) తో అగర్వాల్‌కు దశాబ్దాల అనుబంధం ఉంది. 1983లో ప్రారంభమైన అగ్నిక్షిపణి కార్యక్రమానికి అగర్వాల్ నాయకత్వం వహించారు. అగర్వాల్ మృతిపట్ల డీఆర్డీవో శాస్త్రవేత్తలు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఒక మేధావిని కోల్పోయినట్టు తమ సంతాప సందేశంలో పేర్కొన్నారు. కాగా అగర్వాల్ ఐఐటీ మద్రాస్, బెంగుళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో విద్యాభ్యాసం చేశారు.