Ajit Dada : బారామతితో ప్రత్యేక అనుబంధం.. రాజకీయ ప్రస్థానం మొదలైన చోటే.. మట్టిలో కలిసిపోయిన అజిత్‌ దాదా

బారామతిలో మొదలై.. అక్కడే మట్టిలో కలిసిన అజిత్ దాదా ప్రస్థానం! 6 సార్లు డిప్యూటీ సీఎంగా రికార్డు.. మహారాష్ట్ర రాజకీయాల్లో తీరని లోటు.

Ajit Dada

దేశం మరో కీలక నేతను కోల్పోయింది. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ (Ajit Pawar) ఇవాళ ఉదయం జరిగిన విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆయన మృతి మహారాష్ట్ర రాజకీయాల్లో తీరని లోటనే చెప్పాలి. ఎందుకంటే మహా రాజకీయాల్లో ఆయన కీలక నేత. ప్రస్తుతం ఫడణవీస్‌ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన మరణంతో మహారాష్ట్రలో విషాద ఛాయలు అలముకున్నాయి. అజిత్‌ను ‘అజిత్‌ దాదా’ (Ajit Dada) అని ముద్దుగా పిలుచుకునే ఆయన కార్యకర్తలు తమ నాయకుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడన్న వార్త తెలుసుకుని కన్నీరు మున్నీరు అవుతున్నారు.

23 ఏళ్లలోనే రాజకీయ రంగ ప్రవేశం..

అజిత్‌ పవార్‌ 23 ఏళ్ల వయసులోనే రాజకీయాల్లోకి వచ్చారు. 1982లో చక్కెర సహకార బోర్డు సభ్యుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఇక బారామతి (Baramati) స్థానం నుంచి తన రాజకీయాన్ని మొదలు పెట్టారు. బారామతితో అజిత్‌ పవార్‌కు ప్రత్యేక అనుబంధం ఉంది. తొలుత బారామతి నుంచి లోక్‌సభకు పోటీ చేసిన పవార్‌ గెలుపొందారు. అయితే, శరద్‌ పవార్‌ కోసం ఆ స్థానాన్ని వదులుకోవాల్సి వచ్చింది. ఇక ఇదే స్థానం నుంచి అసెంబ్లీ బరిలోకి దిగారు అజిత్‌ దాదా. ఏకంగా ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1991లో అక్కడ జరిగిన ఉప ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత.. 1995, 1999, 2004, 2009, 2014లో బారామతి నుంచే ఎమ్మెల్యేగా గెలుస్తూ ఆ ప్రాంతంలో తిరుగులేని నేతగా ఎదిగారు. రాజకీయ ప్రస్థానాన్ని మొదలు పెట్టిన గడ్డపైనే ఆయన తన ప్రాణాలు పోగొట్టుకోవడం తీవ్రంగా కలచివేస్తోంది.

అత్యధికకాలం డిప్యూటీ సీఎంగా చేసిన నేత..

మహారాష్ట్రలో అత్యధిక కాలం ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడు అజిత్‌ పవార్‌. ఏకంగా ఆరు సార్లు డిప్యూటీ సీఎంగా పనిచేశారు. తొలిసారి 2010లో అజిత్‌ పవార్‌ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత 2012లో రెండోసారి, 2019లో మూడోసారి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అయితే మూడోసారి ఫడణవీస్‌ ప్రభుత్వానికి మెజారిటీ లేకపోవడంతో కేవలం 80 రోజులు మాత్రమే ఆయన ఆ పదవిలో కొనసాగారు. ఆ తర్వాత ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వంలో పవార్‌ మళ్లీ ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. అయితే, ఆ ప్రభుత్వం ఎక్కువ రోజులు నిలవలేదు. రెండేండ్లకే కూలిపోవడంతో.. 2022లో ఏక్‌నాథ్‌ షిండే ప్రభుత్వంలో మళ్లీ ఉపముఖ్యమంత్రి చేజిక్కించుకున్నారు. ఇక ఆరోసారి 2024 డిసెంబరు 5 నుంచి దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ఉన్న మహాయుతి ప్రభుత్వంలో ఏక్‌నాథ్ షిండేతో కలిసి డిప్యూటీ సీఎంగా పవార్‌ పనిచేస్తున్నారు.

అజిత్‌ దాదా..

బారామతి నియోజకవర్గం నుంచి బలమైన బేస్ ఉన్న నేత అజిత్ పవార్. రాజకీయంగా చాలా శక్తిమంతమైన వ్యక్తి. ఆయన్ని కార్యకర్తలు, మద్దతుదారులు ముద్దుగా అజిత్‌ దాదా అని పిలుచుకుంటారు. ఇప్పుడు ఆయన లేరు అన్న వార్త తెలుసుకున్న వారంతా బోరున విలపిస్తున్నారు. ఇక పవార్‌ మరణంతో మహారాష్ట్ర రాజకీయాల్లో భారీ లోటు ఏర్పడిందని పలువురు రాజకీయ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. పవార్ మృతితో.. NCP (అజిత్ వర్గం), మహాయుతి కూటమి, బారామతి ప్రాంతీయ రాజకీయాలపై తీవ్ర ప్రభావం పడనుందని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి :

Learjet 45 : వీఐపీలు మెచ్చిన జెట్‌.. అజిత్‌ పవార్‌ ప్రాణాలు తీసిన లియర్‌జెట్ 45 ప్రత్యేకతలివే..
Sicily Landslide : విరిగిపడిన కొండ చరియలు..కూలిన ఇళ్ల వీడియో వైరల్

Latest News