విధాత: తమిళనాడులో అప్పుడే అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ మొదలైంది. ఇప్పటికే నటుడు విజయ్ టీవీకే పార్టీ తరపున ఎన్నికల ప్రచారం కొనసాగిస్తూ పలురకాల ఎన్నికల హామీలతో ప్రజల్లోకి దూసుకెలుతున్నారు. అధికార డీఎంకే కూటమి సైతం అమలు చేస్తున్న పథకాలకు తోడు కొత్తగా మరిన్ని ప్రజా సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రకటిస్తూ జనాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది.
ఓటర్లను ఆకర్షించే క్రమంలో తాజాగా ప్రతిపక్ష ఏఐఏడీఎంకే పార్టీ ప్రకటించిన ఎన్నికల హామీల మ్యానిఫెస్టో ఇప్పుడు చర్చనీయాంశమైంది. ముఖ్యంగా కర్ణాటక, తెలంగాణలలో కాంగ్రెస్ ను, ఏపీలో టీడీపీ కూటమిని అందలమెక్కించడంలో ప్రముఖంగా నిలిచిన మహిళలకు ఫ్రీ బస్ స్కీమ్, మహిళలకు ఆర్థిక సహాయం, యువతులకు స్కూటీల పథకాలను ఏఐడీఎంకే మరో అడుగు ముందుకు తీసుకెళ్లింది.
2026 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపిస్తే సిటీ బస్సుల్లో స్త్రీలతో పాటు పురుషులకు కూడా ఫ్రీ బస్సు ప్రయాణ వసతి కల్పిస్తామంటూ ఏఐఏడీఎంకే జనరల్ సెక్రటరీ ఇడప్పడి కే పళనిస్వామి మ్యానిఫెస్టోలో ప్రకటించడం హాట్ టాపిక్ గా మారింది. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సిటీ బస్సుల్లో మగవాళ్లకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం అమలు చేస్తామని, దీనివల్ల సామాన్య, మధ్యతరగతి పురుషులపై ఆర్థిక భారం తగ్గుతుందన్నారు. ఎంజీఆర్ జయంతి సందర్బంగా పార్టీ తొలి దఫా ఎన్నికల మ్యానిఫెస్టోను ప్రకటించారు. రేషన్ కార్డుదారులైన మహిళలకు ఆర్థిక సహాయంగా ప్రతి నెలరూ.2500 (కులవిలక్కు స్కీమ్) అందిస్తామని తెలిపారు. అమ్మ టూ వీలర్ స్కీమ్ కింద యువతులకు రూ.5 లక్షల లోన్ అందిస్తామని..ఇందులో రూ.25 వేల సబ్సిడీ అందిస్తామని ప్రకటించారు.
ఇల్లు లేని వారికి ఇల్లు(అమ్మా ఇల్లమ్ స్కీమ్) అందిస్తామని పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో సొంత ఇల్లు లేని వారికి ప్రభుత్వం భూమిని కొనుగోలు చేసి, కాంక్రీట్ ఇళ్లను నిర్మించి ఉచితంగా అందజేస్తామని స్పష్టం చేసింది. అలాగే పట్టణ ప్రాంతాల్లో ఇల్లు లేని వారికి అపార్ట్‌మెంట్ ఇళ్లు నిర్మించి ఇవ్వనున్నట్లు వెల్లడించింది. ఒకే కుటుంబానికి చెందిన షెడ్యూల్డ్ కులాల కుటుంబాలు వివాహానంతరం వేరుగా ఉన్నప్పటికి..వారికి సైతం ఈ పథకం వర్తిస్తుందని ఏఐఏడీఎంకే స్పష్టం చేసింది. 100 రోజుల ఉపాధి హామీ పనుల రోజులను 150కి పెంపు వంటి ఆకర్షణీయమైన హామీలను ప్రకటించడం విశేషం.
ఇవి కూడా చదవండి :
సంక్రాంతి అల్లుడికి 1,116వంటకాలతో విందు
Municipal Reservations : మున్సిపల్ చైర్మన్లు..మేయర్ల రిజర్వేషన్ల ప్రకటన
