Site icon vidhaatha

Mallikharjun Kharge | జమ్ము కశ్మీర్‌లో గెలిస్తే దేశమంతా మన నియంత్రణలోకే..ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే

విధాత : జమ్ము కశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం మనం విజయం సాధిస్తే దేశమంతా మన నియంత్రణలోకి వస్తుందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కాంగ్రెస్ కార్యకర్తలనుద్ధేశించి వ్యాఖ్యానించారు. ఖర్గే గురువారం రాహుల్‌గాంధీతో కలిసి శ్రీనగర్‌లో కాంగ్రెస్‌ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. జమ్ము కశ్మీర్‌లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందన్నారు. జమ్ము కశ్మీర్‌తో రాహుల్‌ గాంధీ అనుబంధం రక్తసంబంధమని ఖర్గే చెప్పుకొచ్చారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో జమ్ము కశ్మీర్‌ ప్రజలు కాంగ్రెస్‌ పార్టీకి అండగా నిలుస్తారన్న విశ్వాసం తనకున్నదని చెప్పారు. ఎక్కడ, ఎప్పుడు ఎన్నికలు నిర్ణయించాలో బీజేపీ నిర్ణయిస్తున్నదని అన్నారు. బీజేపీకి దీటైన పోటీ ఇస్తున్న పార్టీ కావడంతోనే కాషాయ పాలకులు నిత్యం కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకుంటున్నారని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ ఒక్కరే బీజేపీకి ముచ్చెమటలు పట్టిస్తున్నారన్నారు. దేశాన్ని కాపాడటంతో పాటు మీ సంస్కృతి, హక్కుల పరిరక్షణకు రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఓటు వేయాలని ఖర్గే పిలుపు ఇచ్చారు. మరోవైపు జమ్ము కశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసేందుకు నేషనల్‌ కాన్ఫరెన్స్‌, కాంగ్రెస్‌లు సూత్రప్రాయంగా నిర్ణయించాయి. ఈ దిశగా నేషనల్‌ కాన్ఫరెన్స్‌, కాంగ్రెస్‌ కూటమి ఏర్పాటు, ఇరు పార్టీల మధ్య సీట్ల సర్ధుబాటు ఖరారు, భావసారూప్యత కలిగిన పార్టీలను కలుపుకుని వెళ్లడం వంటి అంశాలపైనా చర్చలు పురోగతిలో ఉన్నాయి. జమ్ము కశ్మీర్‌ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో జోష్‌ నెలకొంది. జమ్ము కశ్మీర్‌ మాజీ మంత్రి, డెమొక్రటిక్‌ ప్రోగ్రెసివ్‌ ఆజాద్‌ పార్టీ (డీపీఏపీ) నేత తాజ్‌ మొహియుద్దీన్‌ ఇటీవల కాంగ్రెస్‌లో చేరారు. కాగా, జమ్మూకశ్మీర్‌లో సెప్టెంబర్‌ 18, సెప్టెంబర్‌ 25, అక్టోబర్‌ 1న, హరియాణాలో అక్టోబర్‌ 1న అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని, రెండు రాష్ట్రాల్లో అక్టోబర్‌ 4న ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని ఈసీ వెల్లడించిన సంగతి తెలిసిందే. జమ్మూకశ్మీర్‌లో మొదటి దశలో 24 సీట్లకు, రెండో దశలో 26 సీట్లకు, మూడో దశలో 40 సీట్లకు ఎన్నికలు జరుగుతాయి. ఇక్కడ చివరిసారిగా 2014 నవంబర్‌–డిసెంబర్‌లో ఐదు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి.

Exit mobile version