Goa Zilla Panchayat Polls | దేశంలో కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఎదురుదెబ్బలు తింటున్నది. గత పార్లమెంటు ఎన్నికల్లో బలాన్ని కాస్త పెంచుకోగలిగినప్పటికీ.. రాష్ట్రాల వారీగా చూసినప్పుడు తెలంగాణ, కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్‌లో మాత్రమే తన సొంత బలంపై ప్రభుత్వాలు ఉన్నాయి. జార్ఖండ్‌లో జేఎంఎంతో కలిసి అధికారాన్ని పంచుకుంటున్నది. మొత్తంగా 2025లో ఆ పార్టీ ఎన్నికల విజయాలు ఏమీ లేవు. అయితే.. చిన్న రాష్ట్రం గోవా కాంగ్రెస్ పార్టీకి కొత్త ఆశలు కలిగిస్తున్నది. గోవా అసెంబ్లీకి మరో 14 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నది. ఇక్కడ ఓటు బలాన్ని కాంగ్రెస్ కాస్త మెరుగుపర్చుకున్నట్టు కనిపిస్తున్నది. గోవా ప్రజల్లో కాంగ్రెస్ పట్ల మరోసారి విశ్వాసం పెరుగుతున్నదనేందుకు ఇటీవల ముగిసిన జిల్లా పంచాయతీ ఎన్నికల ఫలితాలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. గోవాలో మొత్తం 50 జిల్లా పంచాయతీలకు గాను.. గతంలో కాంగ్రెస్ 4 సీట్లు గెలువగా.. తాజా ఎన్నికల్లో వాటిని పదికి పెంచుకోగలిగింది.
వరుసగా మూడోసారి ఉత్తర గోవా, దక్షిణ గోవా జిల్లా కౌన్సిళ్లను బీజేపీ గెలుచుకున్నప్పటికీ.. తాజా ఫలితాలు మాత్రం ఆ పార్టీ ఓటు బ్యాంకు కోతకు గురవుతున్నదే సంకేతాలు ఇచ్చాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి ఈ ఫలితాలు నైతికబలాన్ని పెంచేలా ఉన్నాయని అంటున్నారు. ఈ బలం 2027 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంతో ఆ పార్టీకి కొత్త ఆశలు రేకెత్తిస్తున్నది.
డిసెంబర్ 21న గోవా జిల్లా పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. ఈ రెండు జిల్లాల్లో బీజేపీ 29 సీట్లు గెలుపొందింది. గతంలో 33 సీట్లు గెలువగా.. ఈసారి నాలుగు తగ్గాయి. బీజేపీ ఓటు బ్యాంకులోకి కాంగ్రెస్ చొచ్చుకుపోతున్న తీరు.. క్షేత్రస్థాయిలో ఆ పార్టీ పునాదులు బలపడుతున్నాయనేందుకు సంకేతాలని విశ్లేషకులు చెబుతున్నారు.
అదే సమయంలో ఇతర పార్టీలు కూడా తమ బలాన్ని పెంచుకుంటున్నాయి. బీజేపీ భాగస్వామ్య పక్షమైన మహారాష్ట్రవాదీ గోమంత్ పార్టీ మూడు స్థానాల్లో గెలుపొందగా.. కాంగ్రెస్ మిత్ర పక్షం గోవా ఫార్వర్డ్ పార్టీ ఒక స్థానాన్ని, కొత్తగా రంగంలోకి వచ్చిన రివొల్యూషనరీ గోవన్స్ పార్టీ రెండు సీట్లు గెలుచుకున్నది. ఆమ్ ఆద్మీ పార్టీ తన ఏకైక స్థానాన్ని నిలుపుకోగలిగింది. మిగిలిన స్థానాల్లో స్వతంత్రులు గెలిచారు.
ఇవి స్థానిక ఎన్నికలే అయినప్పటికీ జిల్లాల వారీగా ఫలితాలను గమనిస్తే.. రాజకీయంగా ఇవి కాంగ్రెస్‌కు ఎంతో ప్రాధాన్యం ఉన్నవిగా విశ్లేషకులు చెబుతున్నారు. ఉత్తర గోవా గత రెండు దశాబ్దాలుగా బీజేపీకి పెట్టని కోటలా ఉంటూ వస్తున్నది. ఇక్కడ అధికార పార్టీకి ఓటు బ్యాంకులో ఎలాంటి తేడా లేదు. బీజేపీ–ఎంజీపీ కూటమి ఇక్కడ 25 స్థానాలకు గాను 19 గెలుచుకున్నది. అయితే గతంతో పోల్చితే బీజేపీ రెండు సీట్లు కాంగ్రెస్‌కు కోల్పోయింది.
దక్షిణ గోవాలో కూటమి 25 సీట్లకుగాను 13 సీట్లు గెలిచింది. నిజానికి గతంలో ఇక్కడ బీజేపీ సొంతగా 14 సీట్లు గెలుపొందింది. ఇక్కడ కాంగ్రెస్ మెరుగైన ఫలితాలు సాధించింది. ఆరు సీట్లు అదనంగా గెల్చుకుని.. తన ట్యాలీని ఎనిమిదికి పెంచుకుంది.
2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ దక్షిణ గోవా పార్లమెంటరీ సీటును బీజేపీ నుంచి గెలుచుకున్నది. ఉత్తర గోవా ఎంపీ సీటు బీజేపీ నిలుపుకొన్నది. తాజాగా జిల్లా పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ దక్షిణ గోవా కాంగ్రెస్‌కు కీలకమైన ప్రాంతంగా మళ్లీ నిలబడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఉత్తర గోవాలో బీజేపీ ప్రభావం స్వల్పంగా తగ్గింది.
ఓట్ల శాతాన్ని పరిశీలిస్తే.. ఈసారి జిల్లా పంచాయతీ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 70.8శాతం ఓటింగ్ నమోదైంది. మునుపెన్నడూ ఈ స్థాయిలో ఓటింగ్ నమోదైంది లేదు. జిల్లా పంచాయతీ ఎన్నికలు ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినవి. ఇక పట్టణ ప్రాంతాల విషయానికి వస్తే.. పాంజిమ్ మున్సిపాలిటీ, మరో 19 మున్సిపల్ కౌన్సిళ్లకు ఎన్నికలు 2026 జనవరిలో జరుగనున్నాయి. పట్ణణ ప్రాంత ప్రజలు కూడా గ్రామీణ ప్రాంత ప్రజల మనోభావాలనే వ్యక్తం చేస్తారా? అనేది వేచి చూడాలి.
ఈ ఫలితాలు.. రాష్ట్రంలో రాజకీయ మలుపుకు సంకేతంగా కాంగ్రెస్ నాయకత్వం అభివర్ణిస్తున్నది. తాము సాధించిన అద్భుత ఫలితాలు తమను ఆశ్చర్యానికి గురి చేశాయని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మాణిక్‌రావు ఠాక్రె చెప్పారు. బీజేపీ ప్రభుత్వ అవినీతి, పరిపాలనలో వైఫల్యాలకు గ్రామీణ స్థాయిలో వ్యతిరేకతను, స్థానిక సమస్యల పట్ల ప్రభుత్వ నిరక్ష్యాన్ని ఈ ఫలితాలు ప్రతిబింబిస్తున్నాయని ఆయన అన్నారు. ఈ ఫలితాలు 2027 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం దిశగా తమను నడిపిస్తాయని చెప్పారు.
Read Also |
Residential Sales Report : ఏడు నగరాల్లో ఇళ్ల విక్రయాలు ఢమాల్
ORR New Interchanges : ముఖ్య నేత కోసమే జన్వాడలో ఇంటర్ ఛేంజ్?
End of Television | టెలివిజన్ శకం ముగిసిందా? ఆరేళ్లలో 4 కోట్ల కనెక్షన్లు కనుమరుగు
