Is the Television Era Ending in India? 40 million TV Connections Lost in Six Years
(విధాత బిజినెస్ డెస్క్)
ఒకప్పుడు ఇంట్లో టెలివిజన్ అంటే కుటుంబం అంతా ఒకేచోట కూర్చుని చూసే ప్రధాన వినోదం. వార్తలు, సీరియళ్లు, క్రీడలు, సినిమాలు… అన్నీ టీవీ చుట్టూనే తిరిగేవి. కానీ ఇప్పుడు ఆ దృశ్యం వేగంగా మారుతోంది. స్మార్ట్‌ఫోన్‌లు, స్మార్ట్ టీవీలు, ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ల విస్తరణతో దేశంలో సంప్రదాయ శాటిలైట్ టెలివిజన్ వీక్షకుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది.
బస్సులో ప్రయాణిస్తున్నా, రైలులో వెళ్తున్నా, కార్యాలయంలో విరామ సమయంలో అయినా — మొబైల్‌లో రీల్స్, వీడియోలు, వెబ్‌సిరీస్‌లు చూడటం సాధారణంగా మారింది. టెలికాం సంస్థలు రోజుకు 2–3 జీబీ డేటా అందిస్తుండటంతో టీవీపై ఆధారపడాల్సిన అవసరం తగ్గింది. ఈ మార్పుల ఫలితంగా గత ఆరు సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా సుమారు 40 మిలియన్ (4 కోట్ల) టీవీ కేబుల్ లేదా డిష్ కనెక్షన్లు రద్దయ్యాయి.
కాంటార్స్ మీడియా కంపాస్(Kantar Media Compass Report) నివేదిక ప్రకారం, టీవీని పూర్తిగా వదిలేయడం కాదు కానీ, చాలా మంది తమ టీవీలను బ్రాడ్‌బ్యాండ్‌కు అనుసంధానించి, తాము కోరుకున్న కార్యక్రమాలనే ఎంపిక చేసుకుని చూస్తున్నారు.
ఓటీటీ వైపు వీక్షకులు… ఒత్తిడిలో టీవీ పరిశ్రమ
ఈ ఏడాది మార్చి నుంచి సెప్టెంబర్ మధ్యకాలంలో సంప్రదాయ టీవీ కార్యక్రమాలు చూసే వారి సంఖ్య 70.5 కోట్ల నుండి 68.9 కోట్లకు పడిపోయింది. దేశవ్యాప్తంగా సుమారు 15 శాతం మంది వీక్షకులు డిజిటల్ టీవీల ద్వారానే కంటెంట్ చూస్తున్నారు. వీరిలో చాలామంది ఇంటర్నెట్ ఆధారిత వెబ్‌సిరీస్‌లు, ఇతర ఆన్‌లైన్ కార్యక్రమాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు.
ఒక్క ఏడాదిలోనే ఈ డిజిటల్ వీక్షకుల సంఖ్య 30 శాతం పెరగడం గమనార్హం. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ప్రతి నలుగురు డిజిటల్ వీక్షకుల్లో ముగ్గురు గ్రామీణ ప్రాంతాల నుంచే ఉండటం. టీవీ ఛానళ్లు అందుబాటులో ఉన్నప్పటికీ, గడచిన ఐదు–ఆరు సంవత్సరాలుగా వీక్షకుల సంఖ్య క్రమంగా తగ్గుతూనే ఉంది. కొంతమంది మాత్రమే ఇప్పటికీ టీవీ వార్తలు, సీరియళ్లకు కట్టుబడి ఉన్నారు.
మార్పు తీవ్రత స్పష్టంగా చూపిస్తున్న గణాంకాలు
2018లో టీవీ కేబుల్ కనెక్షన్లకు చెల్లించిన వారు 15.1 కోట్లు కాగా, 2024 నాటికి ఈ సంఖ్య 11.1 కోట్లకు పడిపోయింది. ఆరు సంవత్సరాల్లోనే 4 కోట్ల మంది కనెక్షన్లు రద్దు చేసుకున్నారని ఆల్ ఇండియా డిజిటల్ కేబుల్ ఫెడరేషన్ వెల్లడించింది.
డిష్ టీవీ(డిటిహెచ్) కనెక్షన్లు కూడా 2019లో 7.2 కోట్ల నుంచి 2024 నాటికి 6.19 కోట్లకు తగ్గాయి. 2026 చివరికి ఇవి 5.1 కోట్లకు చేరవచ్చని మార్కెట్ వర్గాల అంచనా. విద్యావంతులు, యువత, ఉద్యోగులు ఎక్కువగా ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ల వైపు మళ్లుతుండగా, తక్కువ ఆదాయ వర్గాలు డీడీ ఫ్రీ డిష్‌ను ఎంచుకుంటున్నారు. దీని ప్రభావం ప్రకటనల మార్కెట్‌పైనా పడింది. 2019లో టీవీ ప్రకటనల ఆదాయం రూ.25,700 కోట్లు ఉండగా, 2024 నాటికి అది రూ.21,500 కోట్లకు తగ్గింది. దాదాపు 29 శాతం పతనం టీవీ ఛానళ్ల ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ఒత్తిడి తెచ్చింది.
రెండు దశాబ్దాల పాటు ప్రకటనల రంగంలో ఆధిపత్యం చెలాయించిన టెలివిజన్‌ను 2024లో తొలిసారిగా డిజిటల్ మీడియా అధిగమించింది. డిమాండ్ ఉన్నచోటికే ప్రకటనలు వెళ్తున్నాయని డెలాయిట్ ఇండియా ప్రతినిధులు పేర్కొంటున్నారు. అయితే ప్రాంతీయ ప్రేక్షకుల నమ్మకం వల్ల సాధారణ వినోద ఛానళ్లు ఇప్పటికీ కొంతవరకు నిలబడుతున్నాయి. మరోవైపు, ఈ మార్పులు ఉపాధిపై కూడా ప్రభావం చూపాయి. 2018 నుంచి 2025 మధ్య కాలంలో కేబుల్ టీవీ రంగంలో పనిచేసిన వారిలో సుమారు 5.7 లక్షల మంది ఉద్యోగాలు లేదా ఉపాధి కోల్పోయారు. 2025 మార్చిలో జియో స్టార్ 11 ఛానళ్లను మూసివేయడం (కామెడీ సెంట్రల్, వీహెచ్1, ఎంటీవీ బీట్స్ సహా) ఈ సంక్షోభానికి మరో ఉదాహరణగా నిలిచింది.
అయితే టీవీ పూర్తిగా అంతమవుతుందా? లేదు… నిపుణుల అభిప్రాయం ప్రకారం, రూపం మారుతోంది కానీ స్క్రీన్ కాదు. బ్రాడ్‌బ్యాండ్‌తో నడిచే స్మార్ట్ టీవీల అమ్మకాలు ప్రతి సంవత్సరం 1.5 శాతం పెరుగుతున్నాయి. సంప్రదాయ టెలివిజన్ నుంచి డిజిటల్ టెలివిజన్ దశకు సమాజం వేగంగా మారుతోందన్నదే వాస్తవం.
