Air Pollution | ‘క్లీన్‌ ఇండియా’ నగరాల్లో వాతావరణ కాలుష్యం..! ఏటా 33వేల మంది మృత్యువాత..!

Air Pollution | ఓ వైపు ప్రపంచవ్యాప్తంగా జనాభా విపరీతంగా పెరుగుతున్నది. దాంతో వనరుల విధ్వంసం భారీగా జరుగుతున్నది. ఫలితంగా వాతావరణ కాలుష్యం జీవాలతో మనుషులను సైతం ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. ఫలితంగా వివిధ వ్యాధుల బారినపడడంతో పాటు ఏటా వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. కాలుష్యం ఇదే విధంగా కొనసాగితే మానవ మనుగడే ప్రశ్నార్థకంగా మారనున్నది పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

  • Publish Date - July 4, 2024 / 09:53 AM IST

Air Pollution | ఓ వైపు ప్రపంచవ్యాప్తంగా జనాభా విపరీతంగా పెరుగుతున్నది. దాంతో వనరుల విధ్వంసం భారీగా జరుగుతున్నది. ఫలితంగా వాతావరణ కాలుష్యం జీవాలతో మనుషులను సైతం ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. ఫలితంగా వివిధ వ్యాధుల బారినపడడంతో పాటు ఏటా వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. కాలుష్యం ఇదే విధంగా కొనసాగితే మానవ మనుగడే ప్రశ్నార్థకంగా మారనున్నది పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. తాజాగా ‘లాన్సెట్‌ ప్లానెటరీ హెల్త్‌ జర్నల్‌’లో ఓ అధ్యయనం ప్రచురితమైంది. ఇందులో పరిశోధకులు షాకింగ్‌ వివరాలను వెల్లడించారు. భారత్‌లోని పది ప్రధాన నగరాల్లో వాయు కాలుష్యం కారణంగా ఏటా 33వేల మంది మృత్యువాతపడుతున్నారని అధ్యయనం పేర్కొంది.

సస్టెయినబుల్ ఫ్యూచర్స్ కొలాబొరేటివ్, అశోకా యూనివర్సిటీ, సెంటర్ ఫర్ క్రానిక్ డిసీజ్ కంట్రోల్, స్వీడెన్‌కు చెందిన కెరలిన్స్కా ఇన్‌స్టిట్యూట్, హార్వర్డ్ యూనివర్సిటీ, బోస్టన్ యూనివర్సిటీలు సంయుక్తంగా అధ్యయనం నిర్వహించాయి. అయితే, 2008-2019 మధ్య కాలంలో పీఎం 2.5 సూక్ష్మ ధూళి కణాల ప్రభావం కారణంగా సంభవించిన మరణాలపై పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు. డేటా ప్రకారం దేశ రాజధాని ఢిల్లీలో అత్యధికంగా ఏటా 12వేల మంది వాయు కాలుష్యం కారణంగా ప్రాణాలు వదిలారు. ఆ తర్వాత ముంబయిలో 5,100, కోల్‌కతాలో 4,700 మంది, చెన్నైలో 2,900 మంది, బెంగళూరు నగరంలో 2,100 మంది చనిపోయినట్లు పేర్కొంది. ఇక షిమ్లాలో అత్యల్పంగా ఏటా 59 మంది మరణించినట్లు చెప్పింది. ధూళికణాల్లో ప్రతి 10 మైక్రోగ్రాముల పెరుగుదలకు 1.17 మరణాల శాతం పెరుగుతోందని వెల్లడించింది.

భారత్‌లోని ప్రమాణాల ప్రకారం.. ప్రస్తుతంలో గాలిలో క్యూబిక్‌ మీటరకు 60 మైక్రో గ్రాముల సూక్ష్మధూళి కణాలతో పెద్దగా ప్రమాదం ఉండదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం.. క్యూబిక్‌ మీటర్‌కు 15 మైక్రోగ్రాముల కంటే చాలా ఎక్కువని పరిశోధకులు పేర్కొన్నారు. ప్రభుత్వం ఈ పరిమితిని తగ్గించి.. ప్రమాణాలను కఠినతరం చేయాలని సూచించారు. వాయు కాలుష్యం తగ్గించేందుకు ఇది అత్యవసరమని పేర్కొన్నారు. అయితే, వాయు కాలుష్యం తక్కువ ఉందనుకునే ముంబయి, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు అత్యధికంగా మరణాలు ఉన్న విషయాన్ని నిపుణులు గుర్తు చేస్తున్నారు. గాలిలో ధూళికణాలు క్యూబిక్‌ మీటర్‌కు 10 మైక్రోగ్రాములకు పెరిగితే మరణాలు 1.42శాతం పెరుగుదల నమోదవుతుందని గతంలో అంచనా వేశారు. తాజాగా ఈ అంచనాలు 3.57శాతానికి చేరుకున్నట్లు అధ్యయనంలో నిపుణులు పేర్కొన్నారు.

Latest News