శామ్ పిట్రోడా.. టెలికమ్యూనికేషన్స్(Sam Pitroda – Telecommunications) పరిశ్రమలో బాగా పేరున్న ఇంజినీర్. మొన్నీమధ్యనే ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్(Indian Overseas Congress)గా రాజీనామా చేసాడు. ఆ రాజీనామా కూడా వెంటనే కాంగ్రెస్ ఆమోదించింది. పిట్రోడా రాజీనామాకు గల కారణం, భారతీయులపై ఆయన చేసిన వ్యాఖ్యలను బిజేపీ, ఇతరులు, మీడియా జాతి వివక్షాపూరిత వ్యాఖ్యలు()గా పరిగణించడం.
నిజానికి భారతదేశ వైవిధ్యాన్ని ఆయన చెప్పారు. ‘ప్రజాస్వామ్యానికి ప్రపంచంలోనే మనది తేజోవంతమైన ఉదాహరణ. తూర్పున ఉండేవాళ్లు చైనీయుల్లా, పశ్చిమాన ఉండేవాళ్లు అరబ్బుల్లా, ఉత్తరాదిన ఉండేవారు బహుశా తెల్లవాళ్లుగా, దక్షిణాదిలోనివారు ఆఫ్రికన్లలా కనిపించే భారత దేశం వంటి భిన్నమైన దేశాన్ని మనం ఐక్యంగా ఉంచుకోగలం. దానితో సంబంధం లేదు. మనమంతా అన్నదమ్ములం, అక్కచెల్లెళ్లం’ అని పిట్రోడా చెప్పారు. నిజానికి భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటే భారతదేశ గొప్పతనాన్ని చాటే క్రమంలో పిట్రోడా ఈ వ్యాఖ్యలు చేశారు. కానీ… ప్రతి ప్రగతిశీల భావనను కుంచిత స్వభావంతో చూసే బీజేపీ నాయకులు… దీనిని సైతం తీవ్రంగా వక్రీకరించారు. ఆయన చెప్పినదంతా వదిలేసి… అదిగో… దక్షిణ భారతదేశస్తులను ఆఫ్రికన్లు అన్నారు… తూర్పువారిని చైనీయులు అన్నారంటూ అసలు విషయాన్ని పక్కదారి పట్టించేశారు. ఆ వ్యాఖ్యలు జాతివివక్షతో కూడుకున్నవంటూ ప్రధాని మొదలు ఆ పార్టీ నేతలంతా గొంతు చించుకున్నారు. కాంగ్రెస్ సైతం ఎన్నికల వేళ ఆత్మరక్షణలో పడిపోయి… ఆయన వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని చెప్పుకున్నది. ఆయన చేసిన రాజీనామాను ఆమోదించింది.
1981లో ఒకసారి భారత్కు వచ్చిన పిట్రోడా, షికాగోలోని తన కుటుంబంతో మాట్లాడానికి చాలా కష్టపడాల్సివచ్చింది. దాంతో భారత టెలికమ్యూనికేషన్స్ రంగాన్ని అభివృద్ధి చేయడంలో సహాయపడాలని నిర్ణయించుకున్నాడు. 1980ల నాటి భారతదేశ టెలికమ్యూనికేషన్స్, సాంకేతిక విప్లవానికి పునాది వేసిన ఘనత ఆయనదే. 1984లో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ అహ్వానంపై భారత్కు తిరిగివచ్చిన పిట్రోడా, సెంటర్ ఫర్ డెవెలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్(C-DOT)ను ప్రారంభించాడు. తన అమెరికా సహజ పౌరసత్వాన్ని రద్దు చేసుకుని, భారత పౌరసత్వాన్ని స్వీకరించిన పిట్రోడా, ప్రధానమంత్రి రాజీవ్ గాంధీకి శాస్త్ర, సాంకేతిక సలహాదారు(Advisor for Science & Technology)గా చేరారు. ఆ సమయంలో పిట్రోడా టెలికమ్యూనికేషన్స్, నీరు, అక్షరాస్యత, రోగనిరోధకత, పాల ఉత్పత్తి, నూనె గింజలకు సంబంధించిన ఆరు సాంకేతిక మిషన్లకు నాయకత్వం వహించారు. అతను ఇండియన్ టెలికం కమిషన్ (ITC) వ్యవస్థాపకుడు, మొదటి చైర్మన్ కూడా. ఈ బహుళ పాత్రలతో, సామాజిక మార్పుకు కీలకమైన సాంకేతికతను పొందడంపై దృష్టి సారించిన పిట్రోడా, భారతదేశ అభివృద్ధి విధానాలను విప్లవాత్మకంగా మార్చడంలో తనవంతు పాత్ర పోషించాడు. దేశవ్యాప్తంగా నెలకొల్పిన సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (STPI)లను నెలకొల్పడంలో కీలక బాధ్యత వహించాడు. మనం ఇప్పుడు హైదరాబాద్ హైటెక్ సిటీలో చూస్తున్న సైబర్ టవర్స్(Cyber Tower, Hitech city, Hyderabad) నిర్మాణాన్ని ముందుగా ప్రారంభించింది రాజీవ్గాంధీనే. దాని వెనుక ఉన్నది పిట్రోడానే. తన మొత్తం కెరీర్లో ముగ్గురు కాంగ్రెస్ ప్రధానులు ఇందిర, రాజీవ్, మన్మోహన్లతో కలిసి పనిచేసిన శామ్ పిట్రోడా రాహుల్గాంధీకి అత్యంత సన్నిహితంగా ఉంటాడు. అందుకే అందరూ అయన్ను రాహుల్ గురువుగా సంబోధిస్తుంటారు.
తన జీవితంలో చాలాసార్లు వివాదాస్పద వ్యాఖ్యలకు కేంద్రబిందువుగా మారిన పిట్రోడా, అయోధ్య రామాలయంపై, 2019లో సిక్కు అల్లర్లపై, అమెరికాలో వారసత్వ పన్నుపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనాలను సృష్టించాయి. పుల్వామా దాడి తర్వాత కేంద్రం చేపట్టిన బాలాకోట్ సర్జికల్ స్ట్రయిక్స్ విషయంలో కూడా భారత వాయుసేన నిజాయితీపై సందేహం వ్యక్తం చేసాడు. గుళ్లు గోపురాలు ఉద్యోగాలను సృష్టించలేవని ఆయోధ్యరామాలయ ప్రారంభ సమయంలో వ్యాఖ్యానించాడు. అయితే ఇవన్నింటినీ ఆయన వ్యక్తిగత వ్యాఖ్యలుగా కొట్టిపడేసిన కాంగ్రెస్, ఈ వివక్ష వ్యాఖ్యల విషయంలో మాత్రం చర్యలకు దిగింది.