Special Army Units : Rudra & Bhairav | న్యూఢిల్లీ : శత్రు దేశాల దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టే లక్ష్యంతో భారత సైన్యంలో ప్రత్యేకంగా రుద్ర, భైరవ్ దళాలు ఏర్పాటయ్యాయి. ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోవడంతో పాటు యుద్దరంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా భవిష్యత్తు అవసరాల మేరకు ప్రత్యేకంగా రుద్ర, భైరవ్ అనే ‘ఆల్‌ఆర్మ్స్ బ్రిగేడ్’ సాయధ దళాలను ఏర్పాటు చేసినట్లుగా సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది వెల్లడించారు. శనివారం ‘కార్గిల్ విజయ్ దివస్ ’ సందర్భంగా ఆయన అమరవీరులకు నివాళులర్పించారు.
రుద్ర సైనిక విభాగాన్ని పదాతిదళం, యాంత్రిక పదాతి దళం, సాయుధ యూనిట్లు ఫిరంగిదళం, ప్రత్యేక దళాలు, మానవరహిత వైమానిక వ్యవస్థలు వంటి వ్యవస్థలతో కూడిన దళం ఇది అని వెల్లడించారు. ఇప్పటికే రెండు పదాతిదళ బ్రిగేడ్‌లు రుద్రలో భాగమైనట్లు వెల్లడించారు. గతంలో సైన్యంలోని వేర్వేరు విభాగాల మధ్య సమన్వయానికి సమయం పట్టేదని..రుద్ర ఏర్పాటుతో ఆ సమస్య తీరిందన్నారు.
ఇక ‘‘భైరవ్’’ అనే లైట్ కమాండో బెటాలియన్ యూనిట్లను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సరిహద్దుల్లో శత్రు సైన్యం దాడులను ఎదుర్కోవడంలో భైరవ్ కమాండో బెటాలియన్లు చురుగ్గా వ్యవహరించబోతున్నాయని వివరించారు. వికసిత్ భారత్ 2047సాకారంతో సైన్యం తనవంతు పాత్ర నిర్వర్తిస్తుందని..లడ్డాఖ్ వంటి ప్రాంతాల్లో చేపట్టే అభివృద్ధికి సైన్యం సహకరిస్తుందని తెలిపారు.
పహల్గాం ఉగ్రదాడి దేశం మొత్తాన్ని కలచివేసిందని ఈ సందర్భంగా ద్వివేది గుర్తు చేశారు. ఉగ్రదాడికి ప్రతికారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టి ఉగ్రవాదాన్నిఉగ్రవాదులను ఎగదోస్తున్న పాకిస్థాన్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చామన్నారు. దేశ ప్రజల విశ్వాసం, ప్రభుత్వం ఇచ్చిన స్వేచ్ఛ కారణంగా ఆపరేషన్ సిందూర్ విజయవంతమైందని.. మన ఐక్యత, సార్వభౌమత్వాన్ని సవాలు చేయడంతో పాటు ప్రజలకు హాని చేయాలని చూసేవారికి ఇది సరైన సమాధానం చెప్పిందన్నారు.
