దోస్తుల చేతిలో దేశ రక్షణ బలగాలు ఆర్మీ, నేవీ చీఫ్‌లు క్లాస్‌మేట్స్‌

బాల్య మిత్రులు ఇద్దరు అనూహ్యంగా దేశ రక్షణ బలగాలకు సారధులై సరికొత్త చరిత్ర సృష్టించారు. దేశ సైనిక చరిత్రలో తొలిసారి ఇద్దరు సహ విద్యార్థులు ఆర్మీ, నేవీ ఛీఫ్‌లయ్యారు.

  • Publish Date - June 30, 2024 / 05:36 PM IST

విధాత , హైదరాబాద్ : బాల్య మిత్రులు ఇద్దరు అనూహ్యంగా దేశ రక్షణ బలగాలకు సారధులై సరికొత్త చరిత్ర సృష్టించారు. దేశ సైనిక చరిత్రలో తొలిసారి ఇద్దరు సహ విద్యార్థులు ఆర్మీ, నేవీ ఛీఫ్‌లయ్యారు. ఇండియన్‌ ఆర్మీ చీఫ్‌గా జనరల్ ఉపేంద్ర ద్వివేది ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ ఏడాది మే 1న నేవీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన అడ్మిరల్ దినేష్ త్రిపాఠి, ఆర్మీ కొత్త చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఇద్దరు సహా విద్యార్థులు. వారిద్దరూ కలిసి మధ్యప్రదేశ్‌లోని సైనిక్ స్కూల్‌ రేవాలో చదివారు. 1970లో 5వ తరగతిలో చేరిన ఉపేంద్ర ద్వివేది, దినేష్‌ త్రిపాఠిలు 12వ తరగతి వరకు కలిసి చదువుకున్నారు. సైనిక్ స్కూల్‌ రేవాలో వారి రోల్‌ నంబర్లు 931, 938 అని ఏఎన్‌ఐ వార్తా సంస్థ పేర్కొంది. భారత రక్షణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి భరత్ భూషణ్ బాబు సైతం ట్విటర్ ఎక్స్‌లో ఈ విషయాన్ని పోస్టు చేశారు. మధ్యప్రదేశ్‌లోని సైనిక్‌ స్కూల్‌ రేవాలో క్లాస్‌మేట్స్ అయిన జనరల్ ఉపేంద్ర ద్వివేది, అడ్మిరల్ దినేష్ త్రిపాఠి 50 ఏళ్ల తరువాత ఆర్మీ, నేవీకి నాయకత్వం వహించే స్థాయికి చేరారని పేర్కొన్నారు. ఇద్దరు అద్భుతమైన విద్యార్థులు ఈ స్థాయికి రాణించిన అరుదైన గౌరవం రేవాలోని సైనిక్ స్కూల్‌కు దక్కుతుందని ప్రశంసించారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు.

Latest News