సీమాంతర ఉగ్రవాదాన్ని ఆపకపోతే పాకిస్తాన్ ను ప్రపంచపటంలో లేకుండా చేస్తామని భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది అన్నారు . శుక్రవారం నాడు ఆయన రాజస్థాన్ లో అనుప్ గడ్ ఆర్మీ పోస్టును సందర్శించారు. పాకిస్తాన్ లో ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయాలని ఆయన కోరారు. దేవుడు అనుమతిస్తే త్వరలో అలాంటి అవకాశం లభిస్తుందని ఆయన అన్నారు. సైనికులు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలని ఆయన సూచించారు. టెర్రరిజాన్ని ప్రోత్సహించేలా పాకిస్తాన్ కార్యకలాపాలు కొనసాగితే ఆపరేషన్ సిందూర్ 2.0 ను ప్రారంభించేందుకు ఇండియా సిద్దంగా ఉందని ఆయన చెప్పారు. ఆపరేషన్ సిందూర్ 1.0 లో ఉన్నట్టుగా ఈ సారి సంయమనం పాటించబోమని ఆయన అన్నారు. పాకిస్తాన్ పై మరింత తీవ్ర చర్యలు తీసుకుంటామన్నారు. పాకిస్తాన్ ఉనికి గురించి ఆలోచించే విధంగా తమ చర్యలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.భూమిపై ఉండాలనుకుంటే సీమాంతర ఉగ్రవాదాన్ని నిలిపివేయాలని ఆయన పాకిస్తాన్ కు సూచించారు. భారత్ కు పశ్చిమాన సర్ క్రీక్ ప్రాంతంలో పాకిస్తాన్ కార్యకలాపాలను సాగిస్తున్న విషయం నిఘా వర్గాల నుంచి అందింది. ఇదే విషయమై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా పాకిస్తాన్ ను తీవ్రంగా వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. పహాల్గాంలో భారతీయులపై ఉగ్రవాదులు దాడి చేసి చంపడానికి కౌంటర్ గా భారత్ ఆపరేషన్ సిందూర్ ను ప్రారంభించింది. పాకిస్తాన్ లోని తీవ్ర వాద శిభిరాలను నేలమట్టం చేసింది. అంతేకాదు పాకిస్తాన్ కు చెంది ఎయిర్ బేస్ లను కూడా ధ్వంసం చేసింది. పాకిస్తాన్ భారత్ లోని జనావాసాలపై డ్రోన్లపై దాడికి దిగింది. అయితే ఈ దాడులను భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది. పాకిస్తాన్ ఎయిర్ బేస్ లపై భారత్ దాడి చేసిన తర్వాత కాల్పులకు విరమణకు పాకిస్తాన్ రాయబారం పంపింది. దీంతో కాల్పుల విరమణకు భారత్ అంగీకరించింది.