assembly elections । జమ్ముకశ్మీర్ సహా 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల (Assembly election) నిర్వహణకు ఎన్నికల సంఘం (Election Commission) సిద్ధమైంది. అమర్‌నాథ్ యాత్ర ముగిసిన వెంటనే హర్యానా, జార్ఖండ్, మహారాష్ట్ర, జమ్ముకశ్మీర్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేందుకు సన్నద్ధమవుతున్నది. ఆగస్టు 19 లేదా 25వ తేదీలోగా ఆ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ప్రకటించవచ్చని సంబంధిత వర్గాల సమాచారం. ఇందులో భాగంగానే ఇటీవల చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ జమ్ము కశ్మీర్(Jammu and Kashmir), హర్యానా (Haryana) అధికారులతో సమావేశమయ్యారు. సెప్టెంబర్ 30లోపు ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు (Supreme Court) ఆదేశించింది. ఎన్నికల ప్రక్రియ దాదాపు 40 రోజులు పట్టనుండగా, సెప్టెంబర్, అక్టోబర్ నెల్లో ఎన్నికలు నిర్వహించవచ్చని భావిస్తున్నారు. అయితే జమ్మూకశ్మీర్‌లో జరుగుతున్న ఉగ్రవాద దాడుల (terrorist attacks) దృష్ట్యా అక్కడ ఎన్నికలు నిర్వహిస్తుందా లేదా అన్న సందేహాలు వినిపించాయి. దీనిపై చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (Chief Election Commissioner) రాజీవ్ కుమార్ స్పందిస్తూ.. జమ్మూ కాశ్మీర్‌లో ఏ శక్తీ కూడా ఎన్నికలను వాయిదా వేసే ఆలోచన చేయడం లేదన్నారు. దీంతో దాదాపు పదేళ్ల తర్వాత జమ్మూ కాశ్మీర్‌లో 90 స్థానాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
90 స్థానాలున్న హర్యానా అసెంబ్లీ పదవీకాలం నవంబర్ 3తో ముగియనుంది. చివరిసారిగా 2019లో హర్యానా, మహారాష్ట్రలో అక్టోబర్ 21 న ఎన్నికలు జరిగాయి. ఫలితాలు కూడా అక్టోబర్ 24న వచ్చాయి. ఆగస్టు 11-12 తేదీల్లో ఎన్నికల సంఘం హర్యానా సీఈవో పంకజ్ అగర్వాల్, రాజకీయ పార్టీలు, ఇతర ఏజెన్సీలతో సమావేశం నిర్వహించింది. కమిషన్ హర్యానాకు ఆగస్టు 25న ఎన్నికలను ప్రకటించవచ్చని భావిస్తున్నారు. ఇక నవంబర్ 26వ తేదీతో మహారాష్ట్ర అసెంబ్లీ పదవీకాలం ముగియనుంది. ఈసారి నవంబర్‌లో దీపావళి తర్వాత ఎన్నికలు నిర్వహించే అవకాశముంది. అక్టోబర్ రెండో వారంలో మహారాష్ట్రలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీపావళి తర్వాత నవంబర్‌లో ఎన్నికలు నిర్వహించి నవంబర్ 20లోగా ఫలితాలు ప్రకటించాలి.