Bengaluru Road Rage : సైడ్ మిర్రర్‌ను తాకాడని.. బైకర్‌ను కారుతో గుద్ది చంపారు..!

సైడ్ మిర్రర్‌ను తాకాడన్న కారణంతో బెంగళూరులో బైకర్‌ను కారుతో గుద్ది చంపిన దంపతుల కిరాతం.. పోలీసులు అరెస్ట్ చేశారు.

Bengaluru Road Rage

విధాత : కారు సైడ్ మిర్రర్ ను తాకాడన్న కారణంతో బైకర్ ను కారుతో వెంటాడి గుద్ది చంపిన దంపతుల కిరాతం వెలుగు చూసింది. ఈ ఘటన బెంగళూరులో ఈ నెల 25న అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఈ నెల 22న అర్థరాత్రి సమయంలో దర్శన్‌ తన స్నేహితుడు వరుణ్‌తో కలిసి శ్రీరామ లేఅవుట్ ప్రాంతంలో బైకుపై వెళ్తున్నారు. ఆ సమయంలో పక్కగా వెళుతున్న కారు సైడు మిర్రర్‌ను వారి బైకు తాకింది. దీంతో కారులో ఉన్న దంపతులు మనోజ్‌కుమార్, ఆయన భార్య ఆరతి శర్మలు ఆగ్రహంలో బైక్ నడుపుతున్న దర్శన్‌తో గొడవకు దిగారు. అంతటితో ఆగకుండా బైక్ పై వెళ్లిపోతున్న దర్శన్, వరుణ్ ల బైక్ ను 2కిలో మీటర్లు వెంటాడి ఢీ కొట్టారు. దీంతో ప్రమాదంతో దర్శన్, వరుణ్ లు తీవ్రంగా గాయపడగా..వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దర్శన్ మృతిచెందగా..తీవ్రంగా గాయపడిన వరుణ్ చికిత్స పొందుతున్నాడు. దంపతులు బైక్ ను గుద్దిన ప్రాంతంలో వారి కారు విడిభాగాలు కొన్ని పడిపోగా.. నిందితులుమనోజ్, ఆరతిలు ముఖాలకు మాస్కులు వేసుకుని వెనక్కి వచ్చి వాటిని తీసుకెళ్లారు. ఈ వ్యవహారం అంతా అక్కడి సీసీ కెమెరాల ఫుటేజీ ద్వారా పోలీసులు గుర్తించారు. నిందితులను జేపీనగర్ పోలీసులు బుధవారం అరెస్టు చేసి రిమాండ్ చేశారు.