బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో రఘోపూర్ నియోజకవర్గం ఓట్ల లెక్కింపులో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మహాఘట్‌బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి, ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ ఇక్కడ నుంచి పోటీ చేసిన విషయం తెలిసిందే. 11వ రౌండ్ ముగిసే సమయానికి ఆయన తన సమీప బీజేపీ ప్రత్యర్థి సతీశ్ కుమార్ యాదవ్ కంటే 4800 ఓట్లు వెనుకంజలో ఉన్నారు. ఇక్కడ జన సూరజ్ పార్టీ నుంచి చంచల్ కుమార్, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి రాజు కుమార్ బరిలో ఉన్నారు.
మధ్యాహ్నం 3 గంటల సమయానికి సతీశ్ నుంచి ఆయనకు తీవ్ర పోటీ ఎదురవుతున్నదని ఎలక్షన్ కమిషన్ ట్రెండ్స్‌ను బట్టి తెలుస్తున్నది. 11వ రౌండ్ పూర్తయ్యే సరికి తేజస్వి.. 4,800 ఓట్లు వెనుకబడి ఉన్నారు. బీజేపీ అభ్యర్థి సతీశ్‌కు 44,929 ఓట్లు పోల్ కాగా.. తేజస్వి.. 40,100 ఓట్లతో ఉన్నారు. రఘోపూర్ నియోజకవర్గం బీహార్‌లోని వైశాలి జిల్లాలో ఉంది. నవంబర్ 6వ తేదీన నిర్వహించిన తొలి విడుత పోలింగ్‌లో ఇక్కడి ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. యశువంశి నాయకుడైన సతీశ్.. రఘోపూర్‌లో ఒక బలమైన అభ్యర్థిగా ముందుకు వచ్చారు. ఇదే స్థానం నుంచి తేజస్వియాదవ్ తల్లి, మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవిపై 2010 అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ అభ్యర్థిగా విజయం సాధించారు. తర్వాత ఆయన బీజేపీలో చేరారు.
నిజానికి ఈ స్థానం లాలూ కుటుంబానికి పెట్టని కోటగా చెబుతారు. దశాబ్దకాలంగా ఈ స్థానం నుంచి లాలు కుమారుడు తేజస్వి యాదవ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2015, 2020 ఎన్నికల్లో ఇదే సతీశ్‌పై తేజస్వి గెలుపొందారు. ఇక్కడ నుంచి వరుసగా మూడోసారి విజయం సాధించేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. తేజస్వికి ముందు ఆయన తండ్రి లాలు ప్రసాద్ యాదవ్, తల్లి రబ్రీదేవి (ఇద్దరూ మాజీ ముఖ్యమంత్రులు) ఈ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహించారు. లాలు 1995, 2000 సంవత్సరాల్లలో విజయం సాధించగా.. రబ్రీదవి 2000 సంవత్సరంలో తొలుత ఉప ఎన్నికలో, తదుపరి రెండు వరుస పర్యాయాలు విజయం సాధించారు. రఘోపూర్‌లో 2025 అసెంబ్లీ నియోజకవర్గంలో 64 శాతం ఓటింగ్ నమోదైంది.
