Bihar Assembly Elections | తక్కువ మెజారిటీతో 15 మంది గెలుపు.. కొంప ముంచిన ఇండిపెండెంట్లు

బీహార్‌ ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాల్లో అత్యంత స్వల్ప మెజార్టీతో బయటపడిన అభ్యర్థులూ ఉన్నారు. చాలా మంది ఇండిపెండెంట్లు, ఇతర చిన్న పార్టీల అభ్యర్థుల కారణంగా మెజార్టీలు తగ్గినవారూ ఉన్నారు.

హైదరాబాద్, విధాత ప్రతినిధి:

Bihar Assembly Elections | బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో వందల ఓట్ల మెజారిటీతో గెలిచిన అభ్యర్థులు కూడా ఉన్నారు. మొత్తం 243 నియోజకవర్గాల్లో ఇలాంటి నియోజకవర్గాలు 15 వరకు ఉన్నాయి. ఇందులో బీజేపీ, లోక్ జనశక్తి పార్టీ నుంచి ఇద్దరు చొప్పున, ఆర్జేడీ నుంచి ముగ్గురు, కాంగ్రెస్ నుంచి ముగ్గురు, జేడీయూ నుంచి నలుగురు, బీఎస్పీ నుంచి ఒక్కరు చొప్పున గెలిచారు. వీరిలో చాలా మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు, జన సురాజ్, బీఎస్పీ, ప్రాంతీయ పార్టీల అభ్యర్థుల కారణంగా ఓటమి పాలయ్యారు. ఇదే కాకుండా నోటాకు అత్యధికంగా రావడం కూడా మెజారిటీ తగ్గడానికి కారణమైందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు..

అగియాన్ అసెంబ్లీ నియోజకవర్గంలో సీపీఐ ఎంఎల్ లిబరేషన్ అభ్యర్థి శివ ప్రకాశ్ రంజన్ పై బీజేపీ అభ్యర్థి మహేశ్ పాసవాన్ కేవలం 95 ఓట్లతో బయటపడ్డారు. జన సురాజ్ పార్టీ అభ్యర్థి 3,882, బీఎస్పీ 1,440, జనశక్తి జనతాదళ్ 1,328, ఓటర్స్ పార్టీ 584, ముగ్గురు ఇండిపెండెంట్ అభ్యర్థులు 3,962 ఓట్లు వచ్చాయి. నోటాకు 3,631 ఓట్లు రావడంతో బీజేపీ అభ్యర్థి మహేష్ పాసవాన్ 95 ఓట్లతో గెలుపొందాడు. భక్తియార్‌పూర్‌లో ఆర్జేడీ అభ్యర్థి అనిరుద్ధ్ కుమార్‌పై లోక్ జనశక్తి పార్టీ అభ్యర్థి అరుణ్ కుమార్ 981 ఓట్లతో విజయం సాధించారు. జన సురాజ్ కు 6,581, బీఎస్పీకి 2,923, ఆప్ 1,553, నోటా కు 3,635 ఓట్లు పోలయ్యాయి. బలరాం పూర్ లో సీపీఐ ఎంఎల్ లిబరేషన్ అభ్యర్థి మహబూబ్ ఆలం కు 79,141 ఓట్లు వచ్చినప్పటికీ గెలవ లేకపోయారు. అక్కడ ఎంఐఎం అభ్యర్తి మహ్మద్ అదిల్ హసన్ బరిలో ఉండి 80,070 ఓట్లు పొందడంతో సీపీఐ ఎంఎల్ అభ్యర్థి నష్టపోయారు. ఇదే నియోజకవర్గం నుంచి 10 మంది ముస్లిం అభ్యర్థులు బరిలో నిల్చుని సుమారు 24,836 ఓట్లు చీల్చడంతో సీపీఐ ఎంఎల్ అభ్యర్థి 1,318 ఓట్లతో ఓటమి పాలయ్యారు. ఈ నియోజకవర్గంలో నోటాకు 3,185 ఓట్లు వచ్చాయి.

బోధ్ గయలో ఆర్జేడీ అభ్యర్థి కుమార్ సర్వజీత్ 881 ఓట్లతో విజయం సాధించగా, లోక్ జనశక్తి పార్టీ అభ్యర్థి శ్యామ్ దేవ్ పాసవాన్ 881 ఓట్లతో ఓటమి పాలయ్యారు. జనసురాజ్ పార్టీ 4,024 ఓట్లు, వికాస్ వంచిత్ ఇన్సాన్ పార్టీ 3,675, పీపుల్స్ పార్టీ ఆఫ్ ఇండియా 1,543 ఓట్లు చీల్చగా, నోటా కు 5,960 ఓట్లు రావడం గమనార్హం. చన్‌పాటియాలో కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ రంజన్ బీజేపీ అభ్యర్థి ఉమాకాంత్ సింగ్ పై 602 ఓట్ల తో విజయం సాధించారు. ఇక్కడ జన సురాజ్ కు 37,172, లోక తాంత్రిక్ జనస్వరాజ్ పార్టీకి 2,108, ఇండిపెండెంట్ కు 2,092 ఓట్లు రాగా నోటాకు 2,609 ఓట్లు వచ్చాయి. ఢాకాలో ఆర్జేడీ అభ్యర్థి ఫైసల్ రహ్మాన్ బీజేపీ అభ్యర్థి పవన్ కుమార్ జైస్వాల్ పై 178 ఓట్లతో గెలుపొందారు. ఇండిపెండెంట్ కు 1,685, నోటాకు 3045 ఓట్లు వచ్చాయి. ఎంఐఎం అభ్యర్థి రానా రంజిత్ 5,730 ఓట్లు చీల్చడంతో ఆర్జెడీ కి మెజారిటీ తగ్గింది. డుమ్రావున్ లో జేడీయూ అభ్యర్థి రాహుల్ కుమార్ సింగ్ సీపీఐ ఎంఎల్ లిబరేషన్ అభ్యర్థి డాక్టర్ అజిత్ కుమార్ సింగ్ పై 2,105 ఓట్లతో గెలుపొందారు. బీఎస్పీ 11,127, జనసురాజ్ పార్టీ 5,273, సుహేల్ దేవ్ భారతీయ సమాజ్ పార్టీ 4,976 ఓట్ల చొప్పున రాగా, నోటా కు 3,059 ఓట్లు వచ్చాయి. ఫోర్బ్స్ గంజ్ లో బీజేపీ అభ్యర్థి విద్యాసాగర్ కేశరీ పై కాంగ్రెస్ అభ్యర్థి మనోజ్ బిశ్వాస్ 221 ఓట్లతో విజయం సాధించారు. ముగ్గురు ముస్లిం అభ్యర్థుల కారణంగా కాంగ్రెస్ కు 3,319 ఓట్ల మెజారిటీ తగ్గింది. నోటా కు 3,114 ఓట్లు పోలయ్యాయి. జెహనాబాద్ లో జేడీయూ అభ్యర్థి చందేశ్వర్ ప్రసాద్ పై ఆర్జెడీ అభ్యర్థి రాహుల్ కుమార్ 793 ఓట్లతో గెలుపొందారు. జనసురాజ్ పార్టీకి 5,760, ఆప్ 1,170 ఓట్లు రావడంతో ఆర్జేడీ అభ్యర్థికి మెజారిటీ కి గండి పడింది. నోటా కు 4,577 ఓట్లు రావడం కూడా కారణం.

నబీనగర్‌లో ఆర్జేడీ అభ్యర్థి అమోద్ కుమార్ సింగ్ పై జేడీయూ అభ్యర్థి చేతన్ ఆనంద్ 112 ఓట్లతో విజయం సాధించారు. బీఎస్పీ 6,595, జనసురాజ్ 4,085, సుహేల్ దేవ్ భారతీయ సమాజ్ పార్టీ 2,336, ఒక ఇండిపెండెంట్ 7,075 రాగా నోటా కు 4,042 ఓట్లు వచ్చాయి. ఈ పార్టీల కారణంగేనే ఆర్జేడీ ఓటమి పాలయింది. నర్కాటియా లో ఆర్జెడీ అభ్యర్థి షమీమ్ అహ్మద్ పై జేడీయూ అభ్యర్థి విశాల్ కుమార్ 1,443 ఓట్లతో గెలుపొందారు. అయితే ఇక్కడ ఆర్జెడీ అభ్యర్థి ముస్లిం కావడంతో ఆయనకు పోటీగా ముగ్గురు ముస్లిం ఇండిపెండెంట్లు నిల్చున్నారు. ఈ ముగ్గురు కలిసి 3,759 ఓట్లు చీల్చుకోగా, జనసురాజ్ పార్టీకి 7,002 ఓట్లు, నోటాకు 5,425 ఓట్లు పోలయ్యాయి. దీంతో జేడీయూ అభ్యర్థి విశాల్ గెలుపునకు మార్గం సుగమం అయ్యింది.

రాంఘర్ లో బీజేపీ అభ్యర్థి అశోక్ కుమార్ సింగ్ పై బీఎస్పీ అభ్యర్థి సతీష్ కుమార్ సింగ్ యాదవ్ 30 ఓట్లతో మాత్రమే విజయం సాధించారు. ఆర్జెడీకి 41,480, జనసురాజ్ కు 4,426, సుహేల్ దేవ్ భారతీయ సమాజ్ కు 1,779, నోటాకు 1,174 ఓట్లు రావడం గమనార్హం. సందేశ్ నియోజకవర్గంలో ఆర్జేడీ అభ్యర్థి దీపు సింగ్ పై జేడీయూ అభ్యర్థి రాధాచరణ్ షా కేవలం 27 ఓట్లతో విజయం సాధించడం సంచలనం రేపుతోంది. ఇక్కడ జనసురాజ్ 6,040, నలుగురు ఇండిపెండెంట్లు తొమ్మిది వేల వరకు ఓట్లు వచ్చాయి. నోటాకు కూడా 4,160 ఓట్లు పోలాయ్యాయి. ఇండిపెండెంట్లు బరిలో లేనట్లయితే ఆర్జెడీ విజయ కేతనం ఎగురవేసేదంటున్నారు. తరయ్యా నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి జనక్ సింగ్ ఆర్జేడీ అభ్యర్థి శైలేంద్ర ప్రతాప్ సింగ్ పై 1,329 ఓట్లతో విజయం సాధించారు. జనసురాజ్ కు 5086, ఆప్ కు 1851, పీస్ పార్టీకి 1,018, నోటాకు1,724 ఓట్లు వచ్చాయి. ఈ అభ్యర్థులు లేనట్లయితే ఆర్జేడీ అభ్యర్థి విజయం లభించేది. వాల్మీకి నగర్ నియోజకవర్గంలో జేడీయూ అభ్యర్థి ధీరేంద్ర ప్రతాప్ సింగ్ పై కాంగ్రెస్ అభ్యర్థి సురేంద్ర ప్రసాద్ 1,675 ఓట్లతో గెలుపొందారు. నోటాకు 6,400, బీఎస్పీకి 5,312, ముస్లిం ఇండిపెండెంట్ కు 1,554 ఓట్లు రావడంతో కాంగ్రెస్ కు మెజారిటీ తగ్గిందంటున్నారు.

నియోజకవర్గం – గెలిచిన అభ్యర్థి – ఓడిన అభ్యర్థి – మెజారిటీ

అగియాన్మ – హేశ్‌ పాసవాన్–బీజేపీ – శివప్రకాశ్ రంజన్సీ – పీఐఎంఎల్ లిబరేషన్ – 95
భక్తియార్ పూర్ – అరుణ్ కుమార్ – ఎల్.జె.పీ – అనిరుద్ధ కుమార్ – ఆర్జెడీ – 981
బలరాం పూర్ – సంగీతాదేవీ – ఎల్.జె.పీ – మహ్మద్ అదిల్ హసన్ – ఎంఐఎం – 389
బోధ్ గయ – కుమార్ సర్వజిత్ – ఆర్జేడీ – శ్యామ్ దేవ్ పాసవాన్ – ఎల్.జె.పీ – 881
ఛణ్‌పాటియా – అభిషేక్ రంజన్ – కాంగ్రెస్ – ఉమాకాంత్ సింగ్ – బీజేపీ – 602
ఢాకా – ఫైజల్ రహ్మాన్ – ఆర్జెడీ – పవన్ కుమార్ – బీజేపీ – 178
డుమ్రావున్ – రాహుల్ కుమార్ – జేడీయూ – అజిత్ కుమార్ – సీపీఐ ఎంఎల్ లిబరేషన్ – 2105
ఫోర్బ్స్ గంజ్ – మనోజ్ బిస్వాస్ – కాంగ్రెస్ – విద్యాసాగర్ – బీజేపీ – 221
జెహనాబాద్ – రాహుల్ కుమార్ – ఆర్జెడీ – చందేశ్వర్  ప్రసాద్ – జేడీయూ – 793
నబీనగర్ – చేతన్ ఆనంద్ – జేడీయూ – అమోద్ కుమార్ – ఆర్జెడీ – 112
నర్కాటియా – విశాల్ కుమార్ – జేడీయూ – షమీమ్ అహ్మద్ – ఆర్జేడీ – 1,443
రాంఘర్ – సతీష్ యాదవ్ – బీ.ఎస్.పీ – అశోక్ కుమార్ – బీజేపీ – 30
సందేశ్ – రాధాచరణ్ షా – జేడీయూ – దీపు సింగ్ – ఆర్జేడీ – 27
తరయ్యా – జనక్ సింగ్ – బీజేపీ – శైలేంద్ర ప్రతాప్ – ఆర్జేడీ – 1,329
వాల్మీకి నగర్ – సురేంద్ర ప్రసాద్ – కాంగ్రెస్ – దీరేంధ్రప్రతాప్ సింగ్ – జేడీయూ – 1,675