Giriraj Singh Controversy | కేంద్ర జౌళి శాఖ మంత్రి, బీజేపీ నాయకుడు గిరిరాజ్ సింగ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి తీవ్ర వివాదాన్ని రాజేశారు. బీహార్‌లోని అర్వాల్ జిల్లాలో శనివారం జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందుతూ కూడా తమ పార్టీకి ఓటు వేయని వారిని ఉద్దేశించి.. నమ్మక ద్రోహులు అంటూ కేంద్రమంత్రి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే, ముస్లిం వర్గాన్ని లక్ష్యంగా చేసుకుంటూ ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయ దుమారాన్ని రేపింది.
బెగుసరాయ్ బీజేపీ ఎంపీ అయిన గిరిరాజ్ సింగ్, ఒక మౌల్వీ (క్లర్క్)తో జరిగిన సంభాషణను ఈ సందర్భంగా వివరించారు. ‘నేను ఒక మౌల్వీని మీకు ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కార్డు ఉందా అని అడగగా.. దానికి ఆయన ఉంది అని సమాధానం ఇచ్చారు. హిందూ-ముస్లిం ఆధారంగా ఇలాంటి కార్డులు పంచుతున్నారా అని అడిగితే, లేదని చెప్పారు. నేను తనకి ఓటు వేశారా అని అడిగితే, ఆయన మొదట ‘వేశాను’ అని అన్నారు. కానీ, ఖుదా (దేవుడి) మీద ప్రమాణం చేసి చెప్పమంటే, ‘లేదు, వేయలేదు’ అని ఒప్పుకున్నారు. ముస్లింలు కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలన్నీ తీసుకుంటారు. కానీ మాకు ఓటు వేయరు. అలాంటి వారిని ‘నమక్ హరామ్‌లు’ అంటారు. ఆ ‘నమక్ హరామ్‌ల’ ఓట్లు నాకు అవసరం లేదు అని ఆ మౌల్వీ సాహెబ్‌తో చెప్పాను. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కానీ, తాను కానీ మౌల్వీని ఎప్పుడైనా అవమానించామా అని అడిగానని, దానికి మౌల్వీ లేదు అంటూ చెప్పారు’ ’ అని గిరిరాజ్ సింగ్ తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం బీహార్ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేసిందని గిరిరాజ్ సింగ్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ‘బీహార్‌లో రోడ్లు కేవలం ఎన్డీఏ నాయకులు, కార్యకర్తల కోసం మాత్రమే కాదు, సామాన్య ప్రజలందరి కోసం నిర్మించబడ్డాయి… బీహార్ ఇప్పుడు మారిపోయింది. ఎన్డీఏ ప్రభుత్వం సమాజంలోని ప్రతి వర్గం కోసం పనిచేస్తుంది. కానీ ముస్లింలు మాత్రం బీజేపీకి ఓటు వేయడం లేదు’ అని కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ ఆరోపించారు.
ఆర్జేడీ నుండి తీవ్ర స్పందన
గిరిరాజ్ సింగ్ ప్రకటనపై ఆర్జేడీ (RJD) రాష్ట్ర యూనిట్ ప్రతినిధి మృత్యుంజయ్ తివారీ తీవ్రంగా స్పందించారు. ‘బీజేపీ నాయకులు హిందూ-ముస్లిం తప్ప ఇంకేమీ మాట్లాడలేరనేది బహిరంగ రహస్యం. పెరుగుతున్న నిరుద్యోగం, ధరల పెరుగుదల, మెరుగైన విద్య, వైద్య సదుపాయాల గురించి వారు మాట్లాడలేరు… మీరు వారితో అభివృద్ధి గురించి మాట్లాడటానికి ప్రయత్నించినప్పుడల్లా, వారు హిందూ-ముస్లిం అంశాలను లేవనెత్తి, ప్రధాన సమస్యల నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికి ప్రయత్నిస్తారు’ అని మృత్యుంజయ్ తివారీ మండిపడ్డారు.