బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో చాలా విషయాలు సరిపోలడం లేదని జనసురాజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిషోర్ అన్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసురాజ్ పార్టీ ఘోరంగా వైఫల్యం చెందింది. ఆ పార్టీకి ఒక్క సీటు కూడా దక్కలేదు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఆయన ఇండియాటుడే చానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ పార్టీ 2 నుంచి 3 శాతం ఓట్లు మాత్రమే సాధించింది. క్షేత్రస్థాయిలో ప్రజల స్పందనకు అనుగుణంగా ఫలితాలు లేవని ఆయన అన్నారు. ఓటింగ్ ప్రక్రియలో ఏదో అనుమానాస్పదంగా ఉందన్నారు. చాలా విషయాలు సరిపోలడం లేదన్నారు.
అదే సమయంలో ఓటు దొంగతనానికి సంబంధించి తన వద్ద కచ్చితమైన రుజువు లేదని ఆయన అంగీకరించారు. ఏదో కచ్చితంగా తప్పు జరిగిందని అన్నారు. కానీ, తప్పు జరిగిందని చెప్పేందుకు తమ వద్ద ఆధారాలు లేవని తెలిపారు. ఎన్నికలకు ముందు మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు ఎన్ డీ ఏ ప్రభుత్వం పథకాల రూపంలో పెద్ద ఎత్తున నగదును అందించారని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఇలా నగదు పంపిణీ జరగలేదని ఆయన చెప్పారు.
జన సురాజ్ పార్టీ అన్ని కమిటీలు రద్దు
బీహార్ ఎన్నికల్లో ఘోరంగా ఓటమి చెందడంతో పార్టీకి చెందిన అన్ని కమిటీలను ప్రశాంత్ కిషోర్ రద్దు చేశారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్న అన్ని కమిటీలను ఆయన రద్దు చేశారు. రాష్ట్రంలోని 12 డివిజన్లకు సీనియర్ నాయకులకు బాధ్యతలను అప్పగించారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే బాధ్యతను సీనియర్లు ప్రారంభించారు. పార్టీ ఎందుకు ఓడిపోయిందనే దానిపై క్షేత్రస్థాయి నుంచి సీనియర్లు నివేదిక తయారు చేసి పార్టీ నాయకత్వానికి అందిస్తారు. క్రమశిక్షణ రాహిత్యం లేదా పార్టీ నాయకులు ఎవరైనా అంతర్గతంగా ఇతర పార్టీలకు సహాయం చేశారా అనే విషయాలపై కూడా సీనియర్ల టీమ్ నివేదికను తయారు చేయనుంది.
