Site icon vidhaatha

Exit Polls | కేంద్రంలో మళ్లీ బీజేపీ? ఎక్కువ ఎగ్జిట్‌పోల్స్‌ సారాంశమిదే

కేంద్రంలో మళ్లీ బీజేపీ?
ఎక్కువ ఎగ్జిట్‌పోల్స్‌ సారాంశమిదే
ఎన్డీయేకు కనిష్ఠంగా 253.. గరిష్ఠంగా 392
చార్‌ సౌ పార్‌.. సాధ్యం కాదన్న సర్వేలు
ఇండియా మెజార్టీ దరిదాపుల్లోకి రాదు
పోలింగ్‌ ముగియగానే ఎగ్జిట్‌ పోల్స్‌ హోరు
వాస్తవ ఫలితాల ప్రకటన జూన్‌ 4వ తేదీన
అప్పటిదాకా వేచిచూడాలన్న విశ్లేషకులు
న్యూఢిల్లీ : కేంద్రంలో మరోసారి బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నదా? అంటే ఎగ్జిట్‌ పోల్స్‌ సర్వేలు అవుననే అంటున్నాయి. ఎన్డీయేకు కనిష్ఠంగా 253 నుంచి గరిష్ఠంగా 392 స్థానాల వరకూ వస్తాయని వివిధ సర్వేలు అంచనా వేశాయి. ఇండియా కూటమి మెజార్టీ దరిదాపుల్లోకి కూడా రాదని ఊహించాయి. 543 స్థానాలు ఉన్న లోక్‌సభలో ఒక పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కనీసం 272 సీట్లు పొంది ఉండాలి. శనివారం సాయంత్రం పోలింగ్‌ ముగిసిన వెంటనే కుప్పలు తెప్పలుగా ఎగ్జిట్‌ పోల్స్‌ వచ్చిపడ్డాయి. వాటన్నింటి సారాంశం.. మరో ఐదేళ్లు బీజేపీ పాలన తప్పదనేదే! ఇందులో పలు ఆసక్తికర అంశాలు కూడా కనిపిస్తున్నాయి. బీజేపీ పదే పదే ఊదరగొట్టిన చార్‌ సౌ పార్‌ ఈసారి పనిచేయలేదు. బీజేపీ కోరుకున్న 370 సీట్లు కూడా వాస్తవరూపం దాల్చే పరిస్థితి లేదని పేర్కొన్నాయి. బీజేపీ ప్రభావం తగ్గిపోయిందని భావిస్తున్న కర్ణాటకలో, మమత బలంగా ఉన్నారని భావించే బెంగాల్‌లో ఎన్డీయే అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంటుందని ఎగ్జిట్‌పోల్స్‌ పేర్కొన్నాయి. సగటున ఎన్డీయే 357, ఇండియా 148 సీట్లు గెల్చుకునే అవకాశం ఉన్నదని 5 ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు పేర్కొంటున్నాయి. పార్టీ పరంగా బీజేపీ 327, కాంగ్రెస్‌ 52 స్థానాల్లో గెలుస్తుందని తెలిపాయి. ఎన్డీయేకు 361, ఇండియాకు 145, ఇతరులకు 37 సీట్లు లభిస్తాయని ఎన్డీటీవీ పోల్‌ ఆఫ్‌ పోల్స్‌ పేర్కొన్నది.

ఎన్డీయే కూటమికి కనిష్ఠంగా 353 నుంచి గరిష్ఠంగా 368 స్థానాల లభిస్తాయని మ్యాట్రిజ్‌ సర్వే పేర్కొన్నది. ఇదే సంస్థ ఇండియా కూటమికి 118 నుంచి 133 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఇతరులు 43 నుంచి 48 స్థానాల్లో గెలుస్తారని లెక్కగట్టింది. పీఎంఏఆర్‌క్యూ సంస్థ ఎన్డీయేకు 359 సీట్లు ఖాయమని అంచనా వేసింది. ఇండియా కూటమికి 154 సీట్లు, ఇతరులకు 30 సీట్లు వస్తాయని తెలిపింది. జన్‌కీ బాత్‌ సర్వే ప్రకారం.. ఎన్డీయేకు కనిష్ఠంగా 362 నుంచి 392 స్థానాలు వస్తాయి. ఇండియా కూటమికి 141 నుంచి 161 సీట్లు వచ్చే అవకాశం ఉన్నది. ఇతరులు పది నుంచి 20 స్థానాల్లో గెలవబోతున్నారని ఆ సంస్థ ఊహించింది. డీ డైనమిక్స్‌ సర్వే ప్రకారం ఎన్డీయే 371 స్థానాల్లో విజయం సాధించబోతున్నది. ఇండియా కూటమి 125, ఇతరులు 47 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉన్నదని ఆ సంస్థ తెలిపింది. దైనిక్‌ భాస్కర్‌ పోల్‌ సర్వే ఎన్డీయేకు కనిష్ఠంగా 285 నుంచి గరిష్ఠంగా 350 వరకూ వస్తాయని అంచనా వేసింది. ఇండియా కూటమికి 145 నుంచి 201 మధ్య సీట్లు రావచ్చని పేర్కొన్నది. ఇతరులు 33 నుంచి 49 స్థానాలు గెలుస్తారని అంచనా వేసింది.
కేరళ, తమిళనాడులో యూడీఎఫ్‌, ఇండియా
కేరళలోని 20 స్థానాలకు గాను కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌ 17 నుంచి 18 సీట్లు గెలిచే అవకాశం ఉన్నదని ఇండియా టుడే మై యాక్సిస్‌ పేర్కొన్నది. ఇక్కడ ఎన్డీయే కూటమికి 2 లేదా మూడు సీట్లు వస్తాయని తెలిపింది. వామపక్షాలకు ఒక్క సీటు కూడా దక్కడం లేదని సర్వే పేర్కొన్నది. హర్యానాలోని పది స్థానాలకు గాను ఎన్డీయే ఆరు నుంచి ఎనిమిది సీట్లలో, ఇండియా కూటమి రెండు నుంచి నాలుగు సీట్లలో విజయం సాధిస్తుందని తెలిపింది. ఢిల్లీలో ఏడు సీట్లకు గాను ఎన్డీయే ఆరు లేదా ఏడు సీట్లలో ఇండియా సున్నా లేదా ఒక సీట్లో విజయం సాధిస్తుందని పేర్కొన్నది. గోవాలోని రెండు సీట్లలో ఎన్డీయే, ఇండియా కూటమి చెరొకటి గెలుస్తాయని అంచనా వేసింది. రాజస్థాన్‌లోని 25 సీట్లలో ఎన్డీయే 16 నుంచి 19 సీట్లు గెలుస్తుందని, ఇండియా కూటమి 5 లేదా ఏడు సీట్లలో విజయం సాధిస్తుందని తెలిపింది. రాజస్థాన్‌, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లలో ఎన్డీయే క్లీన్‌ స్వీప్‌ చేసే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. తమిళనాడులో ఇండియా కూటమికి 33 నుంచి 37, ఎన్డీయేకు 2 నుంచి నాలుగు, అన్నా డీఎంకేకు సున్నా నుంచి రెండు స్థానాలు లభిస్తాయని అంచనా వేసింది.
ఎగ్జిట్‌పోల్స్‌ కచ్చితత్వం ఎంత?
ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఒక నియోజకవర్గంలోని లక్షల మంది ఓటర్లలో వందల సంఖ్యలో నమూనాలు సేకరించి చేసే సర్వేల్లో శాస్త్రీయత లేదని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. అందుకే ఒక సర్వేకు మరో సర్వేకు చాలా తేడా ఉంటుందని వారు ప్రస్తావిస్తున్నారు. కొన్ని సర్వేలు భిన్న ఫలితాలను చూపడం కూడా గమనించవచ్చని గుర్తు చేస్తున్నారు. చాలా సందర్భాల్లో ప్రజా నాడిని పసిగట్టడంలో ఎగ్జిట్‌ పోల్స్‌ విఫలమైన సంగతి తెలిసిందే. గత రెండు ఎన్నికల్లో కూడా ఎన్డీయే ప్రభావాన్ని సరిగ్గా అంచనా వేయడంలో ఎగ్జిట్‌ పోల్స్‌ బోల్తా పడ్డాయి. ఈ నేపథ్యంలో వీటిని కుతూహలం కొద్దీ చూడాలే తప్ప.. ఇవి వాస్తవ ఫలితాలతో ఎంతమాత్రం సరిపోలవని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ఇందులో రాజకీయ ప్రయోజనాలతో సర్వే చేసే సంస్థలు కూడా ఉండొచ్చని అంటున్నారు.

Exit mobile version