Site icon vidhaatha

Devendra Fadnavis । మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా గురువారం ఫడణవీస్‌ ప్రమాణం.. ఏక్‌నాథ్‌కు డిప్యూటీతో సరి!

Devendra Fadnavis । మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్‌ నేత, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ పేరును బీజేపీ ఖరారు చేసింది. ఈ విషయంలో కొద్ది రోజులుగా నెలకొన్న సస్పెన్స్‌కు తెరదించింది. బుధవారం సాయంత్రం మహాయుతి నేతలు గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరారు. ఈ మేరకు గురువారం సాయంత్రం (డిసెంబర్‌ 5) ఆజాద్‌ మైదాన్‌లో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడణవీస్‌ ప్రమాణం చేయనున్నారు. ముఖ్యమంత్రి పదవి కోసం తీవ్ర ప్రయత్నాలు చేసిన శివసేన నేత ఏక్‌నాథ్‌ షిండే ఉప ముఖ్యమంత్రి పదవితో సరిపెట్టుకునే అవకాశాలు ఉన్నాయి. బుధవారం నిర్వహించిన బీజేపీ కోర్‌ కమిటీ సమావేశంలో ఫడణవీస్‌ పేరును ఖరారు చేసినట్టు ఆ పార్టీ కేంద్ర పరిశీలకులు నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు.

ముఖ్యమంత్రి పదవి విషయంలో నెలకొన్న ప్రతిష్ఠంభన నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, గుజరాత్‌ మాజీ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీలను బీజేపీ అధిష్ఠానం మహారాష్ట్రకు పరిశీలకులుగా పంపిన విషయం తెలిసిందే. కోర్‌ కమిటీ సమావేశంలో ఫడణవీస్‌ కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఫడణవీస్‌ను శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గతంలో ఉన్న విధంగానే ఇద్దరు ఉప ముఖ్యమంత్రుల వ్యవస్థ కొనసాగనున్నట్టు తెలుస్తున్నది. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న ఏక్‌నాథ్‌ షిండే ఇప్పటికే బీజేపీ కేంద్ర నాయకత్వం చేసే ప్రతిపాదనలకు సంపూర్ణ ఆమోదం తెలియజేస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయినా.. పలు డిమాండ్లను ఆయన బీజేపీ అధిష్ఠానం ముందు పెట్టారని వార్తలు వచ్చాయి. శివసేన (షిండే) కు ఒక ఉప ముఖ్యమంత్రి పదవి లభించనున్నది. అదే సమయంలో కీలకమైన హోం శాఖ కోసం ఆ పార్టీ పట్టుపడుతున్నట్టు తెలుస్తున్నది. ఇటీవలి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి ఘన విజయం సాధించింది. 288 స్థానాలకు ఎన్నికలు జరుగగా.. బీజేపీ సొంతగా 132 సీట్లు గెలిచింది. మొత్తంగా కూటమికి 230 సీట్లు లభించాయి.

Exit mobile version