Site icon vidhaatha

కునో పార్కులో ఐదు కూనలతో చీతా సందడి.. వర్షంలో పిల్లల గంతులు

వైరల్‌గా మారిన వీడియో

విధాత: తన ఐదు పిల్లలతో శుక్రవారం ఉదయం మధ్యప్రదేశ్‌‌లోని కునో నేషనల్ పార్క్‌లో వర్షాన్ని ఆస్వాదించిన దక్షిణాఫ్రికా చీతా ‘గామిని’ చేసిన సందడి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తల్లి చీతాతో కలిసి వర్షంలో ఐదు పిల్ల చీతాలు వేసిన గంతులు వీక్షకులను అలరిస్తున్నాయి. సంబంధిత వీడియోను కేంద్ర అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ట్విటర్‌లో పోస్టు చేశారు. 2023 మార్చిలో నమీబియా నుంచి తీసుకొచ్చిన జ్వాలా చిరుత నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. అయితే, వాటిలో ఒకటి మాత్రమే ప్రాణాలతో బయటపడింది. కాగా జ్వాలా మళ్లీ 2024 జనవరి నెలలో మూడు పిల్లలకు జన్మనిచ్చింది. అంతకుముందు నమీబియా నుంచే తీసుకొచ్చిన ఆశా అనే చిరుత మూడు కూనలకు జన్మనిచ్చినిచ్చింది. ఇటీవల గామిని చీతా ఐదు పిల్లలకు జన్మనిచ్చింది. కొత్తగా పుట్టిన పిల్లలతో కలిపి కునో నేషనల్ పార్క్‌లో మొత్తం చితాల సంఖ్యను 25కు చేరింది.

75 ఏళ్ల క్రితం అంతరించి పోయిన చీతాలను మళ్లీ తీసుకువచ్చి కూనో నేషనల్ పార్కులో వదిలి వాటి సంతానాన్ని అభివృద్ధి చేస్తున్నారు.2022 సెప్టెంబరు 17న ప్రాజెక్టు చీతాలో భాగంగా మొదటి బ్యాచ్‌లో ఎనిమిది నమీబియా, దక్షిణాఫ్రికా నుంచి చిరుతలను కునో నేషనల్ పార్క్‌లో తన పుట్టినరోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు. రెండో బ్యాచ్‌లో 2023 ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికా నుంచి 12 చీతాలను కునోకు తీసుకొచ్చారు. అయితే మొత్తం 20 చీతాల్లో 8 చనిపోయాయి. ఇప్పటి వరకు మొత్తం​ 11 చీతాలు పలు కారణాలతో మరణించాయి. ఒప్పందం ప్రకారం దక్షిణాఫ్రికా, నమీబియా దేశాలు ఏడాదికి 12 నుంచి 14 చీతాలను పంపించనున్నాయి. చీతాల అభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా వాటి సంరక్షణకు పలు దశల్లో అటవీ శాఖ చర్యలు చేపట్టింది.

Exit mobile version