Site icon vidhaatha

కోచింగ్‌ సెంటర్లు కావు.. మృత్యు కేంద్రాలు

ఢిల్లీ కోచింగ్‌ సెంటర్లపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం
ముగ్గురు ఐఏఎస్‌ అభ్యర్థుల మృతి కేసు సూమోటోగా స్వీకరణ
దిద్దుబాటు చర్యలపై కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాలకు నోటీసులు

న్యూఢిల్లీ : ఢిల్లీలోని కోచింగ్‌ సెంటర్లపై సుప్రీంకోర్టు (The Supreme Court) సోమవారం తీవ్రంగా విరుచుకుపడింది. ఇటీవల ఢిల్లీలోని బేస్‌మెంట్‌లో వర్షపు నీటిలో చిక్కుకుని ముగ్గురు ఐఏఎస్‌ అభ్యర్థులు చనిపోయిన ఘటనను సూమోటో(suo motu)గా స్వీకరించింది. దీనిపై తీసుకున్న చర్యలేంటో తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వానికి, ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
ఈ ఉదంతాన్ని సూమోటోగా స్వీకరించిన జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ ధర్మాసనం.. ఇటీవలి దుర్ఘటన అందరికీ కనువిప్పులాంటిదని (eye-opener) పేర్కొన్నది. ప్రభుత్వ నిబంధనలన్నింటినీ అమలు చేసే కోచింగ్‌ సెంటర్లకు మాత్రమే అనుమతులు ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది.

‘ఆ ప్రాంతాలు (కోచింగ్‌ సెంటర్లు) మృత్యుకేంద్రాలుగా (death chambers) మారాయి. హుదాతనంతో కూడిన జీవనానికి అవసరమైన ప్రాథమిక, భద్రతా చర్యలు పాటించకపోతే కోచింగ్‌ సెంటర్లు ఆన్‌లైన్‌లో క్లాసులు నిర్వహించుకోవచ్చు. కోచింగ్‌ సెంటర్లు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పరీక్షార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయి’ అని సుప్రీంకోర్టు తీవ్రంగా వ్యాఖ్యానించింది. ఈ విషయంలో కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాల స్పందనను సుప్రీంకోర్టు కోరింది. తీసుకున్న దిద్దుబాటు చర్యలేంటో వివరించాలని ఆదేశించింది.

ముగ్గురు ఐఏఎస్‌ అభ్యర్థుల మృతి కేసు దర్యాప్తును ఢిల్లీ పోలీసుల నుంచి శుక్రవారం సీబీఐకి అప్పగిస్తూ శుక్రవారం ఢిల్లీ హైకోర్టు నిర్ణయం తీసుకున్నది. దర్యాప్తులో ప్రజలకు ఎలాంటి అనుమానాలకు తావివ్వకుండా ఉండేందుకే ఈ కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్టు ఢిల్లీ హైకోర్టు పేర్కొన్నది.

ఢిల్లీలోని ఓల్డ్‌ రాజేంద్రనగర్‌లోని (Old Rajindra Nagar) కోచింగ్‌ సెంటర్‌ బేస్‌మెంట్‌లోకి జూలై 27న వర్షపునీరు చేరడంతో ముగ్గురు ఐఏఎస్‌ అభ్యర్థులు చనిపోయిన విషయం తెలిసిందే. ఇద్దరు మహిళా అభ్యర్థుల మృతదేహాలను ఎన్డీఆర్‌ఎఫ్‌, స్థానిక పోలీసులు, ఫైర్‌ సిబ్బంది వెలికి తీయగా, తరువాత మరో మృతదేహం లభ్యమైంది. చనిపోయినవారిని ఉత్తరప్రదేశ్‌లోని అంబేద్కర్‌ నగర్‌కు చెందిన శ్రేయా యాదవ్‌ (Shreya adav) (25), తెలంగాణ శాశ్వత చిరునామాతో ఉన్న టాన్య సోని (Tanya Soni) (25), కేరళకు చెందిన నివిన్‌ డాల్విన్‌ (Nivin Dalwin) (24)గా గుర్తించారు.

Exit mobile version