Priyanka Gandhi । కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ గురువారం లోక్‌సభలో ఎంపీగా ప్రమాణం చేశారు. రాయ్‌బరేలీతోపాటు వాయనాడ్ స్థానం నుంచి కూడా గెలిచిన రాహుల్‌గాంధీ.. రాయ్‌బరేలీ ఎంపీగా కొనసాగాలని నిర్ణయించుకుని వాయనాడ్‌కు రాజీనామా చేయడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. గాంధీ కుటుంబం నుంచి ఆ స్థానంలో ఎంపీగా ప్రియాంక గాంధీని కాంగ్రెస్ అధిష్ఠానం నిలబెట్టింది. ఇటీవలి ఉప ఎన్నికల్లో ప్రియాంక విజయం సాధించి మొదటిసారిగా లోక్‌సభలో అడుగుపెట్టారు. కేరళ నుంచి గెలుపొందిన 52 ఏళ్ల ప్రియాంక కేరళ సంప్రదాయ చీరెను ధరించి సభకు హాజరయ్యారు. కేరళ సంప్రదాయ కసావు చీర కట్టుతో ఆమె తనను భారీ మెజార్టీతో గెలిపించిన వాయనాడ్ ప్రజల పట్ల ప్రత్యేక అభిమానాన్ని చాటుకున్నారు. ఆమె నానమ్మ, మాజీ ప్రధాన మంత్రి ఇందిరాగాంధీని తలపించారు. ఇందిర కూడా ఇటువంటి చీరలు కట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. ప్రమాణ స్వీకారం సమయంలో నానమ్మను తలుచుకున్నారా? అన్న ప్రశ్నకు అవునని సమాధానం ఇచ్చిన ప్రియాంక.. తన తండ్రిని కూడా గుర్తు చేసుకున్నానని చెప్పారు. ఆమెతోపాటు మహారాష్ట్రంలోని నాందేడ్ నుంచి గెలుపొందిన కాంగ్రెస్ నేత రవీంద్ర చవాన్ సైతం ఎంపీగా ప్రమాణం చేశారు. రవీంద్ర చవాన్ మరాఠీలో ప్రమాణం చేశారు. ఆయన తండ్రి వసంత్‌రావ్ చవాన్ మృతి నేపథ్యంలో నాందేడ్ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించారు.
ప్రియాంక ఎంపీగా ప్రమాణం చేసిన సమయంలో ఆమె తల్లి, రాజ్యసభ సభ్యురాలు సోనియాగాంధీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ, ప్రియాంక భర్త రాబర్ట్ వాధ్రా తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రియాంక లోక్‌సభ సభ్యురాలిగా ప్రమాణం చేయడంతో ఒకే కుటంబం నుంచి ముగ్గురు ఎంపీలు ఉన్న అరుదైన సందర్భం చోటుచేసుకున్నది. గురువారం సభ సమావేశమైన తర్వాత ప్రియాంక గాంధీ తన చేతిలో రాజ్యాంగం ప్రతిని చేబూని హిందీలో ప్రమాణం చేశారు. సీపీఐ అభ్యర్థి సత్యన్ మాకెరీ పై ప్రియాంక నాలుగు లక్షల పైచిలుకు ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. బుధవారం ప్రియాంక గాంధీని ఢిల్లీలో కలిసిన కాంగ్రెస్ పార్టీ కేరళ నాయకులు.. ఆమెకు ఎలక్షన్ సర్టిఫికెట్‌ను అందించారు.
ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం వాయనాడ్ నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన ప్రియాంక గాంధీ.. ‘పార్లమెంటులో మీ గొంతుక అయ్యే సందర్భం కోసం వేచిచూస్తున్నా’ అని పేర్కొన్నారు. ‘వాయనాడ్ పురోగతి, శ్రేయస్సుకు దివిటీలా వాయనాడ్‌ను మార్చివేసేందుకు ఆమె తెగువ, దయాగుణం, అచంచలమైన అంకిత స్వభావంతో నాయకత్వం వహిస్తారని నాకు తెలుసు’ అంటూ తన సోదరికి రాహుల్‌గాంధీ శుభాకాంక్షలు తెలిపారు. వాయనాడ్ కొండచరియల బాధితులకు సహాయంపై చర్చకు ప్రతిపక్షం పట్టుపడుతున్న సమయంలో ఆమె అదే వాయనాడ్ ఎంపీగా ప్రమాణం చేశారు. దీనితోపాటు అదానీ అంశం, సంభాల్ హింసపై చర్చకు ప్రతిపక్షం పట్టుపట్టి సభా కార్యక్రమాలను స్తంభింపజేయడంతో లోక్‌సభను స్పీకర్ సోమవారానికి వాయిదా వేశారు.