విధాత, హైదరాబాద్ : తనపై దాడులకు ఈడీ సిద్ధమవుతోందని కాంగ్రెస్ ఎంపీ, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ సంస్థలో పనిచేస్తున్న కొందరు విశ్వసనీయ వ్యక్తులు తనకు ఈ సమాచారం తెలియజేశారని వెల్లడించారు. “సాధారణంగానే ప్రతి ఇద్దరిలో ఒకరికి నా ‘చక్రవ్యూహం’ ప్రసంగం నచ్చలేదని, నాపై ఈడీ సోదాలకు సిద్ధమవుతున్నట్లు ఈడీలో పనిచేస్తున్న కొంతమంది వ్యక్తులు తెలిపారని, వారిని ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉన్నానని, చాయ్, బిస్కెట్ ఖర్చు మాత్రం నాదేనని అర్ధరాత్రి 2గంటలకు రాహుల్ గాంధీ తన ట్విటర్ ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చారు. కేంద్ర బడ్జెట్ 2024-25పై లోక్సభలో జరుగుతున్న చర్చలో భాగంగా సోమవారం రాహుల్ గాంధీ ప్రసంగించారు. ఆరుగురు వ్యక్తులు దేశం మొత్తాన్ని ‘పద్మవ్యూహం’లోకి నెట్టివేస్తున్నారని ధ్వజమెత్తారు. మహాభారతంలోని కురుక్షేత్ర సంగ్రామంలో కీలక ఘట్టమైన పద్మవ్యూహాన్ని, వీరమరణం పొందిన అభిమన్యుడిని ప్రస్తావిస్తూ ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తదితరులపై విమర్శలు సంధించారు. “అభిమన్యుడిని చక్రవ్యూహంలో ఎలా హత్య, చేశారో… ఇప్పుడు దేశాన్నీ ఆదే చేయబోతున్నారని ఆరోపించారు. యువత, రైతులు, మహిళలు, చిన్న, మధ్య తరహా వ్యాపారుల చుట్టూ దాన్ని పన్నుతున్నారని, ఈ రోజు కూడా పద్మవ్యూహం పన్నిన వారిలో ఆరుగురే ఉన్నారని రాహుల్ ఆరోపించారు. నరేంద్ర మోదీ, అమిత్ షా, మోహన్ భగవత్, అజిత్ దోవల్, అంబానీ, అదానీ. వీళ్లే అంతా ధ్వంసం చేసేస్తున్నారని రాహుల్‌గాంధీ విమర్శించారు. సభలో సభ్యులుకాని పేర్లను ప్రస్తావనను స్పీకర్ అనుమతించలేదు. రాజకీయ, వ్యాపార గుత్తాధిపత్యాన్ని మరింత బలోపేతం చేయడమే కేంద్ర బడ్జెట్ ముఖ్య ఉద్దేశమని రాహుల్ గాంధీ ఆరోపించారు. దేశాన్ని బందించిన చక్రవ్యూహం వెనుక మూడు శక్తులు ఉన్నాయన్నారు. దేశ సంపద మొత్తాన్ని కబళించాలని చూస్తున్న ఇద్దరు వ్యక్తులు మొదటిది శక్తి కాగా, దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీ, ఆదాయపు పన్ను శాఖ రెండో శక్తి అని తెలిపారు. రాజకీయ కార్యనిర్వాహక వర్గాన్ని మూడో శక్తిగా రాహుల్ అభివర్ణించారు. ఇవి దేశాన్ని విధ్వంసం చేస్తున్నాయని దుయ్యబట్టారు.
Rahul Gandhi | నాపై ఈడీ దాడులకు సిద్ధమవుతుంది…కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
