Site icon vidhaatha

కేజ్రీవాల్‌పై ఎన్‌ఐఏ విచారణకు ఢిల్లీ గవర్నర్‌ సిఫారసు

నిషిద్ధ ఖలిస్తాన్‌ గ్రూపుల నుంచి ఆప్‌కు 16 మిలియన్‌ డాలర్లు
ఫిర్యాదు అందిందన్న ఎల్‌జీ వీకే సక్సేనా
బీజేపీ ఆదేశాలతో మరో కుట్రేనన్న ఆప్‌ నేతలు

న్యూఢిల్లీ: సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌ అనే నిషిద్ధ ఉగ్రవాద సంస్థ నుంచి రాజకీయ నిధులు పొందారన్న అంశంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌పై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)తో విచారణ జరిపించాలని ఆ రాష్ట్ర లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా కేంద్ర హోం శాఖకు సిఫారసు చేశారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కేజ్రీవాల్‌కు బెయిల్‌ ఇచ్చే పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకుంటామని సుప్రీంకోర్టు పేర్కొన్న నేపథ్యంలో ఈ పరిణామం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నది. బీజేపీ ఆదేశాలతో కేజ్రీవాల్‌పై కుట్రగా సక్సేనా సిఫారసులను ఆప్‌ అభివర్ణించింది.

దేవేంద్రపాల్‌ భుల్లార్‌ విడుదల కోసం కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఆప్‌ ప్రభుత్వం ఖలిస్తానీ ఉగ్రవాద సంస్థ నుంచి 16 మిలియన్‌ డాలర్లను పొందిదని తనకు ఫిర్యాదు అందిందని సక్సేనా కేంద్ర హోం శాఖ కార్యదర్శికి రాసిన లేఖలో పేర్కొన్నారు. భుల్లార్‌ ప్రస్తుతం అమృత్‌సర్‌ సెంట్రల్‌ జైల్లో ఉన్నాడు. 1993లో ఢిల్లీలో 9 మంది మృతికి కారణమైన బాంబు పేలుడు కేసులో ఆయన శిక్ష అనుభవిస్తున్నాడు. 2001 ఆగస్ట్‌ 25న టాడా కోర్టు అతడికి మరణశిక్ష విధించగా.. సుప్రీంకోర్టు దానిని యావజ్జీవ కారాగార శిక్షగా మార్చింది.

‘ఫిర్యాదుదారులు అందించిన ఎలక్ట్రానిక్‌ సాక్ష్యాలను ఫోరెన్సిక్‌ పరీక్షల ద్వారా దర్యాప్తు చేయాల్సి ఉన్నది’ అని సక్సేనా.. కేంద్ర హోం శాఖ కార్యదర్శికి రాసిన లేఖలో పేర్కొన్నారని రాజ్‌భవన్‌ వర్గాలు తెలిపాయి. లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నందున ప్రచారంలో పాల్గొనేందుకు వీలుగా తనకు మధ్యంతర బెయిల్‌ ఇవ్వాలన్న కేజ్రీవాల్‌ పిటిషన్‌కు సుప్రీంకోర్టు అంగీకరిస్తుందని భావిస్తున్న నేపథ్యంలో సక్సేనా ఈ మెలిక పెట్టడం విశేషం. సక్సేనాకు అందిన ఫిర్యాదులో ఖలిస్తానీ ఉగ్రవాది గుర్‌పత్వంత్‌ సింగ్‌ పన్నున్‌ విడుదల చేసిన వీడియో ప్రస్తావన ఆ ఫిర్యాదులో ఉన్నది. 2014, 2022 మధ్యకాలంలో 16 మిలియన్‌ డాలర్లను ఆమ్‌ ఆద్మీ పార్టీ తీసుకున్నదని ఆ వీడియోలో పన్నున్‌ ఆరోపించడం కనిపిస్తున్నదని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. 2014లో కేజ్రీవాల్‌ న్యూయార్క్‌ పర్యటన సందర్భంగా గురుద్వారా రిచ్‌మండ్‌ హిల్స్‌ వద్ద కేజ్రీవాల్‌కు, ఖలిస్తానీ నేతలకు మధ్య రహస్య సమావేశం జరిగిందని ఫిర్యాదుదారుడు పేర్కొన్నారు. ఖలిస్తానీ గ్రూపుల నుంచి తగినన్ని నిధులు ఇస్తే భుల్లార్‌ను విడుదల చేయిస్తానని కేజ్రీవాల్‌ హామీ ఇచ్చారని ఫిర్యాదులో ఉన్నది.

బీజేపీ ఆదేశాలతో కేజ్రీవాల్‌పై మరో కుట్ర

తాజా పరిణామంపై ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ మంత్రి సౌరభ్‌ భరద్వాజ్‌ తీవ్రస్థాయిలో స్పందించారు. బీజేపీ ఆదేశాలతో కేజ్రీవాల్‌పై మరో కుట్ర జరుగుతున్నదని ఆరోపించారు. ‘వాళ్లు ఢిల్లీలోని ఏడు సీట్లలోనూ ఓడిపోబోతున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఓటమిపైనా వారికి భయం పట్టుకున్నది’ అని ఆయన విమర్శించారు. గతంలో ఢిల్లీ తీహార్‌ జైల్లో ఉన్న భుల్లార్‌ను ఆరోగ్య కారణాలపై 2015లో అమృత్‌సర్‌ సెంట్రల్‌ జైలుకు తరలించారు.

Exit mobile version