UGC-NET | యూజీసీ నెట్‌పై కీలక నిర్ణయం తీసుకున్న ఎన్‌టీఏ..!

UGC-NET | నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ కీలక నిర్ణయం తీసుకున్నది. దేశవ్యాప్తంగా నీట్‌పై విమర్శలు, ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ ఈ నెల 18న నిర్వహించిన యూజీసీ-నెట్‌ పరీక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

  • Publish Date - June 20, 2024 / 07:40 AM IST

UGC-NET | నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ కీలక నిర్ణయం తీసుకున్నది. దేశవ్యాప్తంగా నీట్‌పై విమర్శలు, ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ ఈ నెల 18న నిర్వహించిన యూజీసీ-నెట్‌ పరీక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దేశంలోని యూనివర్సిటీల్లో లెక్చరర్‌షిప్ (అసిస్టెంట్ ప్రొఫెసర్), జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, పీహెచ్‌డీలలో ప్రవేశాల కోసం జరిగే ఈ పరీక్షను మళ్లీ నిర్వహించాలని నిర్ణయించింది. యూజీసీ నెట్ పరీక్షలో అవకతవకలు జరిగినట్లు నిర్ధారణకు రావడంతో నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ ఈ నిర్ణయం తీసుకున్నది.

అయితే, పరీక్షల్లో పారదర్శకత కాపాడుకోవడం కోసమే రద్దు నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ తెలిపింది. పరీక్షల్లో అవకతవకలపై సీబీఐ విచారణ జరపాలని నిర్ణయించింది. పరీక్షల పారదర్శకతకు కట్టుబడి ఉన్నామని కేంద్ర విద్యాశాఖ స్పష్టం చేసింది. కాగా, మంగళవారం దేశవ్యాప్తంగా 1205 సెంటర్లలో జరిగిన ఈ పరీక్షకు దాదాపు 9 లక్షల మంది అభ్యర్థులు హాజరైన విషయం తెలిసిందే. మరోవైపు, మెడికల్ ఎంట్రన్స్ టెస్టు నీట్ పేపర్ లీకేజీపై వస్తున్న ఆరోపణలపై సైతం కేంద్రం స్పందించింది.

సమయం కోల్పోయిన విద్యార్థులకు కలిపిన గ్రేస్ మార్కులు రద్దు చేస్తూ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. పాట్నాలో నీట్ అవకతవకలపై పోలీసులు విచారణ చేస్తున్నారని చెప్పింది. ప్రాథమిక ఆధారాల మేరకు నీట్‌లో అవకతవకలు జరిగినట్టు నిర్ధారణకు వచ్చామని, బీహార్ ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేసింది. మరోపైపు నీట్ పరీక్షలో అవకతవకలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్‌ను మంగళవారం సుప్రీంకోర్టు విచారించింది.

ఈ సందర్భంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి కోర్టు పలు పదునైన ప్రశ్నలు వేసింది. నీట్ పరీక్షలో 0.001 శాతం నిర్లక్ష్యం కూడా ఉంటే కఠినంగా వ్యవహరించాలని కోర్టు పేర్కొంది. దీంతో పాటు ఎన్టీఏకు, కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసి, ఈ వ్యవహారంపై సమాధానం ఇవ్వాలని కోరింది. ఈ మెడికల్ ఎగ్జామ్ కోసం విద్యార్థులు పడుతున్న కష్టాన్ని గురించి చెబుతూ, ఈ పిటిషన్‌ను ఘర్షణ కోణంలో చూడరాదని సుప్రీంకోర్టు పేర్కొంది.

Latest News