వ్యవసాయోత్పత్తులకు కనీస మద్దతు ధర సహా పలు కీలక డిమాండ్లపై ఆందోళన చేస్తున్న పంజాబ్ రైతులు సోమవారం చలో ఢిల్లీ ప్రదర్శనకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో నొయిడా సరిహద్దుల్లోని దళిత్ ప్రేరణ స్థల్ వద్ద పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను దాటుకుని ఢిల్లీ వైపు బయల్దేరారు. ఈ క్రమంలో మొదటి బృందం రైతులు భారతీయ కిసాన్ పరిషద్ నాయకత్వంలో తమ మార్చ్‌ను సోమవారం ప్రారంభించారు. రైతుల చలో ఢిల్లీ మార్చ్ పిలుపు నేపథ్యంలో నొయిడా నుంచి ఢిల్లీకి వెళ్లే ప్రయాణికులుకు పోలీసులు మార్గదర్శకాలు జారీ చేశారు. రైతుల ఆందోళన నేపథ్యంలో తూర్పు ఢిల్లీలో అన్ని ప్రధాన, చిన్న సరిహద్దు ప్రాంతాల్లో గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశామని ఢిల్లీ పోలీస్ తూర్పు భాగం అదనపు పోలీస్ కమిషనర్ సాగర్ సింగ్ కల్సి ఒక వార్తా సంస్థకు చెప్పారు. ‘బారికేడ్లు ఏర్పాటు చేశాం. ఘర్షణ నివారణ ఎక్విప్‌మెంట్‌తో సిద్ధంగా ఉన్నాం. విస్తృత స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేశాం. సాధారణ ప్రజలు ఇబ్బందులు పడకుండా కూడా చూస్తున్నాం. ఈ విషయంలో ట్రాఫిక్ పోలీసులతో కూడా సమన్వయం చేసుకుంటున్నాం. డ్రోన్ ద్వారా నిఘా పెట్టాం’ అని ఆయన తెలిపారు.
సుమారు ఏడాదిపాటు ఢిల్లీ సరిహద్దుల్లో అన్నదాతలు చారిత్రాత్మక ఆందోళన నిర్వహించిన విషయం తెలిసిందే. వందల మంది రైతులు ఈ ఆందోళన సమయంలో అసువులుబాశారు. అప్పటి పంజాబ్, యూపీ ఎన్నికలకు ముందు ప్రధాన మంత్రి మోదీ ఇచ్చిన హామీతో ఆందోళన విరమించినప్పటికీ ఇంత వరకూ రైతుల డిమాండ్ల నెరవేరలేదు. దీంతో ఈ ఏడాది ఫిబ్రవరి 13 నుంచి మరో దఫా ఆందోళనకు అన్నదాతలు దిగారు. తమ ఢిల్లీ ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో పంజాబ్, హర్యానా శంభు, ఖన్నౌరీ బోర్డర్ పాయింట్ల వద్ద నిరసనలు చేపట్టారు. ఈ నిరసనలకు సంయుక్త కిసాన్ మోర్చా (రాజకీయేతర), కిసాన్ మజ్దూర్ మోర్చా (కేఎంఎం) నాయకత్వం వహిస్తున్నాయి. పార్లమెంటు సమావేశాలు నడుస్తున్న నేపథ్యంలో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమైన రైతులు.. చలో ఢిల్లీ మార్చ్‌కు పిలుపునిచ్చారు. తాము ఫిబ్రవరి 13 నుంచి ఆందోళనలు చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం తమ డిమాండ్లపై స్పందించడం లేదని, కనీసం తమతో చర్చలకు కూడా సిద్ధపడటం లేదని రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కనీస మద్దతు ధరకు చట్టబద్ధమైన హామీతోపాటు స్వామినాథన్ కమిషన్ సిఫారసుల అమలు, రైతులు, వ్యవసాయ కార్మికులకు పెన్షన్, రుణమాఫీ, 2013 భూసేకరణ చట్టం పునరుద్ధరణ, 2020-21 ఆందోళనల సందర్భంగా చనిపోయిన రైతుల కుటుంబాలకు పరిహారం వంటివి అన్నదాతల డిమాండ్లుగా ఉన్నాయి.