Fire Crackers Ban | శీతాకాలంలో దేశ రాజధానిలో పెరుగుతున్న కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఢిల్లీలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ నెల 14 నుంచి 2025 జనవరి ఒకటో తేదీ వరకు ఫైర్ క్రాకర్స్ కాల్చడంపై నిషేధం విధించింది. అలాగే, బాణాసంచా ఉత్పత్తి, నిల్వ, అమ్మకాలతో పాటు వినియోగంపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రజలంతా సహకరించాలని కోరింది. వాయు కాలుష్యాన్ని ఎదుర్కొనేందుకు జనవరి ఒకటో తేదీ వరకు బాణాసంచా తయారీ, నిల్వ, అమ్మకం, వాడకాన్ని నిషేధిస్తూ సెప్టెంబర్ 9న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ ఆదేశాలు జారీ చేశారు. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా ఢిల్లీలో బాణాసంచా తయారీ, నిల్వ, అమ్మకం, వాడకాన్ని ప్రభుత్వం నిషేధించింది.
ఆన్‌లైన్‌లో పటాకుల అమ్మకం మరియు డెలివరీలపై జనవరి 1, 2025 వరకు నిషేధం అమలులో ఉంటుంది. నిషేధాన్ని కఠినంగా అమలు చేసేందుకు ఢిల్లీ పోలీసులు, డీపీసీసీ, రెవెన్యూ శాఖల సహకారంతో కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తామని పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు. కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం 21 ఫోకస్ పాయింట్ల ఆధారంగా శీతాకాల కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తోంది. శీతాకాలం నేపథ్యంలో ఏటా ఢిల్లీలో భారీగా పొగమంచు పేరుకుపోతుంది. దీనికి తోడు చుట్టుపక్కల రాష్ట్రాల్లో వ్యర్థాలను దహనం చేస్తుండడంతో ఆ పొగంతా ఢిల్లీని కమ్మేస్తుంది. ఈ క్రమంలో కాలుష్య నియంత్రణమండలి కీలక నిర్ణయం తీసుకున్నది. ఇప్పటికే నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలో గాలి నాణ్యత సూచి తగ్గుముఖం పడుతుందని పేర్కొంది.