Gender Discrimination | ఇంత దారుణమా? సాక్ష్యంగా శానిటరీ ప్యాడ్‌ ఫొటో కోసం వర్సిటీ సిబ్బంది ఒత్తిడి!

తాము నెలసరిలో ఉన్నామని చెప్పిన మహిళా సిబ్బందిని.. అది రుజువు చేసుకోవాలని, అందుకు శానిటరీ ప్యాడ్స్‌ ఫొటోలు పంపాలని పురుష సూపర్‌వైజర్లు ఒత్తిడి చేసిన ఘటన రోహతక్‌ యూనివర్సిటీలో సంచలనం రేపింది.

representational image

Gender Discrimination | మహిళల నెలసరి చుట్టూనే మానవాళి మనుగడ ఆధారపడి ఉంది! అలాంటి నెలసరిని అవమానించేలా యూనివర్సిటీ స్టాఫ్‌ చేసిన పని మానవత్వానికే సిగ్గుచేటుగా మారింది. అలసిపోయిన మహిళా సిబ్బంది తాము నెలసరిలో ఉన్నామని చెప్పినా, అందుకు ఆలస్యమైందన్నా.. శానిటరీ ప్యాడ్‌ ఫొటో పెట్టి రుజువు చేసుకోవాలని మహర్షి దయానంద్‌ యూనివర్సిటీ సిబ్బంది చేసిన నిర్వాకం.. సంచలనంగా మారింది.

రోహతక్‌లోని ఈ యూనివర్సిటీలో పనిచేసే పారిశుధ్య కార్మికురాలు అక్టోబర్‌ 26వ తేదీన విధులకు ఆలస్యంగా వచ్చారు. ఆలస్యం ఎందుకు అయిందని ప్రశ్నించిన పురుష సూపర్‌వైజర్లకు ఆమె తన ఇబ్బందిని తెలిజేసింది. ఈ సమయంలో ఇద్దరు పురుష సూపర్‌వైజర్లు.. ఆమె అబద్ధమాడుతున్నదని వాదించారు. దుస్తులు విప్పి.. ఆమె నెలసరిలో ఉన్నట్టు రుజువు చేయాలని డిమాండ్‌ చేశారని తెలుస్తున్నది. ఈ ఘటన తర్వాత ఇతర మహిళా కార్మికులు సైతం ఇదే సూపర్‌వైజర్లు తమను సైతం ఇలానే వేధించారని, వాష్‌రూమ్‌లోకి వెళ్లి, శానిటరీ ప్యాడ్‌ ఫొటోలు పెట్టాలని డిమాండ్‌ చేశారని ఫిర్యాదు చేశారు. ‘మర్మావయవాల ఫొటోలు తీసి పంపు.. అప్పుడు నమ్ముతామన్నారు’ అని ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌కు ఒక మహిళ తెలిపారు. తమలో ఇద్దరు అందుకు వ్యతిరేకించడంతో తమను దూషించారని, విధుల నుంచి తొలగిస్తామని బెదిరించారని ఆమె పేర్కొన్నారు.

ఈ ఘటనపై అంతర్గత విచారణ చేయిస్తున్నామని, దోషులుగా తేలినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ కృష్ణన్‌ కాంత్‌ తెలిపారని ఆ పత్రిక పేర్కొన్నది. ఈ ఘటన వెలుగు చూసిన తర్వాత యూనివర్సిటీ మహిళా సిబ్బంది, విద్యార్థులు క్యాంపస్‌లో నిరసనకు దిగారు. తాము సూపర్‌వైజర్‌లకు పంపిన ఫొటోలను రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌కు బాధితులు అందించారు. ఈ కేసులో ఇద్దరు సూపర్‌వైజర్లపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైందని రోహతక్‌ పోలీస్‌ స్టేషన్‌ అధికారి రోషన్‌లాల్‌ తెలిపారు. బీఎన్‌ఎస్‌లోని వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు తెలిపారు.
దీనిపై యూనివర్సిటీ అధికారులు స్పందిస్తూ.. పని ప్రదేశాల్లో అభద్రతాభావానికి గురిచేసే ఎలాంటి చర్యలనూ సహించేది లేదని స్పష్టం చేశారు. తాము అన్ని వేళలా భద్రమైన, గౌరవప్రద, సంస్కృతిపరంగా సున్నితత్వంతో కూడిన పని ప్రదేశానికి కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు.

Read Also |

Bihar Elections | ఢిల్లీలో ఓటు హక్కు ఉన్న వాళ్లు బీహార్‌లో ఓటు వేశారు.. బీజేపీపై రాహుల్ ఆరోపణలు
Explained | తెలంగాణలో రోడ్లపై పొగబండ్లు 42 లక్షలు.. ఒక్క గ్రేటర్‌లోనే ఎన్నో తెలుసా?
Special Trains For Ayyappa Devotees | శబరిమల భక్తుల కోసం రైల్వే శాఖ స్పెషల్ ట్రైన్లు