విధాత: అటవీ ప్రాంతాలు, గుట్టల్లో సంచరించే పులులు, చిరుతలు సమీప మైదాన ప్రాంతాల్లోని జనావాసాల్లోకి వస్తూ భయాందోళనలను సృష్టిస్తున్నాయి. తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట, తుర్కపల్లి మండలాల పరిధిలో చిరుత సంచారం స్థానిక రైతులను, ప్రజలను వణికిస్తుంది.
ఆవుదూడపై దాడి…
తుర్కపల్లి మండలం ఇబ్రహీంపూర్ లో చిరుత పులి ఓ ఆవుదూడ పై దాడి చేసింది. పక్కనే ఉన్న రాజాపేట మండలం బేగంపేటలో చిరుత పాదముద్రలను ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో చిరుత పులి సంచారంతో పంటపొలాలకు వెళ్లి పనిచేసుకునే రైతులు, రైతు కూలీలు ఆందోళనకు గురవుతున్నారు. ఫారెస్టు అధికారులు, స్థానిక గ్రామపంచాయతీల అధికారులు చిరుత పులి కదలికలపై గ్రామీణ ప్రజలను హెచ్చరిస్తూ డప్పు చాటింపు వేయించి అప్రమత్తం చేస్తున్నారు.
