Leopard Attack | చెన్నై : తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో విషాదం నెలకొంది. అన్నమలై కొండల ప్రాంతంలోని వల్‌పరాయి గ్రామంలో ఓ చిరుత భయానక వాతావరణం సృష్టించింది. ఓ ఐదేండ్ల బాలుడిని అడవుల్లోకి లాక్కెళ్లి చంపేసింది. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
వల్‌పరాయి టీ ఎస్టేట్‌లో ఓ వలస కార్మికుడు పని చేస్తున్నారు. కూలీలకు నిర్మించిన క్వార్టర్స్ ముందు వలస కార్మికుడి కుమారుడు ఆడుకుంటున్నాడు. స్థానికంగా ఉన్న చెట్ల పొదల్లో నుంచి ఒక్కసారిగా బయటకు వచ్చిన చిరుత.. సమీపంలో ఆడుకుంటున్న బాలుడి మెడపట్టి లాక్కెళ్లింది. చిరుత గాండ్రిపులు విన్న వర్కర్లు అప్రమత్తమై చూడగా.. బాలుడిని లాక్కెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. వర్కర్లు అందరూ కలిసి గాలించగా, చెట్ల పొదల్లో బాలుడి మృతదేహం కనిపించింది. కుమారుడి మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు.
ఎనిమిది నెలల్లో ఇది మూడో ఘటన అని స్థానికులు పేర్కొన్నారు. వల్‌పరాయిలో గత 8 నెలల్లో ముగ్గురు చిన్నారులను చిరుత పొట్టన పెట్టుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిరుత సంచారంపై అటవీశాఖ అధికారులకు ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని మండిపడ్డారు. ఇప్పటికైనా చిరుత కట్టడిపై చర్యలు తీసుకోవాలని అటవీశాఖ అధికారులను కోరారు.
