విధాత : చిరుత పులి వంటి క్రూర మృగాలు దాడి చేస్తే..భయంతో తప్పించుకునేందుకు ప్రయత్నించే క్రమంలో దాని దాడికి బలైపోయే ఘటనలు తరుచూ చూస్తుంటాం. కాని ఓ బాలుడు మాత్రం తనపై దాడికి పాల్పడిన చిరుతను ధైర్యంగా ఎదుర్కొని తరిమేసిన సాహస ఘటన వైరల్ గా మారింది. అధికారులు తెలిపిన వివరాల మేరకు మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలోని కాంచడ్ ప్రాంతంలో 5 వ తరగతి చదువుతున్న11ఏళ్ల మయాంక్ కువారా అనే బాలుడు..తన స్నేహితుడితో కలిసి పాఠశాల నుంచి ఇంటికి నడుచుకుంటూ వెలుతున్నాడు. ఆ సమయంలో రోడ్డు పక్కన పొదల్లో దాగి ఉన్నచిరుతపులి వెనుక నుంచి కువారా పై దాడి చేసింది. వీపులో తాను వేసుకున్న బ్యాగ్‌పై చిరుత పంజా విసరడంతో.. వెంటనే అప్రమత్తమైన బాలుడు గట్టిగా కేకలు వేస్తూ.. తన స్నేహితుడితో కలిసి ఆ జంతువుపై రాళ్లు విసిరాడు. సమీపంలో ఉన్న ప్రజలు విద్యార్థుల కేకలు విని.. కర్రలు, రాళ్లతో పరిగెత్తి రావడంతో చిరుత పులి సమీపంలోని అడవిలోకి పారిపోయింది. చిరుత పంజా విసిరినప్పుడు, అది నేరుగా బాలుడిని తాకకుండా బ్యాగుకు తగలడంతో ప్రమాదం తప్పింది.
చిరుత దాడి సమాచారం అందుకున్న పోలీసులు, అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. చిరుతపులిని గుర్తించడానికి కెమెరా ట్రాప్‌లను, థర్మల్ డ్రోన్‌లను ఉపయోగిస్తున్నామని.. బోన్లు ఏర్పాటుచేశామని ఫారెస్ట్ డివిజన్ అధికారి పేర్కొన్నారు. చిరుతతో పెనుగులాటలో బాలుడు కువారా చేతికి గాయం కావడంతో విక్రమ్‌గడ్ రూరల్ ఆసుపత్రికి తరలించామని తెలిపారు. దాడి సమయంలో విద్యార్థి స్కూల్ బ్యాగ్ వేసుకొని ఉండడం వల్ల పెను ప్రమాదమే తప్పిందని..చిరుత దాడి చేసినప్పుడు భయపడకుండా ధైర్యం, సమయస్ఫూర్తితో దానిని తరిమికొట్టిన కువారాను అటవీశాఖ అధికారులు అభినందించారు. చిరుత పులి సంచారం ఉన్న ప్రాంతాల్లోని పాఠశాలలను సాయంత్రం 4 గంటలకు మూసివేయాలని విద్యాశాఖ అధికారులకు సూచించారు.
ఇవి కూడా చదవండి :
Ibomma Ravi | ‘గుర్తు లేదు.. మర్చిపోయా’.. విచారణలో ఐబొమ్మ రవి సమాధానం
Mangli Bayilone Ballipalike Song : మంగ్లీ మాస్ సాంగ్ కు..యూ ట్యూబ్ షేక్
