విధాత : శబరిమల వెళ్లే అయ్యప్ప స్వామి మాల ధారణ స్వాములు, భక్తుల కోసం రైల్వే శాఖ
స్పెషల్ ట్రైన్స్ ఏర్పాటు చేసింది. నవంబర్ 14 నుండి జనవరి వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుండి స్పెషల్ ట్రైన్స్ నడపనున్నట్లుగా రైల్వే శాఖ వెల్లడించింది. మొత్తం 60 ప్రత్యేక రైలు సర్వీసులు నడపాలని నిర్ణయించినట్లుగా తెలిపింది. ఈ రోజు నుంచే రిజర్వేషన్ కు అవకాశం కల్పించారు. చర్లపల్లి, మచిలీపట్నం, నర్సాపూర్ నుంచి ఈ ప్రత్యేక రైళ్ల ను ఏర్పాటు చేశారు. ఈ రైళ్ల షెడ్యూల్ తో పాటుగా హాల్ట్ స్టేషన్లు.. పూర్తి వివరాలను రైల్వే అధికారులు వెల్లడించారు.
చర్లపల్లి నుంచి కొల్లాం (రైలు నంబర్ 07107)- నవంబర్ 17, 24 తేదీల్లో, డిసెంబర్ 1, 8, 15, 22, 29 తేదీల్లో, జనవరి 5, 12, 19 తేదీల్లో చర్లపల్లి నుంచి బయల్దేరుతాయి. ఇవి మరుసటి రోజు కొల్లాం చేరుకుంటాయి. ఇక్కడ నుంచి ప్రత్యేక రైళ్లను అందుబాటులో ఉంచారు. ఇవి పగిడిపల్లి, గుంటూరు, గూడూరు, రేణిగుంటలో ఆగుతాయని అధికారులు వెల్లడించారు.
కొల్లాం నుంచి చర్లపల్లి (రైలు నంబర్ 07108)- నవంబర్ 19, 26 తేదీల్లో, డిసెంబర్ 3, 10, 17, 24, 31 తేదీల్లో, జనవరి 7, 14, 21 తేదీల్లో కొల్లా నుంచి బయల్దేరుతాయి. మరుసటి రోజు చర్లపల్లి చేరుకుంటాయి. ఈ రైళ్లు రేణిగుంట, గూడూరు, గుంటూరు, పగిడిపల్లి మీదుగా వస్తాయి. అదే విధంగా మచిలీపట్నం, నర్సాపూర్ నుంచి మరో 50 రైళ్లను అధికారులు ప్రకటించారు.ఇతర రైళ్ల తరహాలోనే ఈ రూట్ లోని అన్ని ప్రధాన స్టేషన్లలో హాల్ట్ సౌకర్యం కల్పించారు.
శబరిమల కు ఈ ప్రత్యేక రైళ్లకు వచ్చే స్పందనకు అనుగుణంగా మరిన్ని రైళ్లను డిసెంబర్ 15 – జనవరి 10 మధ్య ఏర్పాటు చేసే విధంగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. జనవరి లో సంక్రాంతి వేళ అటు సాధారణ ప్రయాణీకుల రద్దీ సైతం పెరగనుంది. దీంతో.. రెగ్యులర్ సర్వీసులను పెంచాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అటు ఆర్టీసీ సైతం శబరిమలకు ప్రత్యేక ప్యాకేజీలతో సర్వీసులను అందుబాటులోకి తెస్తోంది.
