Government Schools Enrolment Dropped | అన్ని రంగాల్లో భారతదేశం దూసుకుపోతున్నదని ఒక పక్కన ప్రభుత్వం ఊదరగొడుతుంటే.. అవే ప్రభుత్వం చెబుతున్న లెక్కలు అందుకు పూర్తి భిన్నమైన చిత్రాన్ని చూపిస్తున్నాయి. విద్యారంగాన్ని గొప్పగా అభివృద్ధి చేస్తున్నామని చెబుతున్నా.. వాస్తవానికి వరుసగా మూడో సంవత్సరం వివిధ ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో చేరికలు తగ్గిపోయాయి. 2023–24తో పోల్చితే 11 లక్షలు తక్కువగా విద్యార్థులు పాఠశాలల్లో చేరారు. ఇదే కాలంలో ప్రైవేటు పాఠశాలల్లో చేరికలు పెరగడం గమనార్హం.
కేంద్ర విద్యాశాఖకు చెందిన యూడీఐఎస్‌ఈ+ ప్రాథమిక విద్య నుంచి ఉన్నత సెకండరీ విద్య వరకూ విద్యారంగ పారామీటర్లను పర్యవేక్షిస్తూ ఉంటుంది. దీని డాటా ప్రకారం.. 2022–23లో 25.18 కోట్ల చేరికలు ఉంటే.. అది 2023–24 నాటికి 24.80 కోట్లకు తగ్గాయి. 2024–25 నాటికి వచ్చేసరికి అవి 24.69 కోట్లకు పడిపోయాయి. కొవిడ్ విశ్వమారి అనంతరం పాఠశాలలు తిరిగి తెరుచుకున్న తర్వాత.. 2022–23లో ఎన్‌రోల్‌మెంట్స్ తగ్గినట్టు యూడీఐఎస్‌ఈ+ డాటా తెలియజేస్తున్నది. దాదాపు కోటి వరకూ తగ్గింది. అయితే.. అంతకు ముందు నాలుగు సంవత్సరాల సగటుతో అధికారులు దీన్ని పోల్చారు. గత నాలుగు సంవత్సరాల సగటుతో పోలిస్తే కోటికి పైగా తగ్గుదల ఉన్నది. వివరాల సేకరణ పద్ధతిలో మార్పు ఇందుకు కారణమని అధికారులు చెప్పారు. 2022–23 తర్వాత యూడీఐఎస్‌ఈ+ స్కూలు స్థాయిలో సగటు సంఖ్యలు కాకుండా.. వ్యక్తిగతంగా విద్యార్థుల రికార్డ్ ఆధారంగా వివరాలు సేకరించింది. ఈ పద్ధతిలో మార్పుతో డూప్లికేట్ ఎంట్రీలు డిలీట్ కావడం సంఖ్య తగ్గుదలకు కారణం అయి ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు. యూడీఐఎస్‌ఈ+ తాజా డాటాను గురువారం (28–08–2025) విడుదల చేశారు. వరుసగా మూడో సంవత్సరం కూడా చేరికలు తగ్గడాన్ని ఈసారి జనాభా తగ్గుదలకు ఆపాదించారు. జననాలు తగ్గడం కారణంగా జనాభా మార్పులతో విద్యార్థుల చేరికలు తగ్గాయని అధికారులు చెప్పారు. అదే సమయంలో ప్రాథమిక పాఠశాలలకు వెళ్లే పిల్లల సంఖ్య తగ్గడం వెనుక ఇదే కారణమా? అనే అంశాన్ని తాజాగా నిర్వహించబోయే జనాభా లెక్కల్లోనే తేలుతుందని అన్నారు. 2023–24తో పోల్చితే 2024–25లో 0.5శాతం (11.13 లక్షల విద్యార్థులు) అంటే.. చాలా స్వల్ప స్థాయిలోనే తగ్గుదల కనిపిస్తున్నది.
ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో చేరికలు తగ్గుతుండగా.. ఇదే మూడేళ్ల కాలంలో ప్రైవేటు పాఠశాలల్లో ఎన్‌రోల్‌మెంట్స్ పెరగడం గమనార్హం. 2022–23లో 13.62 కోట్లుగా ఉన్న చేరికలు.. 2023–24 నాటికి 12.75 కోట్లకు, 2024–25లో 12.16 కోట్లకు తగ్గాయి. అదే సమయంలో ప్రైవేటు విద్యాసంస్థల్లో చేరికలు గణనీయంగా పెరగడం కనిపిస్తున్నది. 2022–23 8.42 కోట్ల నుంచి 2023–24లో 9 కోట్లకు, 2024–25లో 9.59 కోట్లకు పెరిగాయి. 2024–25లో మొత్తం చేరికల్లో ప్రైవేటు స్కూళ్లలో చేరికలు 39 శాతం ఉన్నాయి. 2018—19 తర్వాత ప్రైవేటు స్కూళ్లలో చేరికలు ఇవే అత్యధికం. అంతకు ముందు 33% నుంచి 37 శాతం మధ్యలో ఉండేవి.
మరోవైపు ప్రభుత్వ స్కూళ్ల సంఖ్య 2024—25లో 10.18 లక్షల ప్రభుత్వ స్కూళ్లు ఉండగా.. అవి 2024–25లో 10.13 లక్షలకు తగ్గాయి. ప్రైవేటు పాఠశాలల సంఖ్య 2023—24లో 3.31 లక్షలు ఉంటే.. అవి 2024–25లో 3.79 లక్షలకు పెరిగాయి. అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే 2024-25లో ప్రైమరీ క్లాసులలో (1 నుండి 5 తరగతులు) నమోదు తగ్గటం కనిపించింది. ఇతర అన్ని స్థాయిలలో అంటే.. ప్రి ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ (6 నుంచి 8 తరగతులు), సెకండరీ (9 నుంచి 10 తరగతులు), హయ్యర్ సెకండరీ (11 నుంచి 12 తరగతులు) నమోదు స్వల్పంగా పెరిగింది. 2022-23తో పోలిస్తే 2024-25లో డ్రాపౌట్ రేటు తగ్గిందని మంత్రిత్వ శాఖ అధికారులు కూడా అంగీకరిస్తున్నారు. అయితే.. సెకండరీ స్థాయిలో డ్రాపౌట్ రేటు 2022–23లో 13.8% నుండి 2024–25లో 8.2%కి తగ్గడం కొంత ఆశాజనక అంశం.
స్థూల నమోదు నిష్పత్తి (జీఈఆర్).. అంటే ఆ స్థాయికి సరిపడిన వయసు కలిగిన జనాభాతో పోలిస్తే స్కూలు స్థాయిలో నమోదు నిష్పత్తి. దీని ప్రకారం చూస్తే.. పునాది దశలో .. అంటే ప్రి ప్రైమరీ నుంచి రెండో తరగతి వరకు) జీఈఆర్ 2024–25లో 41.4 శాతంగా ఉన్నది. అంతకు ముందు సంవత్సరం 2023–24తో (41.5) పోల్చితే పెద్ద తేడా ఏమీ లేదు. మధ్యస్థ తరగతులైన మూడు నుంచి ఐదు వరకూ జీఈఆర్ తగ్గుదలను చూపిస్తున్నది. దీనికి సంబంధించి 2023–24లో 96.5 శాతం ఉంటే.. 2024–25లో 95.4% అంటే.. స్వల్ప తగ్గుదల కనిపిస్తున్నది. ఇక ఆరు నుంచి 8వ తరగతి వరకు, తొమ్మిది నుంచి 12వ క్లాస్ వరకు గమనిస్తే.. జీఈఆర్ 2023–24తో పోల్చితే పెరగడం గమనార్హం. అయితే.. మొత్తంగా బాలుర చేరికలు 2023—24లో 12.87 కోట్లు ఉంటే.. అది 2024–25లో 12.76 కోట్లకు తగ్గడం గమనార్హం. బాలికల చేరికల సంఖ్య ఇదే కాలంలో స్వల్పంగా పెరిగింది. గణాంకాల్లో గమనిస్తే.. 2023—24లో 11,93,01,237 నుంచి 2024-25లో 11,93,34,162 కు పెరిగింది.