farmers protest । శంభు సరిహద్దును దాటుకుని ఢిల్లీ వెళ్లేందుకు రైతులు శనివారం చేసిన మూడో ప్రయత్నాన్ని హర్యానా పోలీసులు భగ్నం చేశారు. కనీస మద్దతు ధరపై చట్టపరమైన గ్యారెంటీని డిమాండ్ చేస్తున్న రైతులు.. కొంతకాలంగా శంభు సరిహద్దు వద్ద ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికి రెండు సార్లు 101 మంది రైతులతో కూడిన ’జాతా‘ సరిహద్దు దాటి ఢిల్లీ వెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. తాజాగా శనివారం మరోసారి ప్రయత్నం చేయగా ఢిల్లీ వెళ్లేందుకు అనుమతులు లేవంటూ నిలిపివేశారు. శనివారం మధ్యాహ్నం తర్వాత తాము మరోసారి ఢిల్లీకి నిరసన ప్రదర్శనగా వెళ్లనున్నట్టు రైతు సంఘాల నాయకులు ప్రకటిండంతో శంభు సరిహద్దు వద్ద భద్రతను అమాంతం పెంచేశారు. రైతులు ముందుకు వెళ్లడానికి వీల్లేకుండా సరిహద్దు వద్ద బహుళ అంచెల భద్రతా వ్యవస్థను పోలీసులు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ అడ్డంకులు దాటుకుని వెళ్లేందుకు రైతులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. రైతులను అడ్డుకునేందుకు పోలీసులు నీటి ఫిరంగులను, బాష్పవాయు గోళాలను ప్రయోగించారు.
ఆందోళన చేయడం తమ హక్కని, తమ గొంతును అణచివేయజాలరని రైతులు నినదించారు. ‘మేం ఢిల్లీ వెళ్లేందుకు అనుమతించాలి. ఢిల్లీ వెళ్లి నిరసన తెలిపేందుకు మాకు హక్కుంది’ అని ఒక రైతు అన్నారు. అయితే ఢిల్లీ అధికారవర్గాల నుంచి అనుమతి లభిస్తేనే తాము వారిని అటువైపు వెళ్లేందుకు వీలు కల్పిస్తామని పోలీసులు తేల్చి చెప్పారు. సుప్రీంకోర్టు నియమించిన ఉన్నత స్థాయి కమిటీ తదుపరి సమావేశం జరిగేంత వరకూ ఎదురు చూడాలని అంబాలా సీనియర్ పోలీసు అధికారి ఒకరు రైతులకు విజ్ఞప్తి చేశారు. ‘సమావేశం నిర్వహణకు సూచనలు ఇచ్చారు. డిసెంబర్ 18వ తేదీన తదుపరి సమావేశం నిర్వహించనున్నారు. మీరు ఇక్కడే ప్రశాంతంగా బైఠాయించి, నిబంధనలు పాటించాలి’ అని పోలీసులు రైతులను కోరారు.
సంయుక్త కిసాన్ మోర్చా (నాన్ పొలిటికల్), కిసాన్ మజ్దూర్ మోర్చా సంయుక్త ఆధ్వర్యంలో ఆందోళన చేస్తున్న రైతులు.. ఢిల్లీ వెళ్లేందుకు డిసెంబర్ 6, 8 తేదీల్లో విఫలయత్నం చేసిన విషయం తెలిసిందే.
వ్యవసాయోత్పత్తులకు కనీస మద్దతు ధరతోపాటు వ్యవసాయ రుణాలు మాఫీ చేయాలని, రైతులకు, రైతు కూలీలకు పింఛన్ ఇవ్వాలని, విద్యుత్తు చార్జీలు పెంచొద్దని, 2013 భూసేకరణ చట్టాన్ని పునరుద్ధరించాలని, 2020-21 ఆందోళనల సందర్భంగా చనిపోయిన రైతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని, 2021 లఖింపూర్ హింసలో బాధితులకు న్యాయం చేయాలనే ప్రధాన డిమాండ్లతో రైతులు ఆందోళన చేస్తున్నారు.