Site icon vidhaatha

Heat wave | దేశంలో నిప్పులు చెరుగుతున్న భానుడు.. రాజస్థాన్‌లో 48 డిగ్రీలు దాటిన పగటి ఉష్ణోగ్రతలు

Heat wave : దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. భానుడు భగ్గుమంటున్నాడు. మధ్యాహ్నం వేళల్లో అయితే నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. దాంతో జనం విలవిల్లాడుతున్నారు. ఇళ్ల నుంచి బయటికి రావాలంటే భయంతో గడగడలాడుతున్నారు. గురువారం కూడా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వడగాలులు వీచాయి. ఢిల్లీలో పగటి ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గాయి. మరోవైపు కేరళలో మాత్రం గురువారం భారీ వర్షాలు కురిశాయి.

గురువారం పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్‌లలోని కనీసం 16 ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటాయని భారత వాతావరణ కేంద్రం (IMD) తెలిపింది. రాజస్థాన్‌లోని బాడ్‌మేడ్‌లో అయితే అత్యధికంగా 48.8 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైనట్లు వెల్లడించింది. పలు ప్రాంతాల్లో మరో ఐదు రోజులపాటు వడగాలుల ముప్పు కొనసాగుతుందని పేర్కొంది. దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం గురువారం గరిష్ఠ ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గినట్లు ఐఎండీ తెలియజేసింది.

కేరళలో వర్షాలు

దేశమంతటా ఎండలు మండిపోతుంటే గురువారం కేరళలో మాత్రం కుంభవృష్టి కురిసింది. కేరళలోని పలు ప్రాంతాల్లో గురువారం భారీ వర్షాలు పడ్డాయి. తిరువనంతపురం, కొచ్చిన్, త్రిసూర్‌, కోజికోడ్‌ సహా పలు ప్రధాన నగరాల్లో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఎర్నాకుళం, త్రిసూర్‌ జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ కూడా జారీ అయ్యింది.

Exit mobile version