Heat Wave | జైపూర్ : రాజస్థాన్‌లో ఎండలు దంచికొడుతున్నాయి. భానుడి భగభగలకు ఆ రాష్ట్ర ప్రజలు విలవిలలాడిపోతున్నారు. సూర్యుడు నిప్పులు కక్కుతుండటంతో బయటకు రావాలంటేనే రాజస్థాన్ ప్రజలు వణికిపోతున్నారు. శుక్రవారం రోజు భారీగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.
రాజస్థాన్‌లోని ఫలోడిలో ఈ ఏడాదిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఫలోడిలో శుక్రవారం ఏకంగా 49 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు దేశంలో ఎక్కడా కూడా 49 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాలేదు. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్‌లోని 23 ప్రాంతాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.
ఢిల్లీ, రాజస్థాన్, పంజాబ్, హర్యానా, చండీఘర్, వెస్ట్ ఉత్తరప్రదేశ్, వెస్ట్ మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో మే 28వ తేదీ వరకు 45 డిగ్రీల వరకు పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఎండల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
రాజస్థాన్‌లోని జైసల్మేర్, బర్మార్‌లో 48.3 డిగ్రీలు, మహారాష్ట్రలోని అకోలా, జల్గావ్‌లో 45.8, 45.4 డిగ్రీలు, మధ్యప్రదేశ్‌లోని రాట్లం, రాజ్‌ఘర్హ్‌లో 46.2, 46.3 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. భారీ ఉష్ణోగ్రతల నేపథ్యంలో రాజస్థాన్, పంజాబ్, హర్యానా, చండీఘర్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలకు రెడ్ వార్నింగ్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఎండలు దంచికొడుతున్న నేపథ్యంలో దీర్ఘకాలిక రోగాలతో బాధపడేవారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గుండెపోటు, వడదెబ్బ కూడా వచ్చే అవకాశం ఉందని తెలిపారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం.. ఇండియాలో 1998 నుంచి 2017 వరకు వడదెబ్బకు 1,66,000 మంది చనిపోయారు. 2015 నుంచి 2022 వరకు 3,812 మంది మరణించినట్లు పేర్కొన్నారు. ఏపీలో 2,419 మంది చనిపోయినట్లు గతేడాది జులైలో నిర్వహించిన పార్లమెంట్ సమావేశాల్లో ఈ లెక్కలు వెల్లడించారు.