Humanity Failed | మాయమైపోయిన మానవత్వం.. నడిరోడ్డుపై యువకుడి మృతి.. కానీ.. అతడి భార్య చేసిన పని గ్రేట్‌!

తమకు సహకరించని సమాజాన్ని తిట్టుకునేవాళ్లు చాలా మందే ఉంటారు. కానీ.. ఆ సమాజ నిర్లక్ష్యానికి మానవత్వంతో సమాధానం చెప్పే మహిళలు అరుదుగా ఉంటారు. అలాంటి అరుదైన మహిళ ‘రూప’ గొప్పతనం ఇది.

Humanity Failed | జంతువులు తమ సాటి జంతువు ప్రమాదంలో ఉందంటే అన్నీ కలిసి ఆ ప్రమాదం నుంచి తప్పించేందుకు ప్రయత్నించిన వీడియోలు చూసి.. సెభాష్‌ అంటాం. మనం కూడా అలానే చేయాలని అప్పటికప్పుడు తీర్మానించుకుంటాం. కానీ.. ఆ సమయం వచ్చినప్పుడు ఎంత మంది తోటి వ్యక్తులకు సహాయం చేస్తుంటారనేది ప్రశ్నే. ఈ ప్రశ్న బెంగళూరు రోడ్డుపై మళ్లీ తలెత్తింది. తోటి మానవుల ప్రమాదం పట్ట మనం ఎంత నిర్లక్ష్యంగా ఉంటున్నామో ఈ ఘటన మరోసారి చాటి చెప్పింది. అమానుషత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నదీ ఘటన.

బెంగళూరులోని బాలాజీ నగర్‌లో ఉంటున్న మెకానిక్‌ వెంకటరామన్‌ (34) డిసెంబర్‌ 13వ తేదీ తెల్లవారుజామన తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. తనకు ఛాతీలో బాగా నొప్పి వస్తుందని చెప్పాడు. దీంతో అతని భార్య రూప.. అతడిని తన స్కూటర్‌పై తీసుకుని సమీపంలోని హాస్పిటల్‌కు బయల్దేరింది. కానీ.. అక్కడ సిబ్బంది డాక్టర్‌ లేరంటూ అతడికి చికిత్స అందించేందుకు నిరాకరించారు. దాంతో ఆ దంపతులు వెంటనే మరో హాస్పిటల్‌కు వెళ్లారు. ‘రెండో హాస్పిటల్‌కు వెళ్లాక అక్కడి వాళ్లు.. అతనిని స్ట్రోక్‌ వచ్చిందని, వేరే హాస్పిటల్‌కు తీసుకువెళ్లాలని చెప్పారు’ అని రూప ఎన్డీటీవీకి తెలిపారు. తన పరిస్థితి బాగోలేదని చెప్పినా వినిపించుకోలేదు. కనీసం ఎమర్జెన్సీ కేర్‌ అందించేందుకు లేదా అంబులెన్స్‌ సమకూర్చేందుకు కూడా ఆ హాస్పిటల్‌ సిబ్బంది సహకరించలేదు. ఒకవైపు బాధతో విలవిల్లాడుతున్న భర్త.. మరో వైపు ఎవరూ సహకరించని బాధ! అంతటి బాధలోనూ ఆమె ప్రైవేటు అంబులెన్స్‌ కోసం ప్రయత్నించింది. కానీ.. ఎవరూ తగిన స్పందించలేదు.

దీంతో రూప తన భర్తను స్కూటర్‌పై కూర్చొనబెట్టుకుని మరో హాస్పిటల్‌కు వెళ్లాలని నిర్ణయించుకుంది. అయితే.. కొంతదూరం వచ్చారో లేదో వెంకటరామన్‌.. స్కూటర్‌ నుంచి కిందకి ఒరిగిపోయాడు. దీంతో రూప కూడా స్కూటర్‌పై పట్టుకోల్పోయింది. ఇద్దరూ కింద పడ్డారు. ఇద్దరికీ గాయాలయ్యాయి. తన భర్తను కాపాడాలని రోడ్డున పోయే ప్రతి వాహనాన్ని ఆపేందుకు ఆమె విఫలప్రయత్నాలు చేసింది. ఎవ్వరూ ఆగలేదు.. సరికదా.. కనీసం ఏం జరిగిందో చూసేందుకు కూడా సిద్ధపడలేదు. కొంతసేపటికి ఒక కారు ఆగింది. అందులో వెంకటరామన్‌ను హాస్పిటల్‌కు తీసుకువెళ్లారు. కానీ.. అతడు మార్గమధ్యంలోనే చనిపోయాడని అక్కడ పరిశీలించిన డాక్టర్లు చెప్పారు. రూప నిలువునా కూలిపోయింది. ఆ ఘటనను ఎన్డీటీవీతో పంచుకున్న రూప.. ‘నా భర్తకు సహాయం చేయడంలో మానవత్వం విఫలమైంది. నేను ఒంటినిండా రక్తంతో ఉన్నాను. సహాయం కోసం వేడుకుంటున్నాను. కానీ.. ఏ ఒక్కరూ రాలేదు’ అని ఆమె చెప్పారు.

ఈ ఘటనపై వెంకటరామన్‌ తల్లి మాట్లాడుతూ.. ‘నాకు ఏం చెప్పాలో తెలియడం లేదు. నాకు మాటలు రావడం లేదు. నా కొడుకు పోయాడు’ అన్నారు. వాళ్లకు ఇద్దరు పిల్లలు ఉన్నారని, వాళ్ల భవిష్యత్తు ఏంటో అర్థం కావడం లేదని రూప తల్లి చెప్పారు.

ఇంత జరిగినా.. తనకు సహాయం చేయని ఈ సమాజాన్ని రూప ఛీత్కరించుకోలేదు. సమాజాన్ని శపించలేదు. కానీ.. తాను మానవత్వాన్ని ప్రదర్శించి సమాజం చెంప మీద గట్టి దెబ్బ కొట్టింది రూప. ‘మానవత్వం విఫలమైంది. కానీ.. మా వంతు మానవత్వాన్ని మేం ప్రదర్శించాం. ఆయన కళ్లను దానం చేశాం’ అని రూప కంట కన్నీరు జారిపోతుండగా చెప్పారు. ఏ ఒక్క హాస్పిటల్‌లోనైనా ఎమర్జెన్సీ కేర్‌ దొరికి ఉంటే వెంకటరామన్‌ బతికేవాడేమో. ఏ ఒక్క వాహనం ఆగినా.. వారి జీవితం మరోలా ఉండేదేమో! కానీ.. వెంకటరామన్‌ ప్రాణాలు తీసుకున్న సమాజ నిర్ల్యక్షం.. ఆయన నేత్రాలను మాత్రం స్వీకరించింది. ఈ నిర్ల్యక్షం ఎప్పటికైనా మారుతుందేమో అతడే చూడాలనుకున్నదేమో తన భర్త కళ్లు దానం చేసి.. తన మానవత్వాన్ని చాటుకుంది రూప!

Read Also |

Diamond Rain | అక్కడ వజ్రాల వానలు! తెచ్చుకోవడం సాధ్యమేనా?
Real Estate Mafia | నిజాయతీపరులైన ఐఏఎస్, ఐపీఎస్‌లూ ఇళ్లు కొనలేని దుస్థితి.. ఇక మధ్యతరగతి మాటేంటి?
Black Thread | కాలికి నల్ల దారం కట్టుకున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోండి!

Latest News