Diamond Rain | మనకు కొన్ని కాలాల్లో వడగండ్ల వానలు పడుతుంటాయి. దీన్నే రాళ్లవాన అని కూడా అంటారు. బఠాణీ గింజంత రాళ్లు మొదలుకుని.. జామకాయంత రాళ్లు పడిన సందర్భాలూ ఉన్నాయి. ఇవి పంటలను బాగా దెబ్బతీస్తాయి. దీని సంగతిని పక్కనపెడితే.. ఇలానే ఆకాశం నుంచి వజ్రాల వాన (Diamond Rain) కూడా కురుస్తుంది తెలుసా? ఇదేదో ఫిక్షన్ అనుకుంటున్నారా? కానే కాదు! వజ్రాల వాన కురుస్తుంది. కానీ.. మన భూమిపై కాదు. గురు గ్రహం (Jupiter), శని, (Saturn), యురేనస్, నెఫ్ట్యూన్ వంటి గ్రహాల్లో కురిసే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
వజ్రాల వాన ఎలా ఏర్పడుతుంది?
గురుడు, శని, యురేనస్, నెఫ్ట్యూన్ వంటి గ్రహాల ఉపరితల ఆవరణం హైడ్రోజన్, హీలియం, మీథేన్ (Methane – CH₄) వంటి వాయువులతో నిండి ఉంటుంది. మీథేన్‌లో ఉండే కార్బన్.. వజ్రానికి మూల పదార్థం. ఈ గ్రహాల్లో పీడనం.. భూమితో పోల్చితే లక్షల రెట్లు అధికంగా ఉంటుంది. ఉష్ణోగ్రత సంగతికి వస్తే.. మనం 40 డిగ్రీలు దాటితేనే అల్లాడిపోతాం.. అలాంటిది అక్కడ ఉష్ణోగ్రత వేల డిగ్రీల్లో ఉంటుంది. అక్కడ భారీ స్థాయిలో పిడుగులు పడుతుంటాయి. పిడుగల వల్ల మీథేన్ విడిపోతుంది. దాంతో మీథేన్ అణువులు (CH₄) కార్బన్, హైడ్రోజన్‌గా విడిపోతాయి. ఇలా విడుదలైన కార్బన్.. మొదట కార్బన్ ధూళిగా (soot) మారుతుంది. గురుత్వాకర్షణ శక్తి కారణంగా ఈ కార్బన్ ధూళి గ్రహంలోపలికి పడుతుంది. దీంతో పీడనం, ఉష్ణోగ్రత పెరుగుతాయి. భారీ పీడనం, ఉష్ణోగ్రతల కారణంగా కార్బన్ అణువులు పునఃవ్యవస్థీకరణకు గురవుతాయి. దాంతో వజ్ర నిర్మాణం ఏర్పడుతుంది. అవి కూడా చిన్న చిన్న వజ్రకణాలు తయారవుతాయి. ఈ వజ్రాల బరువు కారణంగా అవి వర్షం రూపంలో కిందికి జాలువారుతాయి. అందుకే దీనిని డైమండ్ రెయిన్ అని పిలుస్తారు. శాస్త్రవేత్తలు ప్రయోగశాలల్లో మీథేన్ మిశ్రమాలపై అధిక పీడనం, లేజర్‌షాక్స్ ద్వారా నానో డైమండ్లు తయారు చేసి నిరూపించారు.
భూమిపై ఎందుకు జరుగదు?
- భూమిపై మీథేన్ వాయువు చాలా తక్కువ.
- గురుడు, శని గ్రహాల మీద ఉండేంత పీడనం గానీ, ఉష్ణోగ్రత కానీ ఇక్కడ లేవు.
- అందుకే ఇక్కడ వజ్రాల వర్షం సాధ్యం కానిది.
వజ్రాల పరిమాణం ఎంత?
ఇతర గ్రహాల్లో పడే వజ్రాలు మనం ఆభరణాల్లో వాడుతున్న వజ్రాల్ల పెద్దవి కావు. నిజానికి అవి ధూళి కణాలంత ఉంటాయి. కొన్ని అరుదైన సందర్భాల్లో ఇసుక రేణువు అంత లేదా.. ఉప్పు కళ్లు లేదా పప్పు గింజంత కూడా ఉంటాయని అంచనా. ఇవన్నీ నానో డైమండ్లు, మైక్రో డైమండ్లు కోటాను కోట్ల సంఖ్యలో కురుస్తాయి. అక్కడి తీవ్ర పీడనాల కారణంగా అవి కిందికి పడుతూ.. వెంటనే కరిగిపోయే అవకాశమూ ఉందని శాస్ర్తవేత్తలు చెబుతున్నారు. ఇలాంటి వజ్రాల వాన అధికంగా నెఫ్ట్యూన్‌పై పడుతుంది. ఎందుకంటే అక్కడ మీథేన్, పీడనం, ఉష్ణోగ్రతలు కూడా అత్యధిక స్థాయిలో ఉంటాయి. తర్వాతి స్థానాల్లో యురేనస్, శని, గురు గ్రహాలు ఉంటాయి.
ఈ వజ్రాలను భూమిపైకి తేవచ్చునా?
ఇప్పటి సాంకేతిక పరిజ్ఞానాన్ని దృష్టిలో ఉంచుకుంటే అసాధ్యమేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అన్నింటికి మించి భూమికి సుమారు 4.3 బిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్న నెఫ్యూన్ నుంచి అక్కడ కురిసిన వజ్రాలు తేవడానికి ఒక్క ప్రయాణానికే కొన్ని దశాబ్దాలు పడతాయి. ఇది పక్కన పెడితే.. గంటకు వేల కిలోమీటర్ల వేగంతో వీచే గాలులు, భూమితో పోల్చితే లక్షల రెట్ల పీడనం, వజ్రాలే కరిగిపోయేంత వేడి.. ఇలాంటి పరిస్థితుల్లో వాటిని తీసుకురావడం గురించి ఆలోచించే పరిస్థితి కూడా లేదు.
Read Also |
Real Estate Mafia | సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్‌లూ ఇళ్లు కొనలేని దుస్థితి.. ఇక మధ్యతరగతి మాటేంటి?
Bengal Tiger Climbing Tree : నిటారు చెట్టును ఎక్కెసిన పెద్దపులి..వైరల్ వీడియో
Black Thread | కాలికి నల్ల దారం కట్టుకున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోండి!
