Real Estate Mafia |హైదరాబాద్ మహా నగరంలో రియల్ ఎస్టేట్ మాఫియాను నియంత్రణలో పెట్టేందుకు గతంలో హౌసింగ్ బోర్డు, హౌసింగ్ కార్పొరేషన్, రాజీవ్ స్వగృహ వంటి సంస్థలను ఉమ్మడి రాష్ట్ర పాలకులు ఏర్పాటు చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తరువాత లక్ష్యాన్ని దెబ్బతీసి, వాటి మనుగడను ప్రశ్నార్థకం చేశారన్న విమర్శలు వచ్చాయి. ప్రభుత్వ భూములను, హౌసింగ్ బోర్డు భూములను కూడా వేలం పాటలో గజం చొప్పున విక్రయిస్తూ పరోక్షంగా రియల్ ఎస్టేట్ దోపిడికి సహకారమందించారనే వాదనలూ ఉన్నాయి. ఫలితంగా సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సైతం ఇళ్లు కొనుగోలు చేయలేని దుస్ధితి తలెత్తింది. మధ్య తరగతి ప్రజలు కూడా రెసిడెన్షియల్ అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్ ఖరీదు చేయలేని దీనస్థితిలో ఉన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు పరిధి లోపల ఎక్కడ చూసినా నాలుగైదు కోట్ల రూపాయలకు తక్కువకు ఫ్లాట్ లభ్యం కాని పరిస్థితులను తెలంగాణ ప్రభుత్వాలు కల్పించాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు సమకూర్చుకునేందుకు భూములను తెగనమ్మిన విధంగానే, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కన్పించిన భూములను విక్రయిస్తున్నది. బెంగళూరు, ముంబై, న్యూఢిల్లీ వంటి మహా నగరాలలో మద్య తరగతి ప్రజల కోసం అపార్ట్ మెంట్లు, లే అవుట్లు వేసి స్థలాలు విక్రయిస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులను నియంత్రించేందుకు, ధరలకు ముకుతాడు వేసేందుకు ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి ఇస్తున్నది. ఇక్కడేమో మధ్య తరగతి ప్రజలకు బతుకు లేకుండా రియల్టర్లకు అనుకూలంగా ఎకరాల చొప్పున ధర కట్టి ప్రభుత్వ భూములను విక్రయిస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. గజాల చొప్పున రేట్లను నిర్ణయించి విక్రయించడం మూలంగా మధ్య తరగతి ప్రజలకు స్థలం దొరకని పరిస్థితులు కల్పిస్తున్నారని అంటున్నారు.
నాటి విజన్ కొనసాగించలేరా?
తెలంగాణ పాలకుల కన్నా ఉమ్మడి రాష్ట్ర పాలకులకు ఒక విజన్ ఉందని, మధ్య తరగతి ప్రజల కోసం ఏపీ హౌసింగ్ బోర్డు, ఆ తరువాత రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ లను ఏర్పాటు చేశారని పలువురు గుర్తు చేస్తున్నారు. 1960 సంవత్సరంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏపీ హౌసింగ్ బోర్డును ప్రారంభించింది. 1979 లో ఎస్సీ, ఎస్టీలు, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారి కోసం ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. వైఎస్రా జశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏపీ హౌసింగ్ బోర్డు నుంచి మధ్య తరగతి ఇళ్ల నిర్మాణాన్ని తప్పించి రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. సీనియర్ ఐఏఎస్ అధికారి శాలినీ మిశ్రా బాధ్యతారాహిత్యం, అవినీతి కారణంగా ఆ సంస్థ కోలుకోని విధంగా దెబ్బతిన్నదనే ఆరోపణలు ఉన్నాయి. అప్పటి హౌసింగ్ మంత్రి బొత్స సత్యానారాయణ ఆమెను నియంత్రించలేక పోయారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి గుదిబండగా మార్చి, రూ.750 కోట్లు పెండింగ్ లో పెట్టి వెళ్లిపోయారు. ఏపీ హౌసింగ్ బోర్డు బాగ్ లింగంపల్లి, బర్కత్ పుర, విజయనగర్ కాలనీ, ఎస్.ఆర్.నగర్, వెంగళరావు నగర్, కూకట్ పల్లి, మారేడుపల్లి తదితర ప్రాంతాలలో ఎల్ఐజీ, ఎంఐజీ, హెచ్ఐజీ స్కీం కింద ఇళ్లను నిర్మాణం చేసి విక్రయించింది. ఈ ఫ్లాట్ల కోసం మధ్య తరగతి ప్రజలు పోటీపడి కొనుగోలు చేసేవారు. 1972 సంవత్సరం వరకు హైదరాబాద్‌కే పరిమితం అయిన హౌసింగ్ బోర్డు తన కార్యకలాపాలను ఉమ్మడి రాష్ట్రం మొత్తం విస్తరించి గొప్ప పేరును సాధించింది. 1973 తరువాత జిల్లా కేంద్రాలు, డిమాండ్ ఉన్న ప్రాంతాలలో ఎల్ఐజీ, ఎంఐజీ, హెచ్ఐజీ ఇళ్లను నిర్మాణం చేసి లాటరీ విధానంలో కేటాయించి విక్రయించింది. 1977 సంవత్సరంలో కోస్తా ప్రాంతంలో తుఫానులు రావడంతో వేలాది మంది నిరాశ్రయులు అయ్యారు. వీరికి నిలువ నీడనిచ్చేందుకు 1979 సంవత్సరంలో ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ ను ఏర్పాటు చేశారు. ఈ కార్పొరేషన్ ద్వారా గ్రామాలలో లక్షలాది మంది ఎస్సీ, ఎస్టీలు, దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్న కుటుంబాలు పక్కా ఇళ్లను నిర్మించుకున్నారు. ఇంటి నిర్మాణానికి అవసరమైన సిమెంట్, ఇటుకలు, కిటికీలు, దర్వాజాలు, తలుపులు ప్రభుత్వం సమకూర్చేది. ఉమ్మడి రాష్ట్రంలో ఒక కోటి ఐదు లక్షల కుటుంబాలకు పక్కా ఇళ్లను నిర్మించి అందచేసింది. ఈ ఇళ్ల నిర్మాణం కోసం దశల వారీగా రాష్ట్ర ప్రభుత్వం రూ.15,550 కోట్లు ఖర్చు చేసింది. 2012కు పూర్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద 40 లక్షల ఇళ్లను నిర్మాణం చేసిం లబ్ధిదారులకు అందచేసింది. ప్రస్తుతం ఈ కార్పొరేషన్ ద్వారా తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, డబుల్ బెడ్ రూమ్ పథకం అమలు చేస్తున్నారు.
హౌసింగ్ బోర్డు లక్ష్యాన్ని నీరు గార్చారు
ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అయిన తరువాత తెలంగాణ హౌసింగ్ బోర్డు అనే పదం వినపడకుండా కనపడకుండా చేయడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విజయవంతమైందనే ఆరోపణలు ఉన్నాయి. పరోక్షంగా రియల్ ఎస్టేట్ మాఫియాకు వెన్నుదన్నుగా నిలిచిందని విమర్శలు వచ్చాయి. హౌసింగ్ బోర్డు ద్వారా మధ్య తరగతి ప్రజల కోసం ఇళ్ళ నిర్మాణం చేయడం వదిలేసి, భూములను వేలం వేసే సంస్థగా మార్చివేసిందని పలువురు మండిపడుతున్నారు. కనీసం లీజులకు ఇచ్చిన స్థలాల నుంచి అయిన అద్దె సొమ్ములు వసూలు చేస్తున్నారా అంటే అదీ లేదు. అత్యంత విలువైన ప్రాంతాలలో ఉన్న భూములను వాణిజ్యపరంగా ఉపయోగించుకోలేక, లీజు రూపంలో ఆదాయం పొందలేకపోయింది. ప్రతి నెలా రూ.40 కోట్లకు పైగా అద్దెల రూపంలో ఆదాయం రావాల్సి ఉండగా, అందులో రూ.5 కోట్లు కూడా వసూలు కావడం లేదు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించిందో అర్థమవుతోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. బోర్డు పరిధిలో అందుబాటులో ఉన్న భూములలో ఎల్ఐజీ, ఎంఐజీ, హెచ్ఐజీ నిర్మాణాలు చేపట్టే బదులు విక్రయించడం మొదలు పెట్టారు. పలు ప్రాంతాలలో ఉన్న హౌసింగ్ బోర్డు భూముల విక్రయం ద్వారా సుమారు రూ.8వేల కోట్ల వరకు సమకూరుతుందని ప్రభుత్వం అంచనాకు వచ్చింది. ఆగస్టు నెలలో కూకట్ పల్లి హౌసింగ్ బోర్డులో వేలం వేయగా ఎకరం రూ.70 కోట్ల చొప్పున గోద్రెజ్ ప్రాపర్టీస్ 7.8 ఎకరాలను రూ.547 కోట్లకు కొనుగోలు చేసింది. చందానగర్, కరీంనగర్, ఘట్ కేసర్, సింగపూర్ టౌన్ షిప్ ప్రాంతంలో ఉన్న భూములను వేలం వేయడం ద్వారా రూ.1వేయి కోట్ల రాబడి వస్తుందని అంచనా వేశారు. ఇలా వేయడం మూలంగా మధ్య తరగతి ప్రజలు ఇళ్లను కొనుగోలు చేయలేకపోయారు. ఆ భూములలో ఎల్ఐజీ, ఎంఐజీ, హెచ్ఐజీ ఫ్లాట్లను నిర్మాణం చేసి లాటరీ ద్వారా కేటాయిస్తే వేలాది మందికి నిలువ నీడ లభించేది.
వీరే కొనలేకపోతే… ఎవరు కొనుగోలు చేస్తారు?
రాష్ట్రంలో సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు ఇంటి స్థలాలను కొనుగోలు చేయలేని పరిస్థితిని తీసుకురావడంలో తెలంగాణ ప్రభుత్వం విజయవంతమైందనే చెప్పాలి. వీరికి సీనియారిటీని బట్టి ప్రతినెలా ఒక లక్షకు పైగా మూడు లక్షల రూపాయల లోపు వేతనం, అలవెన్సుల రూపేణా లభిస్తుంది. ఔటర్ రింగ్ రోడ్డు పరిధి లోపల మూడు వందలు లేదా ఐదు వందల చదరపు అడుగుల స్థలం కొనుగోలు చేయలేని విధంగా ధరలు మండుతున్నాయి. ఎక్కడ చూసినా ఒక మంచి లే అవుట్ లో చదరపు గజం ఒక లక్ష రూపాయలకు తక్కువ పలుకడం లేదు. స్థలంతో పాటు ఇంటి నిర్మాణం కోసం కనీసం ఆరేడు కోట్ల రూపాయలకు పైగా వెచ్చించాల్సి వస్తున్నది. ఇక గ్రూప్ వన్ అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులకు ఇండిపెండెంట్ హౌస్ అనేది ఒక కల గానే మిగిలిపోతున్నది. రెసిడెన్షియల్ అపార్ట్ మెంట్ లో ఫ్లాట్ కొనుగోలు చేసుకుని ఇదే తమ నివాసం అని సంబురపడాల్సిన పరిస్థితులను ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర పాలకులు కల్పించారనే చెప్పాలి.
Read Also |
Bengal Tiger Climbing Tree : నిటారు చెట్టును ఎక్కెసిన పెద్దపులి..వైరల్ వీడియో
Iran Red Beach : సముద్రం రక్తంతో నిండిందా…!
Black Thread | కాలికి నల్ల దారం కట్టుకున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోండి!
