Telangana Middle Class Housing | గచ్చిబౌలిలో 111 ఫ్లాట్లకు 2,685 దరఖాస్తులు.. ఇదీ మిడిల్ క్లాస్ ఇండ్ల డిమాండ్‌!

తెలంగాణలో ప్రభుత్వం నిర్మించి విక్రయించే ఫ్లాట్లకు ఎంతటి డిమాండ్‌ ఉన్నదో తాజా ఉదంతం తెలియజేస్తున్నది. హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని 111 ఫ్లాట్లను వేలానికి ఉంచగా.. వాటికోసం 2685 మంది పోటీపడటం.. మధ్యతరగతి సొంతింటి కలలకు నిదర్శనంగా నిలుస్తున్నది.

విధాత, హైదరాబాద్ :

Telangana Middle Class Housing | మధ్య తరగతి ప్రజలు తక్కువ ధరలో సొంత ఇంటి కోసం ఎంత ఆరాటపడుతున్నారో భారీ ఎత్తున వచ్చిన దరఖాస్తుల సంఖ్యనే ఉదాహరణ. గచ్చిబౌలిలో పలు అపార్ట్‌మెంట్లలో ఉన్న 111 ఫ్లాట్ల విక్రయానికి నోటిఫికేషన్ ఇవ్వగా 2,685 దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో ఫ్లాట్ కు సుమారు 24 మంది చొప్పున పోటీపడ్డారు అంటే తెలంగాణ హౌసింగ్ బోర్డు నిర్మించి ఇచ్చే వాటికి ప్రజల్లో ఎంతగా డిమాండ్ ఉన్నదో స్పష్టమైంది. ఇప్పటికైనా తెలంగాణ హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కళ్ళు తెరిచి మధ్య తరగతి ప్రజల కోసం నగరం చుట్టూ పెద్ద ఎత్తున అపార్ట్‌మెంట్‌ ఫ్లాట్ల నిర్మాణం చేపట్టాల్సి ఉందంటున్నారు. ప్రభుత్వ భూములను విక్రయించి వేల కోట్లు సొమ్ము చేసుకోవడం కాదని, మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి ప్రజల కోసం ఫ్లాట్లను నిర్మాణం చేసి ఇవ్వాల్సిన బాధ్యత తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

అల్పాదాయ (ఎల్ఐజి) వర్గాల కోసం హౌసింగ్ బోర్డు ప్రత్యేకంగా కేటాయించిన వివిధ ప్రాంతాల్లోని ఫ్లాట్ల కొనుగోలుకు ప్రజల నుంచి భారీ స్పందన వచ్చింది. హైదరాబాద్ , వరంగల్, ఖమ్మం ప్రాంతాల్లో ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మించిన ఫ్లాట్లను ఎల్ఐజి వర్గాలకు (రూ.6 లక్షల వార్షికాదాయం) విక్రయించడానికి, ఆసక్తి ఉన్న వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ హౌసింగ్ బోర్డు డిసెంబర్ 16 వ తేదీన నోటిఫికేషన్ ఇచ్చింది. 3 వ తేదీ సాయంత్రం వరకు మొత్తం 3,096 దరఖాస్తులు వచ్చాయి.

గచ్చిబౌలిలో లాటరీ ప్రత్యక్ష ప్రసారం

హైదరాబాద్ గచ్చిబౌలి ప్రాంతంలోని ఫ్లాట్ల కేటాయింపు ప్రక్రియకు సంబంధించిన లాటరీని అదే ప్రాంతంలో జనవరి 6 వ తేదీ మంగళవారం ఉదయం, మధ్యాహ్నం రెండు విడతల్లో నిర్వహించున్నారు. ఉదయం పూట రాం కీ ప్రాజెక్టులోని 76 ఫ్లాట్లకు, మధ్యాహ్నం వసంత ప్రాజెక్టు లోని 35 ఫ్లాట్లకు ఈ లాటరీ నిర్వహిస్తున్నారు. ఈ ఫ్లాట్ల కొనుగోలుకు భారీగా దరఖాస్తులు వచ్చిన నేపథ్యంలో, దరఖాస్తుదారులు, లాటరీ ప్రక్రియ ప్రత్యక్షంగా చూసేందుకు రావద్దు అని, ఈ ప్రక్రియ మొత్తం ఆన్ లైన్ లోనూ, యూ ట్యూబ్ తదితర మాధ్యమాల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నట్లుగా హౌసింగ్ బోర్డు తెలిపింది. అనూహ్యంగా ఒక్కో ఫ్లాట్ కు సగటున 25 మంది వరకు దరఖాస్తు చేసుకున్న నేపథ్యంలో, ఉన్నతాధికారుల ఆదేశాలను అనుసరించి లాటరీ నిర్వహించే ప్రాంగణంలోని స్థలాభావం, భద్రతా కారణాల రీత్యా లాటరీ ప్రక్రియ కు ప్రజలను అనుమతించబోవడం లేదని తెలిపారు.

లాటరీ ప్రక్రియను ప్రత్యక్ష ప్రసారం చేయడం తోపాటు, ఈ ప్రక్రియ మొత్తాన్ని వీడియో రికార్డు కూడా చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. అంతే కాకుండా లాటరీ జరిగే ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్క్రీన్ల ద్వారా లాటరీ నిర్వహణ ను చూడవచ్చని తెలిపారు. దరఖాస్తులు దారులు లాటరీ ప్రక్రియను యూట్యూబ్‌ లింక్‌ ద్వారా వీక్షించవచ్చు.

Read Also |

Tribal Cultural Revival Explained | మేడారంలో ఆదివాసీ సాంస్కృతిక పునర్జీవనం
Kavitha resignation| నా రాజీనామా ఆమోదించండి : కన్నీటితో కవిత వినతి

Latest News